నివర్‌ భయం

ABN , First Publish Date - 2020-11-24T05:30:00+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబెట్టారు.

నివర్‌ భయం
మిడుతూరులో మొక్క జొన్నలను కుప్పలుగా పోస్తున్న రైతులు


  1.   నేటి నుంచి 29వరకు వర్షాలు
  2.   ఆందోళన చెందుతున్న రైతులు
  3.   కర్నూలు, నంద్యాల, ఆదోనిలో కంట్రోల్‌ రూంలు
  4.   రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు


మిడుతూరు/చాగలమర్రి, నవంబరు 24: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబెట్టారు. అమ్ముకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో  రైతులను తుఫాను భయం వెంటాడుతోంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో ధాన్యం తడవకుండా రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు వరి, పత్తి, మినుము, మిర్చి తదితర పంటలు కూడా వర్షానికి దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలకు ఇప్పటికే చాలా నష్టపోయారు. మరోమారు తుఫాను రూపంలో గండం పొంచి ఉండటంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.


 మూడు రోజులు వర్షాలు

ఎమ్మిగనూరు టౌన్‌: నివర్‌ తుఫాన్‌ కారణంగా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగం, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహాదేవయ్య మంగళవారం ప్రకటనలో తెలిపారు. 25న చాగలమర్రి మండలంలో చిరుజల్లులు కురుస్తాయన్నారు. మిగతా మండలాల్లో వర్ష సూచన లేదన్నారు. 26న జిల్లాలో అన్ని మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షసూచన ఉందన్నారు. 27న కోసిగి, హొళగుంద, కౌతాళం మండలాల్లో తేలికపాటి వర్షం, ఎమ్మిగనూరు, మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, పెద్దకడుబూరు, నందవరం, మంత్రాలయం, గూడూరు, దేవనకొండ, కోడుమూరు, హాలహర్వి, సి. బెళగల్‌, చిప్పగిరి, ఆలూరు, ఆస్పరి, గోనెగండ్ల, ఆదోని మండలాల్లో ఓ మోస్తరు వర్షం, కర్నూలు, కృష్ణగిరి, వెల్దుర్తి, జూపాడుబంగ్లా, ప్యాపిలి, నందికొట్కూరు, రుద్రవరం, మిడుతూరు, పాములపాడు, కల్లూరు, చాగలమర్రి, ఆత్మకూరు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఉయ్యాలవాడ, వెలుగోడు, పగిడ్యాల, ఓర్వకల్లు, శ్రీశైలం, డోన్‌, బండి ఆత్మకూరు, ఆళ్లగడ్డ, కొత్తపల్లె, గడివేముల మండలాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, మహానంది, అవుకు, పాణ్యం, నంద్యాల, సంజామల, శిరివెళ్ల, కొలిమిగుండ్ల, బనగానపల్లె, కోవెలకుంట్ల, బేతంచెర్ల, దొర్నిపాడు, గోస్పాడు మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 28న అన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయన్నారు. 29న జూపాడుబంగ్లా, ఆత్మకూరు, నంద్యాల, పాములపాడు మినహా అన్ని మండలాల్లో చిరుజల్లుల నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. రైతులు పంట కోతలను వాయిదా వేసుకోవాలని, ఇదివరకే కోసిన ధాన్యాన్ని కప్పి ఉంచుకోవాలని సూచించారు. 


సీఎం సమీక్ష

 కర్నూలు(అర్బన్‌/అగ్రికల్చర్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహ న్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వీరపాండి యన్‌, జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి మంగళవారం  వీడియో కాన్ఫరెన్సు నిర్వంచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ రాష్ట్రాన్ని తాకకపోయినా సమీప ప్రాంతంలో దాని ప్రభా వం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్‌ ప్రభావం బుధ, గురువారాల్లో ఉంటుందని తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అత్యధిక  వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 65 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం  తెలిపారు. పంటలు దెబ్బతినకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టరే ట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవాలని, మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌ రూమ్స్‌ ఉండేలా చూసుకో వాలని సూచించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వీర పాండియన్‌ సీఎంకి వివరించారు. జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోతకు వచ్చిన వరి, పత్తి, కంది తదితర పంటల రక్షణ కోసం వ్యవసాయశాఖను అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో 80 శాతానికి పైగా నిండిన అన్ని చెరువుల వద్ద అప్ర మత్తంగా ఉంటామని, ఇసుక బ్యాగ్‌లును సిద్ధం చేసుకో వాలని ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ, ఇంజనీర్లకు ఆదేశాలిచ్చా మన్నారు. సహాయక చర్యల కోసం కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేశామని, కలెక్టరేట్‌  08518-277305, నంద్యాల ఆర్డీవో కార్యాలయం 08514-2 21550, 8333989012, ఆదోని ఆర్డీవో కార్యాలయం 8333989012, కర్నూలు ఆర్డీవో కార్యాలయం 8333989011 నెంర్లకు ఫోన్‌ చేస్తే సహాయక చర్యలు ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రికి తెలిపారు. 


రైతులు అప్రమత్తంగా ఉండాలి

తుఫాన్‌ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉందని, రైతులు పంట ఉత్పత్తులను కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని జేడీఏ ఉమామహేశ్వరమ్మ సూచించారు. రాబోయే మూడు రోజుల్లో రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ఆమె మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటను కోసే విషయం లో వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. కోత కోసిన దిగుబడులను కల్లాల్లో ఆరబోసి ఉంటే, వాటి పై టార్పళ్లు కప్పాలని, లేదా సమీపంలోని ఇళ్లు, గోదా ముల్లో నిల్వ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరి పంటను కోసి ఉంటే రెండు గ్రాముల ఉప్పును, ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. తద్వారా గింజ రంగు మారకుండా, మొలకలు రాకుండా కాపాడుకోవచ్చని వివరించారు.  తుఫాను ప్రభావం తగ్గేవరకూ పత్తి పంటను కోయవద్దని సూచించారు. 

Updated Date - 2020-11-24T05:30:00+05:30 IST