Abn logo
Jul 19 2021 @ 18:31PM

ఎమ్మెల్యేలు, ఎంపీలతో కెప్టెన్ అమరీందర్ మీటింగ్‌‌లో నిజమెంత?

ఛండీగఢ్: నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌‌గా నియమించడంతో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో...పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై సీఎం మీడియా అడ్వయిజర్ రవీణ్ తుక్రాల్ సోమవారంనాడు వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు.

''ఈనెల 21 లంచ్‌కు రావాల్సిందిగా ఎమ్మెల్యేలు, ఎంపీలను ముఖ్యమంత్రి ఆహ్వానించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అవన్నీ నిరాధార వార్తలు. ఎంతమాత్రం నిజం లేదు. సీఎంకు అలాంటి ఆలోచన కూడా ఏదీ లేదు. ఎవరికీ ఆహ్వానాలు పంపలేదు'' రవీణ్ తుక్రాల్ తెలిపారు. 11 మంది కాంగ్రెస్ ఎంపీలలో తొమ్మిది మంది ప్రతాప్ సింగ్ బజ్వా (ఎంపీ) నివాసంలో ఆదివారం సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష జరిపిన మరుసటి రోజే ఈ వార్తలు రావడంతో సీఎం మీడియా అడ్వయిజర్ తాజా వివరణ ఇచ్చారు.