తల్లీ.. కరుణించు!

ABN , First Publish Date - 2020-11-28T05:13:35+05:30 IST

నివర్‌ తుఫాన్‌ వల్ల వర్షం కురుస్తున్నా మంత్రాలయం ఘాట్లకు భక్తులు వచ్చారు.

తల్లీ.. కరుణించు!
మంత్రాలయం వద్ద నదిలో స్నానం చేస్తున్న భక్తులు

  1. తగ్గిన పుష్కర రద్దీ


న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి: నివర్‌ తుఫాన్‌ వల్ల వర్షం కురుస్తున్నా మంత్రాలయం ఘాట్లకు భక్తులు వచ్చారు. రోజువారీ రద్దీతో పోల్చితే శుక్రవారం తక్కువ మంది భక్తులు కనిపించారు. ఉదయం నుంచి జల్లులు కురుస్తుండటంతో చలికి వణికిపోయారు. కొందరు నదిలో స్నానాలు చేశారు. కర్నూలులో గంగమ్మ విగ్రహానికి పూజలు చేశారు. సంకల్‌బాగ్‌ ఘాట్‌ యాగశాలలోకి వర్షం నీరు చేరడంతో పూజ సామగ్రిని భద్రపరిచేందుకు ఆర్చకులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం మహానంది వేద పండితుడు రవిశంకర్‌ అవధాని ఆధ్వర్యంలో కుంభ హారతి, నంది హారతి, బిల్వ హారతి, నాగ హారతి, నక్షత్ర హారతి ఇచ్చారు. మంత్రాలయం ఘాట్ల వద్ద కొందరు షవర్‌ స్నానాలు చేయగా.. చెట్నేహల్లి, మాధవరం ప్రాంతాల్లో మరికొందరు స్నానాలు చేశారు. ట్రైనీ ఐపీఎస్‌ కెపీఎస్‌లు కిశోర్‌, కెవీ మహేశ్వరరెడ్డి, అభిరాజ్‌ ఎస్‌ రానా, మీనా కుమార్‌ మంత్రాలయం మఠం ఘాట్‌ను సందర్శించారు. మఠం ఘాట్‌ వద్ద షవర్లకు గంటపాటు నీటి సరఫరా నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సంగమేశ్వరంలో 550 మంది భక్తులు సంప్రోక్షణ పొందినట్లు అధికారులు తెలిపారు. గాలులకు సంగమేశ్వరం, కపిలేశ్వరంలో గుడారాలు పడిపోయాయి. మహిళలు జలాల్లో దీపాలు వదిలి వాయనాలను సమర్పించారు. ఏర్పాట్లను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రమోహన్‌, డ్వామా పీడీ వెంగన్న, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో చంద్రశేఖర్‌ పర్యవేక్షించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌ దంపతులు అభిషేకాలు నిర్వహించారు. 

Updated Date - 2020-11-28T05:13:35+05:30 IST