కరుణాకర్‌ కేసులో నిందితులను అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన

ABN , First Publish Date - 2022-09-02T03:38:46+05:30 IST

కావలి ముసునూరుకు చెందిన దళితుడు కరుణాకర్‌ ఆత్మహత్య కేసులో నిందితులైన వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి,

కరుణాకర్‌ కేసులో   నిందితులను అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన
చేపల చెరువు వద్ద చేపలను పరిశీలిస్తున్న టీడీపీ రాష్ట్ర, జిల్లా నేతలు

-టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజు

కావలి, సెప్టెంబరు1: కావలి ముసునూరుకు చెందిన దళితుడు కరుణాకర్‌ ఆత్మహత్య కేసులో నిందితులైన వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, కొరిమెర్ల సురేష్‌రెడ్డిలను తక్షణం అరెస్ట్‌ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. ఎంఎస్‌రాజులోపాటు కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, కావలి ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడులు స్థానిక టీడీపీ నేతలతో కలిసి గురువారం ముసునూరులోని కురుణాకర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కరుణాకర్‌ లీజ్‌కు తీసుకున్న చేపల చెరువు వద్దకు వెళ్లి అక్కడ పడుతున్న చేపలను కూడా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరుణాకర్‌ కేసులో నిందితులను కాపాడేందుకు  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మన్నెమాల సుకుమార్‌రెడ్డిలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, వారిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చాలని  డిమాండ్‌ చేశారు. కరుణాకర్‌ మనో వేధనతో సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటివరకు పోలీస్‌ యంత్రాంగం నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. నిందితులను వదిలి కరుణాకర్‌కు అప్పులు ఇచ్చిన వారిని పోలీసులు బెదిరించటం సబబుకాదన్నారు. దళితుడైన కరుణాకర్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తరచూ కావలికి వస్తామని, ఎవరు అడ్డుకుంటారో, ఏమి పీకుతారో చూసుకుంటామని వారు సవాల్‌ విసిరారు. 


 భూకబ్జాలపై విచారణ చేపట్టాలి


కావలిలో వైసీపీ నాయకులు చేస్తున్న భూకబ్జాలపై అధికారులు విచారణ చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేఅనుచరులు చేస్తున్న గ్రావెల్‌, ఇసుక మాఫియాలో ఆయనకు కూడా వాటాలు ఇస్తున్నారని ఆరోపించారు. జగదీశ్వరరెడ్డి చేస్తున్న అక్రమాలలో ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నందున ఆయనను  కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు.


Updated Date - 2022-09-02T03:38:46+05:30 IST