చరిత్ర ఘనం..అభివృద్ధి శూన్యం!

ABN , First Publish Date - 2022-06-25T05:10:33+05:30 IST

మండల కేంద్రమైన గుడ్లూరులో 8వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతన నీలకంఠేశ్వర స్వామి ఆలయం

చరిత్ర ఘనం..అభివృద్ధి శూన్యం!

 జీర్ణోద్ధరణకు నోచుకోని నీలకంఠేశ్వర ఆలయం

  కందుకూరు, జూన్‌ 24 : మండల కేంద్రమైన గుడ్లూరులో 8వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతన నీలకంఠేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుతోంది. 14 శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన ఆలయ జీర్ణోద్ధరణకు అడుగులు ముందుకు పడటం లేదు. మహాభారతాన్ని రచించిన కవిత్రయంలో ఒకరైన ఎఱ్ఱాప్రగడ నడియాడిన ఆలయం కూడా కావటం విశేషం. ఎర్రన ఇక్కడ కూర్చునే మహాభారతాన్ని రచించినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. దాతలు ముందుకొస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పడిపోయిన గోడల శిథిలాలు, దట్టంగా పెరిగిన పొదలు, విషసర్పాలు సంచరిస్తున్న పరిస్థితి కావటంతో నిత్య ధూపదీప నైవేద్యాలు సైతం నామమాత్రంగా మారాయి. పండుగలు, పర్వదినాల్లో తప్ప భక్తులు వెళ్లటానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. 

ఫ దాతలు విరాళాలు సమకూర్చనా.. 

ఆలయానికి 45 ఎకరాల వరకు భూములు కూడా ఉన్నాయి. వాటికి వేలం పాటలు నిర్వహించటం, పర్వదినాల సమయంలో తీర్థప్రసాదాలు ఏర్పాటు వరకే తమ బాధ్యత అన్నట్లు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఆలయ నిర్మాణా నికి బి.కాశీవిశ్వనాథం, సోమానాయుడు తదితరులు చొరవ తీసుకుని విరాళాలు సేకరించారు. కాశీవిశ్వనాథం ఒక్కరే అప్పట్లో రూ.10 లక్షలు సమకూర్చినట్లు తెలిసింది. మొత్తం రూ.35 లక్షలు దేవాదాయ శాఖ అధికారులకు అందజేసి సీజీఎఫ్‌ ఫండ్స్‌ ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని కోరారు. అయితే నేటివరకు అతీగతీ లేదు. భక్తులు రెండేళ్ల క్రితం సమకూర్చిన ఈ డబ్బు బ్యాంకు ఖాతాలో ఉంది. ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 కోట్లు ఖర్చవుతుందని, ప్రజల భాగస్వామ్యంగా రూ.70 లక్షలు చెల్లిస్తే మిగిలిన కోటి 40 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికారులు చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు. మరో రూ.35 లక్షలే కాదు అంతకు రెండింతలైనా ఇచ్చేందుకు గ్రామస్థులు సిద్ధంగా ఉన్నందున ముందు నిధులు మంజూ రు చేయించి పనులు ప్రారంభించేలా అధికారులు సమన్వయ బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు.

 ఆలయంలో ఎర్రన విగ్రహం 

గుడ్లూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో ఎర్రన అనుబంధానికి గుర్తుగా ఇక్కడ ఎర్రా ప్రగ డ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎర్రన విగ్రహం ఏర్పాటు జరగ్గా 2016లో కొందరు దాతల సహకారంతో పీఠాన్ని పునర్నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-06-25T05:10:33+05:30 IST