శెభాష్‌ విఠలాచార్య..!

ABN , First Publish Date - 2021-12-27T08:49:51+05:30 IST

శెభాష్‌ విఠలాచార్య..!

శెభాష్‌ విఠలాచార్య..!

తెలంగాణ మాజీ అధ్యాపకుడికి మోదీ అభినందన


న్యూఢిల్లీ/యాదాద్రి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య(84)ను ప్రధాని మోదీ అభినందించారు. తన గ్రామంలో గ్రంథాలయాన్ని నెలకొల్పాలన్న ఆయన సంకల్ప బలాన్ని కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన విఠలాచార్య ‘గ్రంథాలయం’ స్థాపించాలన్న తన లక్ష్యాన్ని ఏ విధంగా కార్యరూపంలో పెట్టారో ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. ‘‘మన దేశం చాలా అసాధారణమైన ప్రతిభలకు నిలయం. ప్రతిభామూర్తుల సృజనాత్మకత ఇతరులకూ స్ఫూర్తినిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య ఒకరు. ఆయన వయసు 84 ఏళ్లు. మీ కలలను సాకారం చేయడానికి వయసుతో సంబంధం లేదనేందుకు విఠలాచార్యే నిలువెత్తు ఉదాహరణ. పెద్ద గ్రంథాలయాన్ని నెలకొల్పాలనే కోరిక విఠలాచార్యకు చిన్నప్పటి నుంచే ఉండేది. మన దేశానికి అప్పటికింకా స్వాతంత్య్రం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. కాలక్రమంలో విఠలాచార్య అధ్యాపకుడయ్యారు. తెలుగు భాషను లోతుగా అధ్యయనం చేశారు. రచనలు చేశారు. ఆరేడేళ్ల కిందట ఆయన తన కలను నెరవేర్చుకోవడం ప్రారంభించారు. తన సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తన జీవిత కాల సంపాదనను గ్రంథాలయానికే ఖర్చు చేశారు. క్రమంగా ప్రజలు సహకరించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో 2 లక్షల పుస్తకాలున్నాయి. నేడు అఽధిక సంఖ్యలో విద్యార్థులు ఆ గ్రంథాలయం ద్వారా లబ్ధి పొందడాన్ని చూసి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన స్ఫూర్తితో ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను నెలకొల్పే పనిలో నిమగ్నమై ఉన్నారు’’ అని మోదీ అన్నారు. 


నిత్య సాహిత్య కృషీవలుడు విఠలాచార్య

భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల విఠలాచార్య నిత్య సాహిత్య కృషీవలుడు. అమ్మమ్మగారి ఊరైన రామన్నపేట మండలం నీర్నెంల గ్రామం లో విద్యాభ్యాసం చేశారు. 1955 లోనే ఎల్లంకిలో గ్రంథాలయాన్ని నడపలేకపోయారు. లెక్చరర్‌గా రిటైర్మెంట్‌ తర్వాత ‘ఆచార్య కూరెళ్ల ట్రస్టు’ ను ఏర్పాటు చేసి వేలాది పుస్తకాలు సేకరించారు. 4 వేల గ్రం థాలతో 2014, ఫిబ్రవరి13న అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్‌ చిరంజీవులుతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. స్వగృహాన్ని గ్రంథాలయంగా మార్చి గ్రామానికి అంకితం చేశారు.

Updated Date - 2021-12-27T08:49:51+05:30 IST