ఉద్యోగుల బిల్లులకు మోక్షమెప్పుడు!

ABN , First Publish Date - 2022-08-11T07:45:33+05:30 IST

ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులను ఏప్రిల్‌ 30 లోగా చెల్లిస్తామని రాష్ట్ర జేఏసీతో రాతపూర్వక ఒప్పందం జరిగినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని ఏపీఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు.

ఉద్యోగుల బిల్లులకు మోక్షమెప్పుడు!

- ఏపీ ఎన్జీవో నేత విద్యాసాగర్‌

అజిత్‌సింగ్‌నగర్‌, ఆగస్టు 10 : ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులను ఏప్రిల్‌ 30 లోగా చెల్లిస్తామని రాష్ట్ర జేఏసీతో రాతపూర్వక ఒప్పందం జరిగినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని ఏపీఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సుమారు రూ. 3 వేల కోట్లకు పైగా జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు.  గాంధీనగర్‌లోని ఎన్జీవో హోంలో బుధవారం ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ పశ్చిమ కృష్ణాజిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో విద్యాసాగర్‌ మాట్లాడుతూ, ఉద్యోగులు జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐలలో దాచుకున్న డబ్బులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండి చెల్లింపులు జరగనందున తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జూలై 31వ తేదీ నాటికి బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించినప్పటికి అమలు జరగడం లేదన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కరువు భత్యం(డీఏ) బకాయిలు ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయపోవడం వలన సుమారు రూ. 6 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలలో ఉన్న నగదును ప్రభుత్వం విత్‌డ్రా చేసినప్పటికి దానికి ఉద్యోగులు ట్యాక్స్‌ చెల్లించాలని, రాని డబ్బుకు ట్యాక్స్‌ వసూల్‌ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. జీపీఎఫ్‌ ఖాతాల్లో విత్‌డ్రా చేసిన సోమ్మును వెంటనే తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండీఇక్బాల్‌, నగరశాఖ అధ్యక్షుడు జె.స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్‌, సతీ్‌షకుమార్‌, రాజుబాబు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-11T07:45:33+05:30 IST