Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 5 2021 @ 15:47PM

నక్సల్స్ ఇలాకాలో రాత్రిపూట వ్యాక్సినేషన్..

నాగపూర్: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న మసాండీ గ్రామంలో జిల్లా పరిషత్ ఆరోగ్య బృందం వ్యాక్సినేషన్ సాగిస్తోంది. ఇందులో విశేషం లేకపోలేదు. నక్సల్స్ ప్రాబల్య ప్రాంతంగా ఈ గ్రామానికి పేరుంది. గిరిజన జనాభా అధికంగా ఉండే ఈ గ్రామం గడ్చిరోలిలోని ధరోనారాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరోగ్య బృందం సాయం వేళల్లో ఈ వ్యాక్సినేషన్ ఇస్తుండటంతో గిరిజనులు ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. జిల్లా కలెక్టర్ సంజయ్ మీనా, జడ్‌పీ సీఈఓ కుమార్ ఆశీర్వాద్ చొరవతో ఈ 'నైట్ వ్యాక్సినేషన్' డ్రైవ్‌‌కు వైద్య బృందం శ్రీకారం చుట్టింది.

మసాండి గ్రామానికి చెందిన 67 మంది గిరిజనులు వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 12 తాలూకాలు లక్ష్యంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సాగుతోంది. 124 రిమోట్ విలేజ్‌లకు చెందిన 12,764 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. జిల్లాలోని 100 గ్రామాల్లో జరిపిన సర్వే ప్రకారం వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకాడుతున్నట్టు చెబుతున్న 23 కారణాల్లో పంటల సీజన్ కావడంతో ప్రజలు ఉదయం నుంచి ఇళ్లకు దూరంగా ఉండటం ఒకటని కుమార్ ఆశీర్వాద్ తెలిపారు. దీంతో రిమోట్ ఏరియాల్లో 'నైట్ వ్యాక్సిన్' డ్రైవ్ చేపట్టామని ఆయన వివరించారు. ఇంటింటికి నేరుగా వ్యాక్సిన్‌ అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ డ్రైవ్‌ పలు తాలూకాల్లో విజయవంతమైనందని చెప్పారు. ఉదయం వేళ పనులకు ఆటంకం లేని విధంగా రాత్రివేళల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ చేపట్టడంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత శుక్రవారం వరకూ 75.78 శాతం మంది తొలి డోస్ తీసుకున్నారని, 39.52 శాతం మంది రెండో డోసు వేయించుకున్నారని చెప్పారు. గడ్జిరోలా జిల్లాలో నైట్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను డివిజనల్ కమిషనల్ పీఎల్ వర్మ సమీక్షిస్తున్నారు.

కాగా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కోర్చి, ధనోరా, భమ్రాగఢ్, ఇటాపల్లి తాలూకాల్లో వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు కొందరు వెనుకాడుతున్నారని ఆశిర్వాద్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో కొందరు కోవిడ్ పేషెంట్లు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించడంతో వారి బంధువులు, మిత్రులు గడ్చిరోలిలో భయాందోళనలు, అనుమానాలను వ్యాప్తి చేసినట్టు ఆయన చెప్పారు. అయితే, అన్ని భయాలను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement