కర్షకులకు ‘నివర్‌’పాటు

ABN , First Publish Date - 2020-11-28T06:23:47+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కన్నీరే మిగిల్చాయి. నియోజకవర్గంలో వివిధ మండలాల పరిధిలో చెరువుల కింద సాగైన వరిపంట మొత్తం దాదాపు తుడిచిపెట్టుకు పోయింది.

కర్షకులకు ‘నివర్‌’పాటు
ఎర్రబాలెంలో నీటమునిగిన వరి పంటను చూపుతున్న రైతులు

గిద్దలూరు, నవంబరు 27 : తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కన్నీరే మిగిల్చాయి.  నియోజకవర్గంలో వివిధ మండలాల పరిధిలో చెరువుల కింద సాగైన వరిపంట మొత్తం దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. కంది అధికశాతం పూత రాలింది. 10శాతం దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. శనగ 20 రోజులక్రితం సాగు చేయగా నీరు నిలబడిన పొలాల్లో తిరిగి విత్తనాలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆలస్యంగా సాగు చేపట్టిన మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న కూడా 20 రోజుల క్రితమే సాగు మొదలుకాగా ప్రస్తుత వర్షానికి అవి తట్టుకొని నిలబడ్డాయి. తుఫాను ప్రభావంతో సుమారు 10 కోట్ల మేర రైతాంగం నష్టపోయినట్లు వ్యవసాయాధికారులు అంచనాకు వచ్చారు.  వర్షం కొనసాగితే నష్టం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.  కంభం చెరువు పూర్తిగా నీరు నిండి తొనికిసలాడుతుండగా, గుండ్లకమ్మ, సగిలేరు, ఎనుమలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. నల్లమల అడవిలో కూడా వర్షం ఏకదాటిగా కురుస్తుండడంతో వాగులుపొంగి ఊరిమీదకు వస్తాయేమోనని గిద్దలూరు పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. చలిగాలులు విపరీతంగా వీస్తుండడంతో చిన్నపిల్లలు, వృద్దులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చలిజ్వరాలతో బాధపడుతూ వచ్చేవారి సంఖ్య 200కు పైగానే నియోజకవర్గం మీద ఉన్నట్లు తెలుస్తుంది. చలితీవ్రత తట్టుకోలేక కొమరోలు మండలంలో 12 గొర్రెలు మృతిచెందాయి.


గిద్దలూరు టౌన్‌ : ప్రస్తుతం నివర్‌ తుఫాన్‌ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌ అన్నారు. ఆయన శుక్రవారం వార్డు, సచివాలయ, రెవెన్యూ, వలంటీర్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించి తుఫాన్‌ తాజా పరిస్థితిపై అధికారులను అప్రమత్తం చేశారు. వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వరద బాధితుల కోసం పట్టణంలోని జిల్లాపరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను రిలీవ్‌ సెంటర్‌గా కేటాయించామని, భోజన సదుపాయాలు కూడా కల్పించామని తహసీల్దార్‌ తెలిపారు.

కంభం : నివర్‌ తుఫాన్‌ ప్రభావం వలన కంభం అర్భన్‌కాలనీలో పలు గృహాల్లోకి నీరు చేరి కాలనీవాసులకు నిద్రలేకుండా చేసింది. అర్భన్‌కాలనీ 2500 గృహాలకు పైగా ఉన్నాయి. ఈ గృహాలకు డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షం నీరు వెళ్లే దారిలేక నీరు మొత్తం గృహాల్లోకి వెళ్లాయి. దీంతో మోటార్లు పెట్టి వర్షం నీటిని బయటకు తోడుకుంటున్నారు. 

 నివర్‌ తుఫాన్‌ వలన  సుమారు 2కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. వ్యవసాయాధికారులు అంచనా ప్రకారం కోతదశలో ఉన్న వరి, పొగాకు పంటలు, పూతదశలో ఉన్న కంది, పప్పుశనగ పంటలు నీటమునిగాయి. కంభం వ్యవసాయాధికారి మీరయ్య లెక్కల ప్రకారం పప్పుశనగ కంభం మండలంలో 6,500 ఎకరాలు, అర్థవీడు మండలంలో 4వేల ఎకరాలు దెబ్బతింది. కంది, వరి పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇక ఉద్యానపంటలైన పసుపు, అరటి, ఇతర పంటలు ఏమేరకు నష్టం జరిగిందో తెలుసుకునేందుకు ఉద్యావన శాఖాధికారులు అందుబాటులో లేకుండా పోయారు.

కంభం చెరువు పరిశీలన

 తుఫాను ప్రభావంతో వర్షాలు అధికంగా కురవడంతో శుక్రవారం మార్కాపురం ఆర్‌డీవో శేషిరెడ్డి కంభం చెరువును, రావిపాడు వద్ద గుండ్లకమ్మ వాగులను పరిశీలించారు. గ్రామప్రజలు వాగు ఉదృతి పెరిగే సమయంలో అటువైపు రాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయన తహసిల్దార్‌ రామ్మోహన్‌రావు, ఎస్‌ఐ మాధవరావు, డీటీ ప్రసాద్‌, తదితరులు ఉన్నారు. 

పంటలకు అపార నష్టం

రాచర్ల :  తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖాధికారి షేక్‌ మహబూబ్‌భాషా ఆధ్వర్యంలో ఏడీఏ బాలాజీనాయక్‌ శుక్రవారం పరిశీలించారు. గంగంపల్లె, రాచర్ల, అనుమలవీడు గ్రామాలలో పర్యటించారు.  685 హెక్టార్లమేర కంది, 1100 హెక్టార్ల శనగ, 200 హెక్టార్ల నువ్వులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

గిద్దలూరు టౌన్‌ : సబ్‌డివిజన్‌ పరిధిలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల పరిధిలో సుమారు 15,970 హెక్టార్లమేర వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఆమేరకు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రధానంగా పప్పుశనగ సబ్‌డివిజన్‌ పరిధిలో 6,558 హెక్టార్లలో, కంది 6,093 హెక్టార్లలో దెబ్బతింది. సబ్‌డివిజన్‌లో వరి 501 హెక్టార్లు, వేరుశనగ 10 హెక్టార్లలో, వరిగ 713 హెక్టార్లలో, పత్తి 340 హెక్టార్లు, మొక్కజొన్న 173 హెక్టార్లు, తదితర పంటలు 15,970 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు అంచనాకు వచ్చారు. 

పుల్లలచెరువు : తుఫాన్‌ ప్రభావంతో మిరప తోటల్లో బోదేలో నీరు చేరి దెబ్బతింది. వరి, మినుము కోసి ఉన్న పైర్లు నీటిలో తేలాడాయి. మొక్కజొన్న పైరు నేలకు ఒరిగింది. దీంతో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. మండలంలో ప్రధానంగా మిరప  2 వేల హెక్టర్లలో సాగు చేశారు. హెక్టారుకు సూమారు రూ.1.20 లక్షలు ఖర్చు చేశారు. అయితే మిరప పిందె దశలో ఉంది.  వర్షానికి బోదెల్లో నీరు చేరి ంది. మొక్కలు ఒరిగి కొమ్మలు కూళ్లు పట్టాయి. సాగులో ఉన్న వరి 182 హెక్టర్లు, మొక్కజోన్న 22, హెక్టార్లు, మినుము 200 హెక్టార్లు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 

పెద్దారవీడు : మండలంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పత్తి, మిరప, టమోటా పొలాల్లో నీరు చేరింది. దీంతో తీవ్ర స్థాయిలో నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వర్షానికి మిరప పంటలు నేలకొరిగాయి. దీంతో పాటుగా గొబ్బూరు గ్రామంలో శనగ, పత్తి పంటలు కూడా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. మండలంలోని మంద్దలకట్ట గ్రామంలో పొగాకు పొలాల్లోకి నీరు చేరింది. పొగాకు బ్యారన్‌ కూడా వర్షానికి నేల కూలింది. దీంతో తీవ్రంగా నష్టం చేకూరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  పత్తి పంట ఆరు వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పూర్తి స్థాయిలో పత్తి దెబ్బతింటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయాధికారి కె.బుజ్జిబాయ్‌ తమ సిబ్బందితో పంట పొలాలను పరిశీలించారు.

త్రిపురాంతకం : నివర్‌ తుఫాను ప్రభావంతో పొలాలు దెబ్బతిన్నాయి. విశ్వనాధపురం, వెల్లంపల్లి, లేళ్ళపల్లి గ్రామాలలో నీట మునిగిన పంటలను తహసీల్దారు వి.కిరణ్‌, మండల వ్యవసాయాధికారిణి కె.నీరజ శుక్రవారం పరిశీలించారు. ఇప్పటి వరకు 1200 ఎకరాల్లో వరి, 400 ఎకరాల్లో మొక్కజొన్న, 350 ఎకరాల్లో పత్తి, 150 ఎకరాల్లో మినుము వర్షపు నీటిలో మునిగినట్లు అంచనాకు వచ్చినట్లు ఏవో తెలిపారు. సుమారు 600 ఎకరాల్లో మిర్చి, 200 ఎకరాల్లో  బొప్పాయి, మేడపిలో దొండతోట పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారి నబిరసూల్‌ తెలిపారు. కాగా త్రిపురాంతకంలో బ్రహ్మంగారికాలనీలో కొన్ని వీధులలోకి వర్షపునీరు చేరింది. దీంతో తహసీల్దారు కిరణ్‌ వీఆర్వో శివలింగయ్య, పీఎస్‌ ఏడుకొండలు పరిశీలించారు. ప్రజలను అప్రమత్తం చేశారు.

 ఎర్రగొండపాలెం : నివర్‌ తుఫాన్‌ పట్ల  రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏడీఏ కేఐ సుదర్శనరాజు రైతులకు సూచించారు. ఎర్రగొండపాలెం మండలం నరసాయపాలెం, బోయలపల్లి గ్రామాల పొలాల్లో మిరప, పత్తి కంది పైర్లను శుక్రవారం ఉద్యానవన, మండల వ్యవసాయాధికారులతో కలసి పరిశీలించారు. పత్తిపైరులో తేమను నివారించడానికి  పొటాషియం నైట్రేట్‌ పౌడరు 10 గ్రాములు 1 ఒక లీటరు నీటకికలిపి పిచికారిచేసుకోవాలన్నారు. వర్షం నిలిచిన తర్వాత  1 ఎకరా పొలానికి  30 కేజీల యూరియా 15 కిలోల పొటా్‌షను కలిపి పొలంలో చల్లాలన్నారు. 



Updated Date - 2020-11-28T06:23:47+05:30 IST