4,000 మందికి దక్కని భరోసా!

ABN , First Publish Date - 2022-05-18T07:04:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటిస్తున్న పథకాలు అసలైన లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి.

4,000 మందికి  దక్కని భరోసా!

మత్స్యకారుల గగ్గోలు

జాబితాలో కొందరి పేర్లు గల్లంతు

రకరకాల నిబంధనలతో కోత

పేరున్నా మరికొందరికి మొండిచేయి 

రూ.4 కోట్లు ఏమైనట్టు...?

విచారణకు ఎమ్మెల్యే వాసుపల్లి డిమాండ్‌

బినామీలకు పథకం అందిస్తున్నారని విమర్శలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటిస్తున్న పథకాలు అసలైన లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి. మత్స్యకార భరోసా పేరుతో ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ జిల్లాలో 11 వేల మందికి రూ.11 కోట్లు బ్యాంకు ఖాతాలో వేసినట్టు ప్రకటించారు. జిల్లా అధికారులు కూడా మత్స్యకారులు అందరికీ మేలు జరిగిందని ప్రకటించారు. వాస్తవానికి జిల్లాలో 13 వేల మందికి పైగా మత్స్యకారులు ఉండగా, వారిలో రెండు వేల మందిని విస్మరించి, మిగిలిన 11 వేల మందికే ఇచ్చారు. ఇప్పుడు వారిలో నాలుగువేల మంది తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని చెబుతున్నారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ మంగళవారం ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించగా, మత్స్యకారులంతా ఆయన దగ్గర ఘొల్లుమన్నారు. దాంతో ఆయన వెంటనే మత్స్య శాఖాధికారులకు ఫోన్‌ చేసి, ఆ నాలుగు వేల మంది పేర్లు ఎలా తప్పిపోయాయి? ఆ రూ.4 కోట్లు ఏమయ్యాయో విచారణ చేయాలని ఆదేశించారు. 


తప్పించడానికి సవాలక్ష కారణాలు

లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వమే సవాలక్ష నిబంధనలు పెడుతోంది. రెండు నెలల కాలానికి ఇచ్చే రూ.పది వేల కోసం...అనేక నిబంధనలు పెట్టింది. కొత్త బియ్యం కార్డు ఉండాలని, అమ్మఒడి తీసుకోకూడదని తదితర 12 రకాల నిబంధనలతో మత్స్యకారుల జాబితా తగ్గించే ప్రయత్నం చేసింది. ఎలాగోలా 11 వేల మందికి ప్రకటించినా, నాలుగువేల మందిని పక్కన పెట్టేసింది.


ఇవీ కారణాలు...

- లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ నంబరు లింకు చేయలేదని, అందుకే వారి ఖాతాలో మత్స్యకార భరోసా జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇలా 2,400 మంది పేర్లు పక్కన పెట్టినట్టు సమాచారం.

-  ఒక్కో బోటుకు ఎనిమిది మంది కలాసీలుంటే మత్స్య శాఖ అధికారులు నలుగురి పేర్లే నమోదు చేశారు. దానివల్ల మరికొందరికి దక్కలేదు.

- కొందరు మత్స్యకారులకు 10 సెంట్ల నుంచి ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉంది. వారికి రైతుభరోసా అందుతోంది. కానీ వారికి చేపల వేటే ప్రధాన ఆధారం. అయితే ఆ పథకం కింద నిధులు వస్తున్నాయని, వారి పేర్లు తప్పించేశారు. దాంతో మరికొందరికి మొండి చేయి మిగిలింది. ఇతర సాంకేతిక కారణాలతో మరికొందరి పేర్లు గల్లంతయ్యాయి.


బినామీలకు ఇస్తున్నారు

మత్స్యకారులకు ఏటా రూ.109 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.327 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కానీ జిల్లాలో మత్స్యకారుల పేరుతో బినామీలకు ఆ డబ్బు పంపిణీ చేస్తున్నారు. మత్స్యకారుల డబ్బులు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దీనిపై విచారణ చేయించి, వేటకు వెళ్లే వారందరికీ మత్స్యకార భరోసా అందించాలి.

- సీహెచ్‌.వీరన్న, డాల్ఫిన్‌ బోట్‌ ఆపరేటర్ల సంఘం

Updated Date - 2022-05-18T07:04:13+05:30 IST