Rupee Vs Dollar: రూపాయి పతనంపై నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-03T00:33:01+05:30 IST

అమెరికన్ డాలర్‌ (Dollar)తో పోల్చినపుడు భారత దేశ కరెన్సీ రూపాయి

Rupee Vs Dollar: రూపాయి పతనంపై నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : అమెరికన్ డాలర్‌ (Dollar)తో పోల్చినపుడు భారత దేశ కరెన్సీ రూపాయి (Rupee) విలువ పతనమవుతోందనే ఆందోళనను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ప్రయత్నించారు. రూపాయి విలువ కుప్పకూలిపోలేదని, వాస్తవానికి అది తన సహజ మార్గాన్ని అనుసరిస్తోందని చెప్పారు. 


నిర్మల సీతారామన్ రాజ్యసభ ప్రశ్నోత్తరాల (Rajya Sabha Question Hour) సమయంలో మాట్లాడుతూ, భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నిరంతరం స్థానిక కరెన్సీ పరిస్థితిని పర్యవేక్షిస్తోందన్నారు. కేవలం తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నపుడు మాత్రమే జోక్యం చేసుకుంటోందని తెలిపారు. భారతీయ రూపాయి (Indian Rupee)  విలువను నిర్ణయించేందుకు ఆర్బీఐ జోక్యాలు ఎక్కువగా లేవని చెప్పారు. అది తన స్వంత, సహజ మార్గాన్ని నియంత్రణ లేకుండా అందిపుచ్చుకోవాలన్నారు. భారతీయ రూపాయి, అమెరికన్ డాలర్, తదితర కరెన్సీల మధ్య జరుగుతున్న తీవ్రమైన మార్పులను నియంత్రించడానికే ఆర్బీఐ ఎక్కువగా జోక్యం చేసుకుంటుందని చెప్పారు. 


ఆర్బీఐ జోక్యం చేసుకున్నప్పటికీ, అది రూపాయి విలువను నిర్ణయించడానికి కాదని, దాని విలువను తగ్గించడానికి లేదా పెంచడానికి కాదని వివరించారు. తీవ్రమైన మార్పులను నిరోధించేందుకు, దాని మార్గాన్ని దానిని అనుసరించడానికి అవకాశం కల్పించేందుకు మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని చెప్పారు. చాలా ఇతర దేశాల మాదిరిగానే భారత దేశం తన కరెన్సీని పొంతన లేని స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం లేదన్నారు. మనం బలోపేతమయ్యేందుకు ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అరమరికలు లేకుండా కలిసి పని చేస్తున్నాయన్నారు. 


భారతీయ రూపాయి తనతో దాదాపు సమాన స్థాయిలో ఉన్న కరెన్సీ (peer currency)ల కన్నా మెరుగైన పనితీరును కనబరచిందని చెప్పారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాల ప్రభావానికి మన రూపాయి ఏదైనా ఇతర peer currency కన్నా మెరుగ్గా నిలదొక్కుకుంటోందని చెప్పారు. సందర్భాన్ని అర్థం చేసుకోవాలని, భారతీయ రూపాయి గురించి మాట్లాడాలని సభ్యులను కోరారు. 


అంతకుముందు టీఎంసీ ఎంపీ లుయిజిన్హో ఫెలీరో మాట్లాడుతూ, గడచిన ఆరు నెలల్లో రూపాయి విలువ 28 సార్లు పతనమైందని, 34 శాతం తగ్గిందని చెప్పారు. జూలై మొదటి పక్షంనాటికి విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 572 బిలియన్ డాలర్లకు క్షీణించాయని చెప్పారు. 


Updated Date - 2022-08-03T00:33:01+05:30 IST