నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత

ABN , First Publish Date - 2022-01-30T18:23:39+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ మూడో విడత ఇంకా ప్రభావం చూపుతున్నా ప్రభుత్వం అన్నింటినీ సడలించింది. దీంతో మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతటా సాధారణ పరిస్థితి రానుంది. కొవిడ్‌ మూడో విడతలో భాగంగా రోజూ 30-50 వేల

నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత

- రాష్ట్రంలో ఇక సాధారణ పరిస్థితి

- తెరుచుకోనున్న పాఠశాలలు 

- అధికారులతో సీఎం సమీక్ష


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ మూడో విడత ఇంకా ప్రభావం చూపుతున్నా ప్రభుత్వం అన్నింటినీ సడలించింది. దీంతో మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతటా సాధారణ పరిస్థితి రానుంది. కొవిడ్‌ మూడో విడతలో భాగంగా రోజూ 30-50 వేల దాకా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా తీవ్రమైన పరిస్థితి లేకపోవడం, ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య నాలుగైదుశాతానికే పరిమితం కావడంతో నిబంధనలు సడలించాలని తీర్మానించారు. శనివారం ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వివిధ శాఖలతో సమీక్షలు నిర్వహించారు. కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ, మంత్రుల కమిటీ, సీనియర్‌ అధికారులతో సమీక్షించారు. రెండు విడతల కొవిడ్‌ కాలంలో తీవ్రమైన పరిణామాలు కొనసాగిన విషయం తెలిసిందే. ఆసుపత్రులలో పడకలు లేకపోవడం, ఆక్సిజన్‌ అందక మృతులు, మందులు లభించక ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు శ్మశానాలలోనూ బారులుతీరి ఒకటి రెండు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోవడంతో వ్యాపార, వాణిజ్య రంగాలకు నష్టం కలగకుండా చూడాలని ప్రభుత్వం తీర్మానించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు సాధారణం కానున్నాయి. రాష్ట్రమంతటా అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూను పూర్తిగా రద్దు చేయదలిచారు. ఈనెల 31 సోమవారం దాకా అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూ ముగియనుంది. బెంగళూరులో సోమవారం నుంచి 1 నుంచి 9వ తరగతులకు ఆఫ్‌లైన్‌ క్లాసులు మొదలుకానున్నాయి. ఇప్పటికే మిగిలిన జిల్లాల్లో విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. పబ్‌లు, బార్‌, రెస్టారెంట్లు, హోటళ్లలో వందశాతం మందికి అవకాశం కల్పించారు. ప్రజా రవాణాలో వందశాతం సీట్లతో ప్రయాణించేందుకు వీలు కల్పించారు. ప్రభుత్వ కార్యాలయాలలో వందశాతం హాజరుకు తీర్మానించారు. ధార్మిక కేంద్రాలలో అన్ని సేవలు అమలులోకి రానున్నాయి. సినిమాహాళ్లు, మల్టిప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌ పూల్‌లు, జిమ్‌ సెంటర్‌, క్రీడా పోటీలలో 50 శాతం మందికి మాత్రమే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్ర సరిహద్దులో నిబంధనలు కొనసాగనున్నాయి. రాష్ట్రమంతటా మరో రెండు రోజుల్లో అన్నీ తెరుచుకోనున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా పరిశ్రమలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2022-01-30T18:23:39+05:30 IST