Abn logo
Jan 16 2021 @ 12:18PM

రైతు సంఘం నేత బల్‌దేవ్‌కు ఎన్ఐఏ సమన్లు

న్యూఢిల్లీ : లోక్ భలాయీ ఇన్సాఫ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బల్‌దేవ్ సింగ్ సిర్సాకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సమన్లు జారీ చేసింది. నిషేధిత ఖలిస్థానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) నేతపై నమోదైన కేసులో సాక్షిగా హాజరు కావాలని కోరింది. ఈ నెల 17న ఎన్ఐఏ అధికారుల సమక్షంలో హాజరుకావాలని తెలిపింది. 


నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న రైతు సంఘాల్లో లోక్ భలాయీ ఇన్సాఫ్ వెల్ఫేర్ సొసైటీ కూడా ఉంది. ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తున్న ఆరోపణలపై నమోదైన కేసులో సాక్షిగా హాజరుకావాలని బల్‌దేవ్‌కు సమన్లు జారీ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలపై కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలోని అనేక ఎన్‌జీవోలకు ఈ ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలు నిధులను సమకూర్చుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఎన్‌జీవోల జాబితాను ఎన్ఐఏ తయారు చేసి, దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం కోసం ఎస్ఎఫ్‌జే వంటి సంస్థలు మన దేశంలోని ఎన్‌జీవోలకు నిధులు సమకూర్చుతున్నాయని ఎన్ఐఏ ఆరోపించింది. ఇటీవల నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థల సభ్యులు కెనడా, అమెరికా, బ్రిటన్ దేశాల్లోని భారతీయ ఎంబసీల వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. 


గత ఏడాది డిసెంబరు 12న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో సిక్స్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ వంటి సంస్థలపై దర్యాప్తు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement