కార్యాలయంలో నిఘా కరువు

ABN , First Publish Date - 2021-07-26T06:53:28+05:30 IST

బడంగ్‌పేట మున్సిపల్‌ కార్యాలయంలో నిఘా లోపించింది.

కార్యాలయంలో నిఘా కరువు
బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ కార్యాలయం

సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెట్టని పాలకవర్గం

నెల క్రితం ట్రాక్టర్‌ చోరీకి గురైనా ఇంకా తెలియని ఆచూకీ

సరూర్‌నగర్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): బడంగ్‌పేట మున్సిపల్‌ కార్యాలయంలో నిఘా లోపించింది. 32 డివిజన్లతో సంబంధం ఉన్న ఈ కార్యాలయానికి నిత్యం అనేక మంది వివిధ పనుల నిమిత్తం వస్తూ పోతుంటారు. పలు సందర్భాల్లో కార్యాలయం ఎదుట ధర్నాలు, దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏదైన అనుకోని సంఘటనలు జరిగితే అందుకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. ఇందుకు నిదర్శనమే ఇటీవల కార్యాలయంలోని ట్రాక్టర్‌ మాయం కావడం. 

ఒకపక్క అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతీ కాలనీ, బస్తీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు పనిచేస్తున్న కార్యాలయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేరాలు, ఘోరాలు, దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన నిఘా నేత్రాల ఏర్పాటు పట్ల బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ అధికారులు, పాలకవర్గం, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో యితే ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన ఆధారాలు గుర్తించడం కష్టసాధ్యంగా మారింది.

కొత్త భవనం ఖుషీలో..

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌కు దావూద్‌ఖాన్‌గూడలో కొత్తగా పక్కా భవనం నిర్మిస్తున్నారు. దాని ఖుషీలో పడి ఇక్కడి అధికారులు, పాలకులు పాత భవనంలో సీసీ కెమెరాల ఏర్పాటును పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో కొత్త భవనానికి వెళ్తాం కదా.. పాత భవనంలో సీసీ కెమెరాలు ఎందుకు? అని వారు చర్చించుకున్నట్టు సమాచారం! అదే ఇప్పుడు వారి కొంప ముంచింది. సాక్షాత్తూ ప్రభుత్వ కార్పొరేషన్‌ కార్యాలయం నుంచే ఓ వాహనం చోరీకి గురి కావడం వారి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని స్థానికులు విమర్శిస్తున్నారు. మరి.. పాలకులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెడతారో లేదో వేచి చూడాల్సిందే!

ట్రాక్టర్‌ చోరీతో వెలుగులోకి...

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై నిర్లక్ష్యం వహించిన అధికారులకు, పాలకులకు ఇటీవల చోటు చేసుకున్న ట్రాక్టర్‌ చోరీ సంఘటన ఓ గుణపాఠం అని చెప్పక తప్పదు. గతేడాది సెప్టెంబరులో కార్పొరేషన్‌లోని పలు అవసరాల నిమిత్తం ట్రాక్టర్లు, గల్ఫర్‌ మెషీన్లు, ఎక్స్‌కవేటర్‌ తదితర వాహనాలు కొనుగోలు చేశారు. సీసీ కెమెరాలు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న దుండగులు నెల క్రితం కార్పొరేషన్‌ కార్యాలయం నుంచే ఓ ట్రాక్టర్‌ ఎత్తుకెళ్లారు. ట్రాక్టర్‌ చోరీకి గురై నెల అవుతున్నా అధికారులు మాత్రం గత శనివారమే మీర్‌పేట్‌ పీఎ్‌సలో ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నేటికీ ట్రాక్టర్‌ ఆచూకీ మాత్రం లభించలేదు. 

Updated Date - 2021-07-26T06:53:28+05:30 IST