నివర్‌ భయం

ABN , First Publish Date - 2020-11-26T06:45:33+05:30 IST

దిగుబడిలో కొన్నది 30 శాతమే. మార్క్‌ఫెడ్‌ అధికారులు దాన్ని కూడా గోడౌన్లకు తరలించకుండా పొలాల్లోనే ఉంచారు.

నివర్‌ భయం
జూపాడుబంగ్లాలో మొక్కజొన్నలు నింపుకుంటున్న రైతులు

  1. ఆందోళనలో మొక్కజొన్న రైతులు
  2. ధాన్యం కొని.. తరలించని అధికారులు
  3. రైతులపై వాహనాల అద్దె, కూలీల భారం 
  4. తుఫాన్‌తో గోదాములకు చేరుస్తున్న రైతులు
  5. మద్దతు ధర ఆశించి అమ్మితే.. ఇదీ పరిస్థితి


ఆత్మకూరు/నంద్యాల టౌన్‌, నవంబరు 25: దిగుబడిలో కొన్నది 30 శాతమే. మార్క్‌ఫెడ్‌ అధికారులు దాన్ని కూడా గోడౌన్లకు తరలించకుండా పొలాల్లోనే ఉంచారు. ఇప్పుడు నివర్‌ భయం రైతులను వెంటాడుతోంది. దీంతో కొందరు సొంత ఖర్చు పెట్టుకుని వాహనాల్లో గోడౌన్లకు చేరుస్తున్నారు. హమాలీల ఖర్చు ప్రభుత్వం భరిస్తుండగా, కొన్నిచోట్ల రైతుల నుంచి కూడా వసూలు చేస్తున్నారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు తీరు ఇలా ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు. 


నిలిచిన కోనుగోలు

నంద్యాల డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో 20 రోజుల క్రితమే మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్క జొన్న కొనుగోలు చేశారు. కానీ ఇప్పటికీ ధాన్యం రైతుల పొలాల్లోనే ఉంది. పండిన ధాన్యంలో 30 శాతం మాత్రమే కోనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలా మండలాల్లో కొనుగోలు పరిమితి ముగిసినది. జిల్లాలో లక్ష టన్నులకు పైగా మొక్కజొన్న దిగుబడి వచ్చింది. ఇందులో 30 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసి, ఆ తరువాత నిలిపివేశారు. రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న రైతులకు మొక్కజొన్న కోనుగోలు చేసే తేదీలను తెలియజేస్తూ సమాచారం ఇచ్చారు. దీంతో రైతులు పోలాల్లో ధాన్యం ఆరబెట్టి ఎదురుచూస్తున్నారు. ఇటు అమ్మినవారు, అటు అమ్మకం కోసం ఎదురుచూస్తున్న వారూ తుఫాను కారణంగా ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తడిసిపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


సొంత ఖర్చుతో తరలింపు

మార్క్‌ఫెడ్‌ అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసినా ఇంతవరకూ తరలించలేదు. వర్షం వస్తే తడిసిపోతుందన్న భయంతో  రైతులు సొంత ఖర్చులతో వాహనాలను ఏర్పాటు చేసుకుని గోదాములకు తరలిస్తున్నారు.  తూకం వేయడానికి క్వింటానికి రూ.45 నుంచి రూ.59 వరకు చెల్లిస్తున్నారు. నంద్యాల మార్కెట్‌ యార్డులో రూ.50 నుంచి రూ.59 చెల్లిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.1500 బాడుగ ఖర్చు చేస్తున్నారు. గోదాముల వద్ద బస్తాలు దించడానికి రైతుల నుంచి హమాలీలు ట్రాక్టర్‌కు రూ.500 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర కోసం వెళితే ఇలా ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కూలి డబ్బులు మింగేస్తున్నారు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాటా వేసే సమయంలో హమాలీలకు క్వింటానికి రూ.35 కూలి ఇవ్వాలి. కానీ కొందరు అధికారులు దీన్ని రూ.45 ప్రకారం లెక్కించి, మిగిలిన సొమ్ము కాజేస్తున్నారని తెలిసింది. గోదాముల వద ్ద దించేందుకు బస్తాకు రూ.9 నుంచి రూ.12 వరకు చెల్లిస్తున్నారు. కానీ ఇందులో హమాలీలకు రూ.5 మాత్రమే అందుతోందని, మిగిలిన సొమ్ము దిగమింగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగా రైతుల నుంచి కూడా హమాలీలు డబ్బు వసూలు చేస్తున్నారని సమాచారం.


అద్దె వాహనాల్లో గోదాముకు..

ఆత్మకూరు మండలం వెంకటాపురం రైతు భరోసా కేంద్రంలో సుమారు 50 మంది రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చారు. ధాన్యాన్ని తూకం వేయించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. అయితే ధాన్యాన్ని గోదాములకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేయలేదు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని గోదాములకు తరలించేందుకు టెండర్‌ ద్వారా రవాణా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రవాణా ఏజెన్సీ వారు వాహనాలను పంపకపోవడంతో రైతులే వాహనాల్లో తరలించాల్సి వస్తోంది. 


కరివేన సమీపంలో ఓ గోదాముకు మంగళవారం సాయంత్రం సుమారు 50 ట్రాక్టర్లలో రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని తీసుకెళ్లారు. అక్కడ హమాలీలు తక్కువ మంది ఉండటంతో బస్తాలు దించేం దుకు ఇబ్బందులు తలెత్తాయి. దీనికితోడు సమయం ముగిసిందని అన్‌లోడ్‌ చేయలేదు. వర్షం వస్తే పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌ యార్డు సెక్రటరీ కృష్ణమోహన్‌రెడ్డిని వివరణ కోరగా, రవాణా టెండరు తీసుకున్న వ్యక్తి స్పందించలేదని అన్నారు. అందుకే సమస్య తలెత్తిందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని అన్నారు. 


డబ్బులు ఇవ్వలేదని.. 

అధికారులు మొక్కజొన్నలు కొనుగోలు చేసినా గోడౌన్‌కు తరలించలేదు. వర్షం వస్తుందన్న భయంతో సొంత ఖర్చులతో ట్రాక్టర్‌లో సోమవారం గోదాము వద్దకు తెచ్చాను. బస్తాలు దించడానికి హమాలీలు  రూ.500 అడిగారు. నేను డబ్బులు ఇవ్వకపోవడంతో ధాన్యం దించకుండా ఒక రోజు ట్రాక్టర్‌ను నిలిపివేశారు. మరుసటి రోజు డబ్బులు ఇచ్చిన తరువాత బస్తాలు దించారు. - వెంకటేశ్వర్లు, నెరవాడ, పాణ్యం మండలం 


హమాలీలకు ఇవ్వాల్సిన అవసరం లేదు..

హమాలీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. బస్తాకు కొంత మొత్తం కమీషన్‌ రూపంలో వారికి అందుతోంది. రైతులు వారికి ఎలాంటి కూలీ చెల్లించాల్సిన అవసరం లేదు. సొంత ఖర్చుతో వాహనాలలో తరలించాల్సిన అవసరం లేదు. తూకం వేసిన మొక్కజొన్నలను తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. - నాగరాజు, మార్క్‌ఫెడ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌



సొంత ఖర్చుతో తెచ్చాను

మొక్కజొన్నలను సొంత ఖర్చుతో ట్రాక్టర్‌లో గోడౌన్‌కు తెచ్చాను. తుఫాన్‌ కారణంగా వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు. పొలంలోనే ఉంటే ధాన్యం తడిసిపోతుందని భయపడి తెచ్చాను. అధికారులు వాహనాలు ఏర్పాటు చేయలేదు. అందుకే మాపై భారం పడుతోంది. - రవి తేజ రైతు, మహానంది మండలం, తమ్మడపల్లి


అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ ఫక్కీరప్ప

ఆత్మకూరు, నవంబరు 25: నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. కొత్తపల్లి మండలం సంగమేశ్వరఘాట్‌ను బుధవారం ఆయన సందర్శించి పూజలు చేశారు. ఇప్పటికే కర్నూలు, నంద్యాల, ఆదోని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామ న్నారు. అవసరమైతే 100 డయల్‌ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.


ధాన్యాన్ని భద్రపరుస్తున్న రైతులు

రుద్రవరం/చాగలమర్రి/జూపాడుబంగ్లా, నవంబరు 25: తుఫాన్‌ భయం రైతులను పరుగులు పెట్టిస్తోంది. నివర్‌ ప్రభావం జిల్లాపై మూడు రోజులు ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీంతో రుద్రవరం మండలంలో రైతులు కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కుప్పలు చేసి ట్రాక్టర్లలో గోడౌన్‌లకు తరలించారు. కోతకు వచ్చిన పంటను హడావుడిగా కోయిస్తున్నారు. భారీ వర్షం కురిస్తే పంట దెబ్బతింటుందని యంత్రాలతో కోయిస్తున్నారు. మరికొందరు మొక్కజొన్న, మినుము దిగుబడులపై పట్టలు కప్పుతున్నారు. సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన వర్షాలకు భారీగా నష్టపోయారు. ఇప్పుడు తుఫాను అనగానే ఆందోళన చెందుతన్నారు. 


చాగలమర్రి మండలంలోని ముత్యాలపాడు, చింతలచెరువు, నగల్లపాడు, గొడిగనూరు, డి.వనిపెంట, ఎం తండా, కేపీ తండా తదితర గ్రామాల్లో రైతులు చెరువులు, బోర్ల కింద సాగు చేసిన వరి పంటను కోయించారు. నూర్పిడి చేసి, ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్‌ పట్టలు కప్పుతున్నారు. మినుము, పత్తి, మిర్చి తదితర పంటలు కూడా వర్షానికి దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న రైతులు ట్రాక్టర్ల ద్వారా రైతు భరోసా కేంద్రాలకు తరలిస్తున్నారు. 


జూపాడుబంగ్లా మండలంలో నూర్పిడి చేసి ఆరబెట్టుకున్న మొక్కజొన్న ధాన్యాన్ని  రైతులు సంచులలో నింపుకుంటున్నారు. మద్దతు ధరకు అమ్ముకునేందుకు తమ వంతు వచ్చేదాకా ఎదురు చూస్తున్న రైతులను తుఫాను ప్రకటన భయపెడుతోంది. చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నష్టపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు.


బస్సుల నిలిపివేత

కర్నూలు(రూరల్‌): నివర్‌ తుఫాన్‌ కారణంగా కర్నూలు నుంచి నెల్లూరు, వేలూరు, చెన్నై నగరాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. ఈ మూడు ప్రాంతాలకు గురు, శుక్ర వారాల్లో బస్సు సర్వీసులను రద్దు చేశామని కర్నూలు రీజనల్‌ మేనేజర్‌ టీవీ రామం బుధవారం తెలిపారు. వాతావరణం అనుకూలించాక తిరిగి ప్రారంభి స్తామని తెలిపారు. ఆ ప్రాంతాలకు వెళ్లాలని భావించేవారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. బస్సు సర్వీసులను తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ ప్రకటిస్తామని తెలిపారు. 



Updated Date - 2020-11-26T06:45:33+05:30 IST