భారత్‌ దూకుడుకు చైనా రియాక్షన్ ఎలా ఉండబోతోంది!?

ABN , First Publish Date - 2020-09-12T01:19:34+05:30 IST

సమస్యలన్నింటికీ యుద్ధమే పరిష్కారమని చైనా భావిస్తోందా..? డ్రాగన్ కోరిక అదే అయితే ఇండియా కూడా సిద్ధమయిందా..?

భారత్‌ దూకుడుకు చైనా రియాక్షన్ ఎలా ఉండబోతోంది!?

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి : సమస్యలన్నింటికీ యుద్ధమే పరిష్కారమని చైనా భావిస్తోందా..? డ్రాగన్ కోరిక అదే అయితే ఇండియా కూడా సిద్ధమయిందా..? సరిహద్దుల్లో ఉద్రిక్తతలు యుద్ధంతోనే అంతమవుతాయా..? భారత్ దూకుడుకు చైనా రియాక్షన్ ఎలా ఉంటోంది..?. మాస్కోలో ఒప్పందానికి ఓకే అన్నారు. ఐదుసూత్రాలకు అంగీకారం తెలిపారు. పరస్పరం శాంతి మంత్రాలు జపించారు. మరి.. సరిహద్దుల్లో పరిస్థితి ఏంటి? చైనా తన సహజ స్వభావాన్ని చూపిస్తుందా? నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తుందా ? కవ్వింపు చర్యలకు పాల్పడుతుందా ?. వార్‌ బెల్స్‌.. ఏబీఎన్‌ స్పెషల్‌ ఫోకస్‌..


దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా..!

భారత్‌-చైనా సరిహద్దుల్లో కొద్దిరోజులుగా యుద్ధమేఘాలు అలుముకున్నాయి. గత జూన్‌ నుంచి చైనా కుటిల బుద్ధితో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతూ ఉంది. తరచూ ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. ఎల్‌ఏసీ వద్ద గీత దాటుతూ గిల్లికజ్జాలకు ప్రయత్నిస్తోంది. భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తోంది. సమయం దొరికితే గాలిలోకి కాల్పులు జరుపుతూ భారతసైన్యం సహనాన్ని పరీక్షిస్తోంది. ఓవైపు ఇలా.. సైనికులు సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతుంటే మరోవైపు చైనా  సైనికాధికారులు శాంతి చర్చలంటూ దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా వ్యవహరిస్తున్నారు. చర్చల్లో ప్రతిసారీ శాంతి అంటూ సరిహద్దుల్లో మాత్రం సై అనే విధంగా చైనా తీరు ఉంటోంది.


ఉద్రిక్తతల గురించి చర్చలు

మొన్నటికి మొన్న భారత్‌, చైనా రక్షణశాఖా మంత్రులు ఉన్నతస్థాయి భేటీలో సరిహద్దు ఉద్రిక్తతల గురించి చర్చించారు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భారత సైనికులు బాధ్యతాయుత వైఖరితో ఉంటారని భారత్‌ రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణశాఖ మంత్రి వెంగ్ ఫెంఘేతో చెప్పారు. వాస్తవాధీన రేఖకు దగ్గరలో చైనా భారీగా సైనికులను మోహరించడం, దూకుడుగా వ్యవహరించడం వంటివి.. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించినట్లే అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆ భేటీలో స్పష్టం చేశారు.


భేటీ తర్వాత కూడా మారని బుద్ధి..

అయితే చైనా మాత్రం తనదైన శైలిలో భారత్‌ వైపునుంచే స్పందన రావాలన్న మాదిరిగా మాట్లాడింది. సరిహద్దు ఉద్రిక్తతలకు పూర్తిబాధ్యత భారత్‌ అనే విధంగా దుందుడుకుగా వ్యాఖ్యానించింది. ఓవైపు.. సంప్రదింపులు, చర్చలతో సమస్యను పరిష్కరించుకునేలా, శాంతినెలకొనేలా చూద్దామని చెబుతూనే, మరోవైపు చైనా అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంటోంది. ఆ భేటీ తర్వాత కూడా కుటిల చైనా తన సహజ బుద్ధిని వీడలేదు. ఇరుదేశాల రక్షణ శాఖా మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం తర్వాత కూడా చెప్పేదొకటి, చేసేదొకటి మాదిరిగా వ్యవహరించింది.


చైనా అలా.. భారత్ ఇలా..!

అంతకు ముందు భారత్‌, చైనా విదేశాంగ మంత్రులు టెలిఫోన్‌ చర్చలు కూడా జరిపారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనే విధంగా ఏమేం చర్యలు చేపట్టాలో కూడా పరస్పరం మాట్లాడుకున్నారు. కానీ, చైనా మాటలకు, చేతలకు పొంతన లేదన్నది కొద్దిరోజులుగా సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. అయితే, భారత్‌ మాత్రం.. ఓవైపు యుద్ధానికి సిద్ధమవుతూనే, చైనా దుందుడుకు చర్యలను తిప్పికొడుతూనే..  మరోవైపు, శాంతి యుతంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే మాస్కోలో తాజాగా భారత, చైనా విదేశాంగశాఖా మంత్రులు భేటీ అయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా.. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ చర్చల సందర్భంగా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాల మంత్రులు నిర్ణయించారు. పంచసూత్రాల ఒప్పందం కూడా చేసుకున్నారు.  - సప్తగిరి గోపగాని (ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి).

Updated Date - 2020-09-12T01:19:34+05:30 IST