‘కేజీ’పై యూ టర్న్‌

ABN , First Publish Date - 2022-06-10T13:05:43+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ‘కేజీ’కి స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. మూడు రోజులకే వెనక్కి తగ్గింది. అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తిన నిరసన, ప్రతిపక్షాల విమర్శ

‘కేజీ’పై యూ టర్న్‌

- ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎల్‌కేజీ, యూకేజీ

- మంత్రి అన్బిల్‌ మహేష్‌


చెన్నై, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ‘కేజీ’కి స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. మూడు రోజులకే వెనక్కి తగ్గింది. అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తిన నిరసన, ప్రతిపక్షాల విమర్శల దాడితో యూటర్న్‌ తీసుకుంది. ఒకటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. గతంలోలానే ప్రభుత్వ పాఠశాలల్లోనే కేజీ తరగతులు కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి గురువారం విలేఖరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. మునుపటి అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో 2018లో 2,381 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించారు. ఆ తరగతులకు పేద, మధ్యతరగతి ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం 1 నుంచి 5 తరగతులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుల కొరత ఉందంటూ ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు మారుస్తూ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ సహా పలు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి విలేఖరులతో మాట్లాడుతూ... ఎప్పటిలానే ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతాయని ప్రకటించారు. పాఠశాలల స్థాయిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, దీంతో ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతోందని, ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పడానికే వారి సమయం సరిపోతుందన్నారు. అలాంటప్పుడు ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను నిర్వహించడం సమంజసంగా ఉండదనే భావనతో అంగన్వాడీల్లో ఆ తరగతులు జరపాలని అనుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సలహా మేరకు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని మంత్రి వివరించారు.

Updated Date - 2022-06-10T13:05:43+05:30 IST