నితీష్‌తో ప్రశాంత్ కిషోర్ విందు సమావేశం

ABN , First Publish Date - 2022-02-19T22:28:02+05:30 IST

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా తన మాజీ బాస్..

నితీష్‌తో ప్రశాంత్ కిషోర్ విందు సమావేశం

న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా తన మాజీ బాస్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలిసి విందు సమావేశంలో పాల్గొన్నారు. 2020లో పార్టీ సభ్యత్వం నుంచి ప్రశాంత్ కిషోర్‌ను నితీష్ తొలగించిన తర్వాత ఉభయులూ సమావేశం కావడం ఇదే ప్రథమం. ఢిల్లీలోని నితీష్ అధికారిక నివాసంలో ఇరువురూ సుమారు 2 గంటల సేపు సమావేశమయ్యారు.


ఢిల్లీలో ఇద్దరూ విందు సమావేశంలో పాల్గొన్న విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ నితీష్‌కుమార్ ధ్రువీకరించారు. ప్రశాంత్‌ కిషోర్‌తో తనకు పాత అనుబంధం ఉందని, తమ సమావేశం వెనుక ఏవో ఉద్దేశాలు ఊహించుకోవద్దని నవ్వుతూ చెప్పారు. పీకే (ప్రశాంత్ కిషోర్) సైతం తాము మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్టు తెలిపారు. నితీ‌ష్ కుమార్ ఒమైక్రాన్ ఇన్‌ఫెక్షన్‌‌తో ఉన్నప్పుడు ఫోనులో ఆయన ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నానని, ఇద్దరం ఒకసారి కలుసుకుందామని నితీష్ తనతో అన్నారని, ఈరోజు కలుసుకోగలిగామని చెప్పారు.


బీహార్‌లో నితీష్‌కుమార్ జనతాదళ్ యునైటెడ్ విజయం కోసం గతంలో వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత ఆ పార్టీలో చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, నితీశ్, పీకే మధ్య సంబంధాలు క్షీణించడంతో ఆయనను ఆ పదవి నుంచి నితీష్ తొలగించారు. దాంతో ఆ పార్టీకి పీకే దూరమయ్యారు. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ సారథ్యంలోని టీఎంసీ తిరిగి ఘనవిజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన బలంగా పనిచేసింది. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సైతం నితీష్‌తో తనకున్న సంబంధాల గురించి పీకే మాట్లాడుతూ, తాను తిరిగి కలిసి పనిచేయాలనుకుంటున్న కొద్దిమంది నేతల్లో ఆయన కూడా ఒకరని పేర్కొన్నారు.

Updated Date - 2022-02-19T22:28:02+05:30 IST