ఆమెను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు

ABN , First Publish Date - 2021-07-25T06:10:40+05:30 IST

బ్రహ్మంగారిమఠంలోని మహానివేదన మండపంలోకి మారుతీ మహాలక్షుమ్మను వెళ్లకూడదు అనడానికి ప్రజలకు హక్కు లేదని, ఆమెను ఎవరూ అడ్డుకోకూడదని సీఐ కొండారెడ్డి తెలిపారు.

ఆమెను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు
గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న సీఐ కొండారెడ్డి

కందిమల్లాయపల్లె ప్రజలతో సీఐ కొండారెడ్డి

బ్రహ్మంగారిమఠం, జూలై 24: బ్రహ్మంగారిమఠంలోని మహానివేదన మండపంలోకి మారుతీ మహాలక్షుమ్మను వెళ్లకూడదు అనడానికి ప్రజలకు హక్కు లేదని, ఆమెను ఎవరూ అడ్డుకోకూడదని సీఐ  కొండారెడ్డి తెలిపారు. దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతీ మహాలక్షుమ్మ మహానివేదన మందిరంలోకి ప్రవేశిస్తే అడ్డుకుంటామని గ్రామ ప్రజలు నాలుగు రోజుల కిందట స్థానిక పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశారు. దీనిపై మాట్లాడేందుకు శనివారం మైదుకూరు రూరల్‌ సీఐ టీవీ కొండారెడ్డి, బి.మఠం ఎస్‌ఐ శ్రీనివాసులు కందిమల్లాయపల్లె ప్రజలతో వీరబ్రహ్మేంద్రస్వామి పార్కులో సమావేశం అయ్యారు. సీఐ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పీఠాధిపతిగా ఎంపికైన తర్వాత మహానివేదన మందిరంలో ఎవరు ఉండాలనేది వారు నిర్ణయం తీసుకుంటారన్నారు. అప్పటివరకూ మారుతీ మహాలక్షుమ్మను ఎవ్వరూ అడ్డుకోకూడదని, గతంలో మహానివేదన మందిరంలో ఎవరైతే ఉన్నారో వారే ఉండవచ్చని సీఐ చెప్పారు. ఈ విషయంపై తమకు పది రోజులు గడువు కావాలని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ రామమూర్తి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:10:40+05:30 IST