విద్యుత్‌ శాఖ ప్రజాభిప్రాయ సేకరణకు ఫిర్యాదులు నిల్‌

ABN , First Publish Date - 2021-01-19T07:13:56+05:30 IST

ఏపీఎస్పీడీసీఎల్‌ ప్రజాభిప్రాయ సేకరణకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు సోమవారం ఒక్క ఫిర్యాదు కూడా లేకుండానే కార్యక్రమం ముగిసింది

విద్యుత్‌ శాఖ ప్రజాభిప్రాయ సేకరణకు  ఫిర్యాదులు నిల్‌
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

తొలిరోజు స్పందన కరువు


అనంతపురంరూరల్‌, జనవరి18: ఏపీఎస్పీడీసీఎల్‌ ప్రజాభిప్రాయ సేకరణకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు సోమవారం ఒక్క ఫిర్యాదు కూడా లేకుండానే కార్యక్రమం ముగిసింది. జిల్లాలో విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. మూడు రోజులపాటు సాగనుంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన ఆదాయ అవసరాలు, టారి్‌ఫలపై సలహాలు, అభ్యంతరాల సేకరణకు అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురం ప్రధాన కార్యాలయంతోపాటు కదిరి, కళ్యాణదుర్గం, హిందూపురం, గుత్తి డివిజన్‌ కార్యాలయాల్లో నిర్వహించారు. వినియోగదారుల నుంచి స్పందన కరువైంది. సాధారణంగా పంపిణీ సంస్థల ప్రతిపాదనలపై వినియోగదారులు, రాజకీయ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్త పరచవచ్చు. టారి్‌ఫల పెంపు, తగ్గింపుపై అభ్యంతరాలు, పెంచితే వాటిల్లే నష్టాలను చెప్పే వీలుంటుంది. తొలిరోజు వినియోగదారుల నుంచి స్పందన లేకపోవటంతో అధికారులు సైతం ఈఆర్‌సీ రాష్ట్రస్థాయి అధికారులు చెప్పిన వాటిని విని, కార్యక్రమాన్ని కానిచ్చేశారు. కార్యక్రమంలో పాల్గొనేలా వినియోగదారులకు అవగాహన కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని తెలుస్తోంది. ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకోవటంతోపాటు, వినియోగదారులు పాల్గొనేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో అధికారులు కేవలం పేపర్‌ ప్రకటన ఇచ్చి, మిన్నకుండిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తొలిరోజు జిల్లాలో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాకుండానే ముగిసింది. తొలిరోజు కార్యక్రమంలో ఎస్‌ఈ వరకుమార్‌, ఈఈలు పరంధామయ్య, సురేంద్ర, సుధాకర్‌బాబు, మధుసూదన్‌, విజయ్‌భాస్కర్‌నాయుడు, డీఈఈ కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T07:13:56+05:30 IST