నితీశ్‌ సీన్‌ రిపీట్‌

ABN , First Publish Date - 2022-08-10T06:24:59+05:30 IST

‘డబుల్‌ ఇంజన్‌ సర్కారు’ నినాదంతో.. అప్రతిహతంగా జైత్రయాత్ర చేస్తూ.. ఒక్కో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి బిహార్‌లో ఎదురుదెబ్బ తగిలింది..! ఆ రాష్ట్రం కమలదళం చేజారిపోయింది. ఇంతకాలం ఎన్డీయే సర్కారును నడిపిన జనతాదళ్‌(యునైటెడ్‌) నేత నితీశ్‌ కుమార్‌.. మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా..

నితీశ్‌ సీన్‌ రిపీట్‌

ఐదేళ్ల తర్వాత మళ్లీ జేడీయూ, ఆర్జేడీ జట్టు 

బిహార్‌లో మహా గఠ్బంధన్‌ సర్కారు.. నేడే కొలువు

సీఎంగా నితీశ్‌.. డిప్యూటీగా తేజస్వీయాదవ్‌

అంతకుముందు వేగంగా మారిన పరిణామాలు

గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించిన నితీశ్‌ 

7 పార్టీల కూటమితో సర్కారు.. గవర్నర్‌కు నివేదన

స్వాగతించిన విపక్షాలు.. బీజేపీ గరంగరం

లాలూ లేకుండా బిహార్‌ నడవలేదు

పాట పోస్ట్‌ చేసిన లాలూ కుమార్తె రోహిణి


పట్నా, ఆగస్టు 9: ‘డబుల్‌ ఇంజన్‌ సర్కారు’ నినాదంతో.. అప్రతిహతంగా జైత్రయాత్ర చేస్తూ.. ఒక్కో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి బిహార్‌లో ఎదురుదెబ్బ తగిలింది..! ఆ రాష్ట్రం కమలదళం చేజారిపోయింది. ఇంతకాలం ఎన్డీయే సర్కారును నడిపిన జనతాదళ్‌(యునైటెడ్‌) నేత నితీశ్‌ కుమార్‌.. మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ను కలిసి ఈ మేరకు తన రాజీనామాను సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను సీఎం పదవికి రాజీనామా చేసిన విషయాన్ని నిర్ధారించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంతో నిర్ణయించారని వివరించారు. ఆ వెంటనే ఆయన మాజీ సీఎం రబ్రీదేవి నివాసానికి చేరుకున్నారు.


అక్కడ రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌తో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా 2013లో ఏర్పాటైన మహా గఠ్బంధన్‌ను పునరుద్ధరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వీరు చర్చించారు. ఈ కూటమిలో 79 స్థానాలున్న ఆర్జేడీతోపాటు.. జేడీయూ(45 + 1 స్వతంత్ర), కాంగ్రెస్‌ (19), సీపీఐఎంఎల్‌(12), సీపీఐ(2), సీపీఎం(2), మాజీ సీఎం మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం(4 స్థానాలు) ఉన్నాయి. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 122 కాగా.. ఈ కూటమి బలం 164గా ఉండనుంది. మహాగఠ్బంధన్‌లోని పార్టీలన్నీ నితీశ్‌కు మద్దతిస్తున్నట్లు ఓ లేఖను అప్పటికే సిద్ధం చేశారు.


తేజస్వీయాదవ్‌తో భేటీ తర్వాత నితీశ్‌ మరోమారు గవర్నర్‌ను కలిశారు. మహాగఠ్బంధన్‌ తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తమకు 164 మంది సభ్యుల బలం ఉందని పేర్కొంటూ కూటమి సభ్యులు అందజేసిన లేఖను సమర్పించారు. తేజస్వీతో చర్చల సమయంలోనే ఆయన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. అంతేకాకుండా.. 2017లో తాను చేసిన పనికి రబ్రీదేవి, తేజస్వీని క్షమాపణ కోరినట్లు తెలిసింది. అంతకు ముందు నితీశ్‌ కుమార్‌ జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీతో తెగదెంపులు, మహాగఠ్బంధన్‌తో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో బీజేపీతో తెగదెంపులకు మొగ్గుచూపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశం చివర్లో నితీశ్‌ మాట్లాడుతూ.. బీజేపీతో జేడీయూ పొత్తు ముగిసిందని అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం.


నేడే కొత్త సర్కారు.. డిప్యూటీగా తేజస్వీ!

నితీశ్‌ కుమార్‌ కొత్త సర్కారు బుధవారమే కొలువుదీరనున్నట్లు మహాగఠ్బంధన్‌ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగా నితీశ్‌తోపాటు.. ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని వివరించాయి. తేజస్వీకి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి బాధ్యతలు అందజేస్తారని తెలుస్తోంది. 2015 ఎన్నికల తర్వాత మహాగఠ్బంధన్‌ ప్రభుత్వంలోనూ తేజస్వీ ఇవే బాధ్యతలను స్వీకరించారు. లాలూ మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా పనిచేశారు. వీరి రెండేళ్ల కూటమికి 2017లో బ్రేక్‌ పడింది. అప్పట్లో ఆర్జేడీ అవినీతిని సాకుగా చూపిన నితీశ్‌ కుమార్‌ బీజేపీ పంచన చేరి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీయూ - బీజేపీ కూటమి విజయం సాధించింది. జేడీయూకు తక్కువ మెజారిటీ ఉన్నా.. నితీశ్‌కే సీఎంగా అవకాశం దక్కింది. అయితే.. బీజేపీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని, తన సర్కారును రిమోట్‌ కంట్రోల్‌లా మార్చాలని చూస్తోందని నితీశ్‌ ఇంతకాలం లోలోపల రగిలిపోతూ వచ్చారు. దాంతో.. బీజేపీకి గుడ్‌బై చెప్పి.. మళ్లీ పాతకూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


స్పీకర్‌ కొవిడ్‌..! నెగెటివ్‌..!

బిహార్‌లో ప్రభుత్వ మార్పునకు వేగంగా పావులు కదులుతున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హా ఆరోగ్యంపై ఆందోళనకరమైన వార్తలు వచ్చాయి. సోమవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. మంగళవారం మరోమారు జరిపిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఆయన బీజేపీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. బిహార్‌ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కొవిడ్‌ రిపోర్టులపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య మంత్రి మంగళ్‌ పాండే కూడా బీజేపీ నేత అని సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. రెండు నెలల క్రితం మహారాష్ట్రలో అధికార సంక్షోభం వచ్చినప్పుడు కూడా ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీకి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.


లాలూ ఉంటేనే బిహార్‌..!

‘జబ్‌ తక్‌ సమోసామే రహేగా ఆలూ.. తబ్‌ తక్‌ బిహార్‌మే రహేగా లాలూ’.. ఒకప్పుడు బిహార్‌ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నినాదమిది. ఎంతకాలమైతే సమోసాలో ఆలుగడ్డకు స్థానముంటుందో.. అప్పటి వరకు బిహార్‌ రాజకీయాల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఉంటారనేది దాని అర్థం. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ కూతురు రోహిణీ ఆచార్య ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాలూ ఉంటేనే బిహార్‌ మనుగడ సాగిస్తుందనే అర్థం వచ్చేలా ఓ పాటను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. లాలూ మరో కూతురు రాజ్‌ లక్ష్మీయాదవ్‌ కూడా తన తండ్రి, సోదరుడి ఫొటోలను షేర్‌ చేశారు. నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలో బిహార్‌ అభివృద్ధి చెందుతోందని మాజీ సీఎం, హిందుస్థానీ అవామి మోర్చా(హెచ్‌ఏఎం) చీఫ్‌ జీతన్‌రాం మాంఝీ కొనియాడారు. కాగా, జేడీయూది వెన్నుపోటు రాజకీయాలని బీజేపీ ఆరోపించింది. తాజా పరిణామాలపై బీజేపీ బిహార్‌ అధ్యక్షుడు సంజయ్‌ జైస్వాల్‌ తీవ్రంగా స్పందించారు. 2020 ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినా.. నితీశ్‌ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే.. ఇప్పుడు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు.   




రాష్ట్రపతి పాలన విధించాలి: చిరాగ్‌

ఆర్జేడీతో నీతీశ్‌ చేతులు కలపడంపై లోక్‌ జనశక్తి పార్టీ(రాంవిలాస్‌ వర్గం) నేత చిరాగ్‌ పాసవాన్‌ మండిపడ్డారు. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. నీతీశ్‌ విశ్వసనీయత కోల్పోయారని.. వచ్చే ఎన్నికల్లో జేడీయూకు సున్నా సీట్లు వస్తాయన్నారు. మంగళవారం ఆయన పట్నాలో విలేకరుల వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. 2020 ఎన్నికల్లో జేడీయూ ఓటమే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దింపిన చిరాగ్‌.. ఇటీవల బీజేపీకి దగ్గరవుతున్నారు. 


నితీశ్‌ ముందే మేల్కొన్నారు: తేజస్వీ

హిందీ బెల్ట్‌ రాష్ర్టాల్లో బీజేపీకి భాగస్వామ్య పార్టీలేవీ లేవని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీలను నాశనం చేస్తుందనే విషయాన్ని చరిత్రే చెబుతోందన్నారు. పంజాబ్‌, మహారాష్ట్రల్లో జరిగిందేమిటో చూశామని గుర్తుచేశారు. బీజేపీ తన భాగస్వామ్య పార్టీలను చీల్చి.. పగ్గాలు చేపడుతోందని ఆక్షేపించారు. బిహార్‌లోనూ జేడీయూని చీల్చి సొంతంగా పాలించాలనుకుందన్నారు. సీఎం నీతీశ్‌కుమార్‌ త్వరగా మేల్కొని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారని చెప్పారు.

Updated Date - 2022-08-10T06:24:59+05:30 IST