పని పక్కకు.. వివాదాలు ముందుకు!

ABN , First Publish Date - 2022-07-05T05:49:10+05:30 IST

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారులను పర్యవేక్షించేందుకు నెల్లూరులో ఎన్‌హెచ్‌ఏఐ పీడీ కార్యాలయం ఉంది.

పని పక్కకు..   వివాదాలు ముందుకు!

‘ఎన్‌హెచ్‌ఏఐ’లో ఉద్యోగుల మధ్య కుదరని సఖ్యత

ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు

ఆదిపత్యం కోసం కొందరు ఉద్యోగుల ప్రయత్నాలు

రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి లేఖ


ఆ కార్యాలయం గడిచిన రెండేళ్లుగా ఉత్తమ పనితీరు కనబరుస్తోంది.. జిల్లాలో ఎన్నో కీలక ప్రాజెక్టులకు వేగంగా డీపీఆర్‌ తయారు చేసి అనుమతులు సాధించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌లెన్స్‌ అవార్డును కూడా సాధించింది. అయితే ఏమైందో ఏమోగానీ ఇప్పుడు వివాదాల సుడిలో చిక్కుకుంది. అదే భారత జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం. నెల్లూరులోని అయ్యప్పగుడి సమీపంలో ఉన్న ఈ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా కార్యాలయంలో తమకు రక్షణ కావాలని కోరుతూ కొందరు ఉద్యోగులు ఏకంగా ఎస్పీకి లేఖ రాయడం గమనార్హం. 


నెల్లూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారులను పర్యవేక్షించేందుకు నెల్లూరులో ఎన్‌హెచ్‌ఏఐ పీడీ కార్యాలయం ఉంది. ఇక్కడ పీడీతోపాటు ఇంజనీర్లు, పరిపాలనా సిబ్బంది, కార్యాలయ నిర్వహణ సిబ్బంది ఉన్నారు. జిల్లాలోని జాతీయ రహదారుల నిర్వహణను పర్యవేక్షించడంతోపాటు కొత్త రహదారులకు ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంటారు.   నెల్లూరు - సింగరాయకొండ హైవే స్ట్రెచ్‌ నిర్వహణ బాగా చేసినందుకుగానూ సదరు కాంట్రాక్టర్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎక్స్‌లెన్స్‌ అవార్డును కూడా ఇచ్చింది. ఇలా ఎన్‌హెచ్‌ఏఐ పీడీ కార్యాలయంలో పనులు వేగంగా జరుగుతుండేవి. కానీ గడిచిన కొన్ని రోజులుగా అక్కడ వివాదాలు నెలకొన్నాయి. కొందరు ఉద్యోగులు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుండటంతో మిగిలిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఓ ఉన్నతాధికారి జోక్యం చేసుకోగా వారిపై ఓ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదుపై విచారించిన పోలీసులు అందులో వాస్తవం లేదని తేల్చినట్లు సమాచారం. ఇలా ఉన్నతాధికారులకు కూడా ఊహించని పరిణామం ఎదురవడంతో ఉద్యోగులంతా విజయవాడలోని రీజనల్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఓ ఉద్యోగి మితిమీరిన జోక్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రశాంతంగా పనిచేసుకోలేకపోతున్నామని ఉద్యోగులు మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణకు ఉన్నతాధికారులు ఓ కమిటీని కూడా వేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో తమపై కూడా తప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు ఉద్యోగులు ఎస్పీ విజయరావుకు లేఖ రాసినట్లు తెలిసింది. ఇలా అభద్రతా భావం పీడీ కార్యాలయంలోని ఉద్యోగుల్లో నెలకొనడంతో ఆ ప్రభావం విధులపై పడుతోంది. కీలకమైన ప్రాజెక్టులు పురోగతి సాధిస్తున్న సమయంలో కార్యాలయంలో ఇటువంటి వాతావరణం నెలకొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


వివాదాలు సద్దుకుంటున్నాయి 

మా కార్యాలయంలో ఉద్యోగుల మధ్య వివాదాలు వచ్చిన మాట వాస్తవమే. తమకు రక్షణ కావాలంటూ కొందరు ఉద్యోగులు పోలీసులను కోరారు. అయితే ఆ వివాదాలన్నీ సర్దుకుంటున్నాయి. ప్రజలకు మేలు జరిగేలా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయడమే మా లక్ష్యం. 

- గోవర్థన్‌, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ



Updated Date - 2022-07-05T05:49:10+05:30 IST