నిజాంసాగర్ ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు
ABN , First Publish Date - 2022-07-25T05:53:00+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు అని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు నుంచి మంజీరా నదిలోకి విడుదల చేస్తున్న నీటిని ఆస్వాదించి వరద గేట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే నిలిచి పోయిందని, ఈ ఏడాది జూలై మాసంలో నిండిపోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఆయకట్టు కింద ఉన్న భూములకు ఇక ఇబ్బందులుండవన్నారు.
- స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజాంసాగర్, జూలై 24: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు అని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు నుంచి మంజీరా నదిలోకి విడుదల చేస్తున్న నీటిని ఆస్వాదించి వరద గేట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే నిలిచి పోయిందని, ఈ ఏడాది జూలై మాసంలో నిండిపోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఆయకట్టు కింద ఉన్న భూములకు ఇక ఇబ్బందులుండవన్నారు. ఈ ప్రాజెక్టు 1932లో జాతికి అంకితం చేసిన నైజాం నవాబులని ఈ ప్రాజెక్టు ఉభయ జిల్లాలకు ఎంతో తోడ్పడుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిజాంసాగర్‌కు సక్రమంగా నీరు రాలేదన్నారు. క్యాచ్మెంట్ ఏరియాలో సక్రమంగా వర్షాలు కురియకపోవడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో మంజీరా నదిపై 40 చెక్‌డ్యాంలు నిర్మించడంతో దిగువకు నీరు రాలేక పోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఉభయ జిల్లాల్లో సాగునీరును అందించే భవిష్యత్తు అవసరాలకు కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని కొండ పోచమ్మ సాగర్ నుంచి హల్దివాగు ద్వారా నిజాంసాగర్‌లోకి తీసుకుని వచ్చామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు 323 గ్రామాలకు సాగునీరు అందించేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతియేటా వందలాది టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నాయన్నారు. కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 40 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నదుల్లో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఆయన వెంట పిట్లం, నిజాంసాగర్ మండలాల ఏఎంసీ ఉపాధ్యక్షులు గైని విఠల్, వైస్ ప్రెసిడెంట్ మనోహర్, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, శ్రీనివాస్‌రావు, డిప్యూటీ ఈఈ శ్రావణ్ కుమార్, అధికారులు తదితరులున్నారు.
సాగర్‌లో జనమే జనం
నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల నుంచి జనంతో కళకళలాడుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను సోమవారం ఎత్తి దిగువకు వదులుతుండటంతో ఆదివారం ఉభయ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి పర్యాటకులు తండోప తండాలుగా వచ్చారు. వీఏఆర్ నెంబర్ 4 వద్ద విడుదలవుతున్న నీటిని చూసి పర్యాటకులు కేరింతలు వేశారు. పరిసర ప్రాంతాల్లో కాటేజీల వద్ద పర్యాటకులు ఆహ్లాదకరంగా గడపడంతో పాటు సహపంక్తి భోజనాలు చేసి ఆనందంలో మునిగిపోయారు. నిజాంసాగర్ ప్రాజెక్టు రహదారులన్ని వాహనాలు, జనాలతో కిటకిటలాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఈ గార్డెన్ల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురయ్యారు.
కొనసాగుతున్న వరద గేట్లు
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 56,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆదివారం నాటికి వీఏఆర్ నెంబర్ 5 గేట్లలోని 8 గేట్ల ద్వారా 56,500 క్యూసెక్కుల నీటిని దిగువకు గేట్లను ఎత్తి విడుదల చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ నీటిని దిగువన వదులుతున్నారు. 1405 అడుగులకు గాను 1402.92 అడుగుల నీటి సామర్థ్యం నిల్వ చేస్తూ నేరుగా వరద గేట్ల ద్వారా దిగువకు మంజీరాలోకి వదిలివేస్తున్నారు. ప్రాజెక్టులో 17.802 టీఎంసీలకు గాను 14.881 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. బ్యాక్ వాటర్ కారణంగా అధిక మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నట్లు సమాచారం.