రేకుల షెడ్డులో రేషన్‌ రాకెట్‌

ABN , First Publish Date - 2020-10-01T09:08:52+05:30 IST

పేదలకు అందాల్సిన ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా దాచిన భారీ డంప్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రేకుల షెడ్డులో రేషన్‌ రాకెట్‌

77 టన్నుల చౌక బియ్యం పట్టివేత 

 విలువ రూ. 28.23 లక్షలు


నెల్లూరు (రూరల్‌), సెప్టెంబరు 30 : పేదలకు అందాల్సిన ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా దాచిన భారీ డంప్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఓఎస్డీ వెంకటనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరానికి కూతవేటు దూరానున్న సౌత్‌రాజుపాళెంలో (జల్సా వైన్స్‌ ఎదురు) లారీ స్టాండ్‌ వద్ద ఎవరికీ అనుమానం రాకుండా అక్రమార్కులు రేకుల షెడ్‌ ఏర్పాటు చేశారన్నారు. అందులో రేషన్‌ బియ్యం భారీగా నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో దాడి చేశామని తెలిపారు. అక్కడ 1543 సంచుల్లో ఉన్న 77.170 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకున్నామని, దీని విలువ బయట మార్కెట్లో రూ.28,23,690గా లెక్కకట్టామన్నారు. దాసరి వెంకటేశ్వర్లు నాయుడు అనే వ్యక్తి ఈ  రాకెట్‌కు సూత్రధారిగా గుర్తించామని, షెడ్‌ స్థలం ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తిదని చెప్పారు.


వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తునకు నెల్లూరు రూరల్‌ పోలీసులకు అప్పగించామని ఓఎస్డీ చెప్పారు.  స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కొత్తూరు వద్ద గల ఎంఎల్‌ఎస్‌ గోదాములకు తరలించనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ సీఐ వెంకట రమణ, డీటీ గోపీకృష్ణ, ఏఎస్వో రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T09:08:52+05:30 IST