స్వల్ప ఊరట..!

ABN , First Publish Date - 2020-05-23T10:50:09+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో జనం వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం కడప

స్వల్ప ఊరట..!

మూడు రోజులుగా నమోదు కాని కేసులు

ఆంక్షల సడలింపుతో పనుల్లో జనం నిమగ్నం


కడప, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో జనం వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం కడప నగరంతో పాటు ప్రధాన పట్టణాలు, పల్లెల్లో పనులు, వ్యాపారాల కోసం జనం బయటికి వస్తున్నారు. వ్యాపారాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. మూడు రోజులుగా జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు, కువైత్‌ నుంచి ప్రవాసాంధ్రులు జిల్లాకు వస్తున్నారు. వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి కాకుండా కట్టుద్టిట్టమైన చర్యలు తీసుకున్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన అధికారుల్లో ఉంది.


8 మంది డిశ్చార్జ్‌

కరోనా వైరస్‌ బారిన పడి తిరుపతి స్టేట్‌ కోవిడ్‌-19 ఆసుపత్రి (స్విమ్స్‌)లో చికిత్స పొందుతున్న ఒకరు, కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ జిల్లా కోవిడ్‌-19 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారని డీఎంఅండ్‌హెచ్‌వో ఉమాసుందరి తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోలుకున్న బాధితులకు రూ.2వేలు, డ్రై ఫ్రూట్స్‌ అందించి ప్రత్యేక వాహనాల్లో ఇంటిలో దింపి వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 112 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా ఇప్పటి వరకు 84 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. లాక్‌డౌన్‌ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని ప్రజలు సహకరించాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.


ప్రయాణానికి ఆసక్తి చూపని వైనం

ఆర్టీసీ బస్సులు రెండో రోజు రోడ్డెక్కాయి. జిల్లాలో 144 బస్సులు అందుబాటులో ఉన్నా వంద బస్సులకు మాత్రమే ప్రయాణికులు అరకొరగా ఎక్కుతున్నారు. తొలిరోజుతో పోలిస్తే శుక్రవారం 35 శాతం పెరిగిందని, అమావాస్య వల్ల ప్రజలు ఆసక్తి చూపకపోయి ఉండవచ్చని ఆర్టీసీ రీజనల్‌  మేనేజరు జితేంద్రనాధరెడ్డి పేర్కొన్నారు. ఏడు వేల సీట్లు అందుబాటులో ఉంటే 4500 సీట్లు బుక్‌ అయినట్లు తెలిపారు. రెండు రోజుల్లోగా ప్రతి బస్సులో శానిటైజర్‌ బాటిల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. బస్టాండులో ప్రయాణికులకు కరోనా టెస్ట్‌ చేసేందుకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ మిషన్‌ ఏర్పాటు కోసం కలెక్టర్‌ హరికిరణ్‌ దృష్టికి తీసుకుపోతామని ఆర్‌ఎం వివరించారు.


కరోనా అప్‌డేట్స్

పట్టణం మొత్తం డిశ్చార్జి 

కడప         28 19

ప్రొద్దుటూరు         42 28

పులివెందుల 4 4

వేంపల్లె 2 2

బద్వేలు 5 4

మైదుకూరు 4 4

ఎర్రగుంట్ల 12 10

కమలాపురం     1 1

సీకేదిన్నె 1 1

చెన్నూరు 2 2

పుల్లంపేట 1 1

సంబేపల్లె 1 --

జమ్మలమడుగు 1 --

చిట్వేలు 1 --

రాయచోటి 1 --

ఓబులవారిపల్లె 1 --

ఇతరులు 1 --

మొత్తం     112 76

Updated Date - 2020-05-23T10:50:09+05:30 IST