సర్కారు బడులిట్లా..?

ABN , First Publish Date - 2022-07-04T05:49:36+05:30 IST

జిల్లావ్యాప్తంగా నాడు-నేడు కింద రెండో విడత 704 పాఠశాలలు ఎంపికయ్యాయి.

సర్కారు బడులిట్లా..?
శ్రీకాళహస్తి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ప్రభుత్వ హైస్కూలులో పూర్తి కాని ఫ్లోరింగ్‌ పనులు

పూర్తికాని ‘నాడు-నేడు’ రెండో విడత పనులు

పిల్లలు అడుగుపెట్టలేని విధంగా చాలా పాఠశాలలు

శిథిలావస్థలో ఉన్నా.. నిబంధనల పేరుతో 

పథకానికే ఎంపికవని స్కూళ్లూ ఉన్నాయి


జిల్లాలో నాడు-నేడు రెండో దశలో ఎంపికైన ప్రభుత్వ బడుల్లో పనులు చాలావరకూ పెండింగ్‌లో ఉన్నాయి. మంగళవారం పాఠశాలలు పునః ప్రారంభించనున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా స్కూళ్ల ప్రాంగణాలు, తరగతి గదులన్నీ నిర్మాణ సామగ్రితో, అసంపూర్తి పనులతో అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. 


- తిరుపతి, ఆంధ్రజ్యోతి


జిల్లావ్యాప్తంగా నాడు-నేడు కింద రెండో విడత 704 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో 705 అదనపు గదులతో పాటు మరమ్మతులు, ఇతర పనులు చేయాల్సి ఉంది. దీనికోసం రూ.190.06 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆచరణలో చూస్తే మారుమూల గ్రామాలు, దళిత, గిరిజన గ్రామాలలో పేద పిల్లలు చదివే పాఠశాలలను నిబంధనల సాకుతో నాడు-నేడు కార్యక్రమం కింద ఎంపిక చేయడం లేదు. వాటిని పక్కన పెడితే రెండో విడతలో ఎంపికైన పాఠశాలల్లో ఎక్కడా పనులు పూర్తయిన దాఖలాలు కనిపించడం లేదు. ఎంపిక ప్రక్రియ ఆలస్యంగా చేయడం, పనులు ఆలస్యంగా ప్రారంభించడం, అధికారుల పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో పాఠశాలల ప్రాంగణాలన్నీ పిల్లలు అడుగుపెట్టలేని విధంగా మారాయి. నాడు-నేడుతో నిమిత్తం లేకుండా ఉన్న పాఠశాలల్లోనూ చాలావరకూ సమస్యలు కనిపిస్తున్నాయి. పాఠశాలలు పునః ప్రారంభిస్తున్న నేపధ్యంలో నాడు-నేడు పనులు ఎప్పుడు పూర్తవుతాయో, ఎప్పుడు తరగతులు పూర్తిస్థాయిలో నడుస్తాయన్నది అంతుబట్టడం లేదు.


నాడు- నేడుకు ఎంపికైన బడుల్లో పరిస్థితిదీ..


శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో 70 మంది పిల్లలు, ఉన్నత పాఠశాలలో 195 మంది చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలు రెండో విడతలో నాడు-నేడు కార్యక్రమానికి ఎంపికయ్యాయి. ప్రాథమిక పాఠశాలకు రూ.15 లక్షలు, ఉన్నత పాఠశాలకు రూ.56 లక్షలు చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో భవనాలకు మరమ్మతులు, కొత్తగా ఫ్లోరింగ్‌, పెయింటింగ్‌, బోర్డులు, డెస్కులు, టాయిలెట్ల నిర్మాణం, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. గత మార్చి నెలలో పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మూడు నెలల గడువిచ్చి ఆలోపు పూర్తి చేయాలని నిర్దేశించింది. అయితే మూడు నెలల్లో పనులు పూర్తి కాలేదు. దాంతో ప్రభుత్వం గడువు మరో నెల పొడిగించింది. ఈ నాలుగు నెలల్లో పాతిక శాతం పనులే జరిగాయి. ప్రాథమిక పాఠశాల టాయిలెట్లను కూల్చివేశారు. తిరిగి కట్టలేదు. తరగతి గదుల్లో ఫ్లోరింగ్‌ కోసం ఇదివరకటి బండలు తొలగించారు. ఇంకా ఫ్లోరింగ్‌ వేయలేదు. పెయింటింగ్‌ పనులు, ఎలక్ట్రికల్‌ పనులు, బోర్డుల ఏర్పాటు, ఆర్వో ప్లాంటు ఏర్పాటు వంటి పనులన్నీ పెండింగులోనే ఉన్నాయి. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గదుల్లో ఎక్కడి వస్తువులు అక్కడ ఇష్టానుసారం పడేశారు. పాత ఫర్నిచర్‌ను ఆవరణలో గుట్టలుగా పేర్చారు. తరగతి గదులు, వరండా కూడా ఫ్లోరింగ్‌ తొలగించడంతో ఎక్కడ చూసినా మట్టే కనిపిస్తోంది. పాఠశాలలో అడుగుపెట్టడానికి కూడా వీలు కాని రీతిలో ప్రాంగణం, గదులు రూపు మారాయి.


మరికొన్ని చోట్ల ఇలా.. 


తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం ప్రాథమిక పాఠశాలకు నాడు-నేడు కింద రెండో విడతలో రూ.16 లక్షలు మంజూరయ్యాయి. నాలుగు నెలలవుతున్నా ఇంకా పనులు ప్రారంభం కాలేదు.

గూడూరు మండలంలో 90 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 8వ తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఇంతవరకూ చేరలేదు. మిగిలిన తరగతుల పుస్తకాలు కూడా కేవలం 75 శాతం మాత్రమే వచ్చాయి. ఇతర వస్తువుల విషయానికొస్తే బ్యాగు, బెల్టు, నోట్‌ బుక్స్‌ ఇంకా రాలేదు. ఈ మండలంలో 26 పాఠశాలల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయి.

వాకాడు మండలంలోని తీరప్రాంత గ్రామాల్లోని పాఠశాలల మరమ్మతుల గురించి పట్టించుకునే నాథుడు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులకు ఇంకా కిట్లు రాలేదు.

కోట మండలంలో 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాలేదు. అలాగే బూట్లు, బెల్టు వంటివి కూడా రాలేదు. 6వ తరగతి వరకు పిల్లలకు డిక్షనరీలు సైతం ఇంకా అందలేదు. 

చిల్లకూరు మండలంలో 2వ తరగతి, 8వ తరగతుల పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదు. యూనిఫామ్‌, బ్యాగులు కూడా చేరలేదు.

నాయుడుపేట జడ్పీ బాలికోన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి రూ.1.44 కోట్లు మంజూరయ్యాయి. కానీ గదుల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో నిధులు వెనక్కు వెళ్లాయి.


నాడు- నేడుకు ఎంపికవని బడిలో ఇలా..


రామచంద్రాపురం మండలం కమ్మపల్లె పంచాయతీ గడ్డమీద దళితవాడలోని మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాల భవనాల శిఽథిల సౌందర్యమిది. గడ్డమీద దళితవాడ, పొరుగునే ఉన్న దేశూరి కండ్రిగ గ్రామాలకు చెందిన పేద పిల్లలు ఈ బడిలో చదువుకుంటున్నారు. ఎప్పుడో మూడు దశాబ్దాల కిందట కట్టించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులు ఊడి తరగతి గదుల్లో పడుతున్నాయి. దీంతో పైకప్పు ఎప్పుడు కూలి పిల్లలపై పడుతుందోనని హడలిపోయిన టీచర్లు, గ్రామస్తులు పాఠశాల గదులకు తాళం వేశారు. గ్రామంలోని శ్రీకృష్ణుని గుడి ఆవరణలో తాత్కాలికంగా పందిరి వేసి అక్కడ తరగతులు నడుపుతున్నారు. మధ్యాహ్న భోజనం మాత్రం పాఠశాల ఆవరణలో చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న నాడు-నేడు కార్యక్రమం కింద ఇప్పటివరకు మండలంలో రెండు విడతలుగా పాఠశాలలు ఎంపిక చేశారు. అయితే ఏ విడతలోనూ దళితవాడలో పేద పిల్లలు చదివే ఈ పాఠశాల నాడు-నేడు కార్యక్రమానికి ఎంపిక కాకపోవడం గమనార్హం. దీనికి అధికారులు చెబుతున్న సాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది. నాడు-నేడు కింద ఎంపిక కావాలంటే ఆ స్కూలులో పాతిక మందికి మించి పిల్లలు ఉండాలన్నది నిబంధనట. ఈ స్కూలులో దురదృష్టవశాత్తూ 23 మంది పిల్లలే ఉండటంతో ఎంపిక చేయలేదన్నది అధికారుల సమాధానం. పాఠశాలలో పిల్లల సంఖ్య ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదని, ఏ సంవత్సరానికా సంవత్సరం సంఖ్య పెరగడం లేదా తగ్గడం జరుగుతుందనేది తెలియడానికి పెద్ద అవగాహన అవసరం లేదని గ్రామస్తులు అంటున్నారు. వారి విజ్ఞప్తులన్నీ గాలికి పోయాయి. ఆరు నెలలుగా పాఠశాల నిర్వహణ తీరులో మార్పేమీ లేదు. గుడిలో పందిరి కింద పిల్లల చదువులు సాగిపోతున్నాయి. నాడు-నేడు కార్యక్రమం కింద నిరుపేద పిల్లలు చదివే పాఠశాలలకు ఒరిగిందేమీ లేదని చాటిచెబుతోందీ పాఠశాల.





Updated Date - 2022-07-04T05:49:36+05:30 IST