పరిహారం ఇవ్వరు...ఫ్లైఓవర్‌ పూర్తి చేయరు

ABN , First Publish Date - 2020-12-05T05:21:07+05:30 IST

పాత జాతీయరహదారి, కాశీబుగ్గ-చిన్నబడాం మధ్య రైల్వే గేటు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి ఎప్పుడు పూర్తవుతుందోనని జంట పట్టణ వాసులు 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

పరిహారం ఇవ్వరు...ఫ్లైఓవర్‌ పూర్తి చేయరు
పనులు నిచిలిపోయిన కాశీబుగ్గ ప్లైవోవర్‌ బ్రిడ్జి

  15 ఏళ్లుగా జంటపట్టణ వాసుల ఎదురుచూపు

  తప్పని ట్రాఫిక్‌ కష్టాలు

పలాస:పాత జాతీయరహదారి, కాశీబుగ్గ-చిన్నబడాం మధ్య రైల్వే గేటు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి ఎప్పుడు పూర్తవుతుందోనని జంట పట్టణ వాసులు 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇది పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య తీరతుంది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ హయాంలో కాశీబుగ్గ, బెండి ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోసగం నిధులు కేటాయించి మం జూరుచేశాయి.బెండిగేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తై టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కాశీబుగ్గ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మాత్రం రైల్వేకు ఇచ్చిన అంచనాల ప్రకారం పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్వాసితుల సమస్య వల్ల  బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. నిర్వాసితులకు పక్కా ప్రణాళికతో నష్టపరిహారం అందించడంతోపాటు స్థలాన్ని ఖాళీచేసి బాధ్యతను ఆర్‌అండ్‌బీ అధికారులకు చేపట్టక పోవడంతో పనులు ముందుకుసాగలేదు.


ప్రభుత్వాలు మారుతున్నా....

అప్పట్లో బ్రిడ్జి పూర్తి చేయడానికి ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించింది. పనులు నిలిచిపోవడంతో  ప్రస్తుత వ్యయం రూ.50 కోట్లకు చేరడంతోపాటు నిర్వాసితులకు పరిహారం మరో రూ.పది కోట్లు అవ సరం. ఈనేపథ్యంలో ప్రభుత్వాలు మారుతున్నా బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక పోవడంతో జంటపట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతోంది. ప్రధానంగా ఇక్కడి బ్రిడ్జి పూర్తికాకపోవడంతో జంట పట్టణాలకు నందిగాం, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి తదితర మండలాల నుంచి వచ్చే ప్రయాణికులు అవ స్థలకు గురవుతున్నారు. రైళ్ల రాకపోకల సమయంలో గేటువేయడంతో సరాసరి రోజుకు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. అండర్‌పాసేజీ నిర్మించి తాత్కాలికంగా మరోమార్గం కల్పించాల్సి ఉన్నా రైల్వే అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన ముందుకుసాగలేదు. ఫ్లైఓవర్‌ లేకపోవడంతో అత్యవసర సమయంలో 108 వాహనాలు, అంబులెన్స్‌లు కూడా గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. తక్షణమే బ్రిడ్జి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ అధికారులు చొరవచూపాలని జంటపట్టణ వాసులు కోరుతున్నారు.

 

Updated Date - 2020-12-05T05:21:07+05:30 IST