కుట్ర లేదు!

ABN , First Publish Date - 2020-10-01T07:56:15+05:30 IST

బాబ్రీ కూల్చివేత అప్పటికప్పుడు, ఆకస్మికంగా జరిగిన ఘటన లఖ్‌నవూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు...

కుట్ర లేదు!

  • బాబ్రీ కూల్చివేత అప్పటికప్పుడు, ఆకస్మికంగా జరిగిన ఘటన
  • లఖ్‌నవూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు


  • ఆడ్వాణీ, జోషి, ఉమాభారతి సహా 32 మంది నిర్దోషులే
  • కరసేవకులను రెచ్చగొట్టారనేందుకు ఆధారాల్లేవు
  • కట్టడాన్ని కాపాడేందుకే కొందరు నిందితుల ప్రయత్నం
  • అభియోగాలను నిరూపించడంలో సీబీఐ విఫలం
  • ‘ముందస్తు ప్రణాళిక’ను నిరూపించలేదు
  • పత్రికా కథనాలను, వీడియో టేపులను విశ్వసించలేం
  • 2300 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించిన జడ్జి
  • కోర్టుకు హాజరైన 26 మంది నిందితులు
  • ఆడ్వాణీ సహా ఆరుగురికి మినహాయింపు
  • అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం: సీబీఐ


లఖ్‌నవూ, సెప్టెంబరు 30: బాబ్రీ మసీదు విధ్వంసం ముందస్తు పథకం ప్రకారం జరిగింది కాదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో కుట్ర లేదని... బాబ్రీ కూల్చివేత అప్పటికప్పుడు, అనుకోకుండా, ఆకస్మికంగా జరిగిందని వెల్లడించింది. నిజానికి నిందితుల్లో కొందరు బాబ్రీ కట్టడాన్ని కాపాడేందుకు ప్రయత్నించారని వెల్లడించింది. బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌ సహా మొత్తం 32 మందిపై కేసు కొట్టివేస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం... బుధవారం లఖ్‌నవూలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌ ఈ తీర్పు వెలువరించారు. ఈ కేసులో సీబీఐ 351 మంది సాక్షులను ప్రవేశపెట్టి, 600 డాక్యుమెంట్లను సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘‘వివాదాస్పద కట్టడం కూల్చివేత వెనుక కుట్ర జరిగినట్లు సీబీఐ స్పష్టమైన ఆధారాలను సమర్పించలేక పోయింది. కట్టడాన్ని కూల్చివేయాలని వీరు రెచ్చగొట్టలేదు. గుమ్మటాలపైకి ఎక్కిన వారంతా సంఘ విద్రోహ శక్తులే’’ అంటూ మొత్తం 32 మందిని జడ్జి  నిర్దోషులుగా ప్రకటించారు. బాబ్రీని కూల్చివేయాల్సిందిగా నిందితులు కరసేవకులను రెచ్చగొట్టారని, ఉద్వేగ భరిత ప్రసంగాలు చేశారని సీబీఐ చేసిన వాదనలతో జడ్జి ఏకీభవించలేదు. అభియోగాలను సందేహాలకు అతీతంగా నిరూపించడంలో సీబీఐ విఫలమైందని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12.10 గంటలకు జడ్జి తన స్థానంలో కూర్చున్నారు.  2300 పేజీల సుదీర్ఘ తీర్పులో కీలక భాగాన్ని (ఆపరేటివ్‌ పార్ట్‌) ఐదు నిమిషాల్లో చదివి వినిపించారు. ఆ వెంటనే... కోర్టు హాలులోనే ఉన్న కొందరు నిందితులు ‘జై శ్రీరామ్‌’ అని నినదించారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటికే ఆలయ పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు... సీబీఐ కోర్టు తీర్పుతో బాబ్రీ కూల్చివేత కేసులోనూ కాషాయ దళానికి ఊరట లభించినట్లయింది. ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తారా అని ప్రశ్నించగా... ‘‘తీర్పు ప్రతిని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పంపిస్తాం. అక్కడి  న్యాయ నిపుణులు దీనిని లోతుగా పరిశీలిస్తారు. ఆ తర్వాత... హైకోర్టులో సవాలు చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని సీబీఐ తరఫు న్యాయవాది లలిత్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రకటించింది.


కోర్టు హాలులో ‘జైశ్రీరామ్‌’

ఆడ్వాణీ, కల్యాణ్‌సింగ్‌, జోషి, ఉమాభారతి, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు నృత్యగోపాల దాస్‌, శివసేన నేత సతీశ్‌ ప్రధాన్‌ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోరారు. ఇక... కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో కల్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి ఆస్పత్రిలో ఉన్నందున వారూ కోర్టుకు హాజరు కాలేకపోయారు. మిగిలిన 26 మంది నిందితులు తమ న్యాయవాదులతోపాటు కోర్టుకు వచ్చారు. వీరిలో సాక్షి మహరాజ్‌, వినయ్‌ కతియార్‌, ధర్మదాస్‌, వేదాంతి, లల్లూ సింగ్‌, చంపత్‌ రాజ్‌, పవన్‌ పాండే తదితరులు ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్న వీరంతా... కోర్టు ఆవరణలో పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. జడ్జి ఎస్‌కే యాదవ్‌ 2019 సెప్టెంబరు 30వ తేదీనే రిటైర్‌ అయినప్పటికీ... ఏడాదిలోపు ఈ కేసులో తీర్పు వెలువరించాలంటూ ఆయన పదవీకాలాన్ని సుప్రీం కోర్టు పొడిగించింది. రోజువారీ విచారణ జరపాలని ఆదేశించింది. సరిగ్గా తన పదవీకాలం చివరి రోజునే ఎస్‌కే యాదవ్‌ ఈ తీర్పు వెలువరించారు. అత్యంత కీలకమైన, సున్నితమైన అంశంపై తీర్పు వస్తున్న నేపథ్యంలో... కోర్టు చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. లఖ్‌నవూలోనూ బలగాలను మోహరించారు.


‘కుట్ర’ ఎందుకు కాదంటే 

‘‘కరసేవకులు వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయానికి రామ్‌లల్లాతోపాటు మరిన్ని విగ్రహాలు అందులోని గర్భ గృహంలోనే ఉన్నాయి. ఆలయ పూజారి సత్యేంద్ర దాస్‌ ఆ విగ్రహాలను బయటికి భద్రంగా తీసుకొచ్చారు. బాబ్రీ కూల్చివేత ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదనేందుకు ఇదే నిదర్శనం’’ అని నిందితుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. వివాదాస్పద కట్టడానికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ‘రామకథా కుంజ్‌’ వేదికపైన బీజేపీ, వీహెచ్‌పీ అగ్రనేతలున్నారు. లాంఛనప్రాయమైన కరసేవకు మాత్రమే పరిమితం కావాలన్న నేతల సూచనను కరసేవకులు పట్టించుకోలేదు. కట్టడాన్ని కూల్చివేయవద్దని అశోక్‌ సింఘాల్‌  కోరినా వినిపించుకోలేదు. ఇక... నిందితులకు వ్యతిరేకంగా సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో క్యాసెట్లు ‘సీల్‌’ చేసి లేవు. వాటిని ప్రయోగశాలలో కూడా పరీక్షించలేదు. ఆ టేపుల్లో మాటలను మార్చివేశారు. నిజానికి... ఒక సౌహార్ధ్ర భావనతో, మతపరమైన కార్యక్రమంగా మాత్రమే కర సేవ చేయాలని భావించినా... కొందరు దుండగులు కరసేవను భగ్నం చేసేందుకే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇలా జరిగే అవకాశముందని స్థానిక ఇంటెలిజెన్స్‌ విభాగం ముందుగానే హెచ్చరించింది.’’ 

- విమల్‌ కుమార్‌ శ్రీవాస్తవ్‌,  డిఫెన్స్‌ న్యాయవాది


ఎందుకు కొట్టివేశారంటే... 

బాబ్రీ కూల్చివేత కేసులో నిందితులపై వివిధ సెక్షన్ల కింద మోపిన అభియోగాలను కొట్టివేస్తూ, అందుకు చూపించిన కారణాలివి...


ఐపీసీ 120బి 

బాబ్రీ కట్టడాన్ని కూలివేయాలనే ఉద్దేశంతో నిందితులంతా ముందుగానే ఒకచోట సమావేశమై ప్రణాళిక రచించారనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.


ఐపీసీ 153 

రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేసినట్లుగా రుజువు కాలేదు.


ఐపీసీ 295 

మతపరమైన స్థలాన్ని అపవిత్రం చేశారన్నది ఈ అభియోగం. అయితే, బాబ్రీ మసీదులో ముస్లింలు అనేక సంవత్సరాలుగా నమాజు చేయడంలేదు. అందువల్ల, ఈ అభియోగం చెల్లదు.


ఐపీసీ 149 

కరసేవకు అనుమతించినందున అక్కడ 144 సెక్షన్‌ కింద ఆంక్షలేవీ విధించలేదు. లాంఛనప్రాయ కరసేవకు సుప్రీం కోర్టు కూడా అప్పుడు అనుమతించింది. అందువల్ల నిందితులు చట్ట వ్యతిరేకంగా గుమికూడారనే అభియోగం ఇక్కడ వర్తించదు. 


ఐపీసీ 395 

సంఘటన జరిగిన ప్రాంతం నుంచి పురాతన వస్తువులు, పత్రాలను నిందితులు తస్కరించి, పారిపోతున్నట్లుగా ఎవ్వరూ చూడలేదు. 


కోర్టు తీర్పులో...

నిందితులకు వ్యతిరేకంగా పత్రికల్లో వచ్చిన కథనాలను నమ్మలేం. అలాగే, సీబీఐ సమర్పించిన వీడియో క్యాసెట్లు సీల్‌ చేసి లేవు. పైగా.... ఆ దృశ్యాల్లో స్పష్టత లేదు. వాటిపై ఆధారపడలేం. వివాదాస్పద కట్టడంలోనే రాముడి విగ్రహం ఉన్నందున... కూల్చివేయకుండా దివంగత వీహెచ్‌పీ నేత అశోక్‌ సింఘాల్‌  కరసేవకులను ఆపేందుకు ప్రయత్నించారు. కరసేవ సందర్భంగా ‘అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు’ అని లోకల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎల్‌ఐయూ) ముందుగానే హెచ్చరించింది. కానీ, దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 

- జడ్జి ఎస్‌కే యాదవ్‌


రామజన్మభూమి ఉద్యమం పట్ల వ్యక్తిగతంగా నాకు, బీజేపీకి ఉన్న నమ్మకం, చిత్తశుద్ధి ఈ తీర్పుతో నిరూపితమయ్యాయి. గత నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు బాటలోనే ప్రస్తుత తీర్పు వచ్చింది. ఇది మాకు ఆశీర్వచనమే. సుప్రీం తీర్పుతో అయోధ్యలో నేనెంతో కాలంగా ఎదురుచూస్తున్న భవ్యమైన రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నా స్వప్నం నెరవేరబోతోంది. ఎంతో మంది త్యాగాలు చేశారు. వారి అండతోనే ఉద్యమాన్ని నడిపించా.    

- ఎల్‌.కె.ఆడ్వాణీ 


Updated Date - 2020-10-01T07:56:15+05:30 IST