Abn logo
May 14 2021 @ 23:48PM

నిమ్రాలో నరకమే..!

ఆక్సిజన్‌ అందక అల్లాడుతున్న యువకుడి కాళ్లు, చేతులు దుప్పటితో బెడ్‌కు కట్టేసిన దృశ్యం

ఆక్సిజన్‌ అడిగితే కాళ్లు, చేతులు కట్టేశారు..

ఎవరైనా నిలిదీస్తే బౌన్సర్లను ఉసిగొల్పుతారు

ఆరోగ్యశ్రీ పేరుచెప్పి దోచుకు తింటున్నారు

ప్రశ్నించిన ఎమ్మెల్యే, జేసీపై దురుసు ప్రవర్తన

ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు

ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కరోనా బారినపడి వైద్యం కోసం నిమ్రా ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్‌ స్థాయి 90కు పడిపోవడంతో తనకు ఆక్సిజన్‌ పెట్టాలంటూ ఆ యువకుడు ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నా ఒక్కరూ పట్టించుకోలేదు. పైగా గొడవ చేస్తున్నాడంటూ అతని కాళ్లు, చేతులు మంచానికి కట్టేశారు. ఈ దృశ్యాలను పక్కనే ఉన్నవారు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

..ఈ ఒక్క ఘటనే కాదు. ప్రస్తుతం నిమ్రా ఆసుపత్రిలో కరోనా బాధితులకు దోచుకు తింటున్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు డబ్బు వసూలు చేస్తున్నారు. మందులు బయటే కొని తెచ్చుకోమంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి బాధితులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఇదేమిటని అడగడానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే, అధికారులపై యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్‌ కేసు నమోదు చేశారు. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా కల్లోలం సృష్టిస్తుంటే బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన ఆసుపత్రులు యమకూపాలుగా మారుతున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఆసుపత్రి. ఇక్కడ 300 పడకలు కేటాయించారు. ఫస్ట్‌ వేవ్‌ సమయంలో నాణ్యమైన వైద్యసేవలు అందించిన ఆసుపత్రిగా దీనికి పేరుంది. సెకండ్‌ వేవ్‌లో మాత్రం కరోనా బాధితులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. ఈ ఆసుపత్రి పనితీరుపై సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

అధికారులతో వితండవాదం

ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌, జేసీ మాధవీలత, డీఎంహెచ్‌వో సుహాసినీ గురువారం ఆసుపత్రిని సందర్శించారు. వీరంతా ఆసుపత్రికి వెళ్లి గంటన్నర సేపు వేచి ఉన్నా యాజమాన్యం కానీ, వైద్యులు కానీ రాలేదు. ఆ తర్వాత ఆసుపత్రి యాజమాన్యం తరఫున ఓ వ్యక్తి వచ్చి అనుమతి లేకుండా తనిఖీలకు ఎలా వస్తారంటూ ఎదురు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే, అధికారులు కంగుతిన్నారు. ఆసుపత్రిలో మొత్తం ఉన్న పడకలు, ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ కింద ఎన్ని భర్తీ అయ్యాయి.. వంటి వివరాలు తెలియజేయాలని జేసీ కోరగా, ఆసుపత్రి యాజమాన్యం పొంతన లేని లెక్కలు చెప్పింది. ఈ సందర్భంగా జేసీతోనే ఆసుపత్రి యాజమాన్యం వాగ్వాదానికి దిగింది. దీనిపై ఎమ్మెల్యే నేరుగా కలెక్టర్‌ను కలిసి ఆసుపత్రి తీరుపై ఫిర్యాదు చేశారు. మరోవైపు జేసీ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మార్వో ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన అధికారులతో దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

అందినకాడికి దోపిడీ

వాస్తవానికి గత ఏడాది ఈ ఆసుపత్రి కొవిడ్‌ సేవలు బాగా అందించింది. నష్టాల కారణంగా రెండు నెలల క్రితం ఆసుపత్రి నిర్వహణలో కొంతభాగాన్ని హైదరాబాద్‌కు చెందిన వారికి అప్పగించారు. ఓపీ సేవలను మొత్తం హైదరాబాద్‌కు చెందినవారే చూసుకుంటున్నారు. తాజాగా కొవిడ్‌ విభాగాన్ని సైతం వారే నిర్వహిస్తున్నారు. దీంతో వైద్యసేవలు పూర్తిగా వాణిజ్యమయం అయిపోయాయి. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద సగం పడకలను కేటాయించాల్సి ఉన్నా అదీ జరగట్లేదు. అరకొర పడకలను మాత్రమే కేటాయిస్తున్నారు. వారి వద్ద కూడా అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక ఆసుపత్రి యాజమాన్యం కింద ఉన్న పడకల విషయంలో డిమాండ్‌ను బట్టి దోచుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రిలో చేరిన వారికి ఉచితంగా మందులు ఇవ్వాల్సి ఉన్నా బాధితులనే కొని తెచ్చుకోమని యాజమాన్యం చెబుతోంది. 

ఆసుపత్రిలో బౌన్సర్లు

 బాధితులు ఎవరైనా గొడవకు దిగితే వారిని హైదరాబాద్‌ నుంచి తెచ్చుకున్న బౌన్సర్లతో నిలువరించేలా ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి జేసీ ఆసుపత్రి పరిశీలనకు వెళ్లిన సమయంలోనూ ఈ బౌన్సర్లు ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. సీరియస్‌ అయిన జేసీ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎమ్మార్వోను ఆదేశించారు. 

ఐవీ ప్యాలెస్‌ నిర్వహణ కూడా వారికేనా..

నిమ్రా ఆసుపత్రి పనితీరుపైనే విమర్శలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు విజయవాడలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐవీ ప్యాలెస్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణ బాధ్యతలను కూడా నిమ్రా ఆసుపత్రి యాజమాన్యానికే అప్పగించడం గమనార్హం. 

సీఎం దృష్టికి తీసుకెళ్తా..

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

నిమ్రా కొవిడ్‌ ఆసుపత్రి అనుమతులు రద్దు చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ను కోరారు. కొవిడ్‌ బాధితుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ చనిపోయిన వారి వివరాలు కూడా బయటకు వెల్లడించడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ కింద చేరిన వారి నుంచీ డబ్బులు తీసుకుంటున్నారని, మందులు బయటే కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్రా ఆసుపత్రిని తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. నిమ్రా యాజమాన్య తీరును సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. 

ఆసుపత్రిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, అధికారులు


Advertisement