ఎవరూ పట్టించుకోలేదని..!

ABN , First Publish Date - 2021-12-07T06:03:17+05:30 IST

రోడ్డు మొత్తం ధ్వంసమైంది. నాలుగు కిలోమీటర్ల మేర గుంతలు పడ్డాయి. మద్దికెర నుంచి బుగ్గ, కసాపురం, నంచెర్ల మీదుగా గుంతకల్లుకు 12 కి.మీ. దూరం ఉంటుంది.

ఎవరూ పట్టించుకోలేదని..!
ఎక్స్‌కవేటర్‌తో గుంతలను పూడ్చివేయిస్తున్న ఆటో వాలాలు

  1. రోడ్డును బాగుచేసుకున్న ఆటోవాలాలు
  2. చందాలు, శ్రమదానంతో గుంతల పూడ్చివేత


మద్దికెర, డిసెంబరు 6: రోడ్డు మొత్తం ధ్వంసమైంది. నాలుగు కిలోమీటర్ల మేర గుంతలు పడ్డాయి. మద్దికెర నుంచి బుగ్గ, కసాపురం, నంచెర్ల మీదుగా గుంతకల్లుకు 12 కి.మీ. దూరం ఉంటుంది. దారిలో మొత్తం గుంతలు పడ్డాయి. ఈ దారిలో వెళితే ఆటోలు పాడైపోతున్నాయని, మరమ్మతులకు రూ.వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని బాధితులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ రోడ్డును తామే బాగు చేసుకోవాలని అటో డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. చందాలు వేసుకుని రూ.10 వేలు వెచ్చించి రోడ్డును బాగు చేసుకున్నారు. శ్రమదానం చేస్తూ, ఎక్స్‌కవేటర్‌ సాయంతో గుంతల్లోకి కంకర, ఎర్రమట్టి వేసి చదును చేసుకున్నారు. అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.


ఆటోలు చెడిపోతున్నాయి..


మద్దికెర నుంచి కసాపురం వెళ్లే రోడ్డు గుంతల మయం అయింది. ఈ దారిలో ప్రయాణికులతో వెళితే ఆటోలు చెడిపోతున్నాయి. నిత్యం మరమ్మతులు చేయించాల్సి వస్తోంది.


- ఆంజినేయులు డ్రైవర్‌, మద్దికెర


చందాలు వేసుకున్నాము..


రహదారి మొత్తం గుంతలు పడ్డాయి. ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు. అందుకే ఆటో డ్రైవర్లు అందరం కలిసి చందాలు వేసుకుని రోడ్డున బాగు చేసుకున్నాము. పాలకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రోడ్డు వేయాలి.


- సుగ్గలప్ప, డ్రైవర్‌, మద్దికెర

Updated Date - 2021-12-07T06:03:17+05:30 IST