సెప్టెంబరు 5నే బడిగంట

ABN , First Publish Date - 2020-08-06T10:52:07+05:30 IST

సెప్టెంబరు 5నే బడిగంట

సెప్టెంబరు 5నే బడిగంట

సాలూరు రూరల్‌, ఆగస్టు 5: పాఠశాలల పునః ప్రారంభంపై ఉత్కంఠకు తెరపడింది. పాఠశాలలను సెప్టెంబరు 5న తెరవాలని సీఎం జగన్‌మెహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా మహమ్మరితో ఈ ఏడాది మార్చి 19 నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల వరకూ అన్ని రద్దు చేశారు. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేశారు. ఈ నెల మూడున పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం తొలుత భావించింది. దేశంలో కరోనా పరిస్థితులు ప్రత్యేకించి ఏపీలో వ్యాధి తీవ్రతరం కావడం తదితర అంశాల  నేపథ్యంలో పాఠశాలలను తెరవడానికి కేంద్రప్రభుత్వం విముఖత చూపింది. పాఠశాలల తెరవడంపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్‌ 3.0లో పాఠశాలలను ఈ నెల 31 వరకు తెరవరాదని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పాఠశాలలను వచ్చే నెల ఐదున ప్రారంభించడానికి నిర్ణయించారు. గత నెల 27నుంచి పాఠశాలల్లో ప్రవే శాలు కల్పిస్తున్నారు. బడులు తెరిచేలోగా విద్యార్థుల ప్రవేశ కార్యక్రమం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యామ్నాయ విద్యాక్యాలండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి వారం ఒక ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరవుతున్నారు. బయోమెట్రిక్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. తల్లిదండ్రుల అఫిడవిట్‌తో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో, వివిధ యాజమాన్యాల పరిధిలో 2,839    పాఠశాలలు ఉన్నాయి.  అన్ని యాజమాన్యాల పరిధిలో 14,801 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వచ్చే నెల ఐదు వరకు ప్రవేశాల కార్యక్రమం, దూరదర్శన్‌, ఆన్‌లైన్‌లో పాఠాల పర్యవేక్షణను ఉపాధ్యాయులు చేయనున్నారు. పాఠశాల ప్రారంభం నాటికి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్‌లను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 1,035 పాఠశాలల్లో నాడు-నేడు పనులను సైతం ఈ నెల 31 నాటికి పూర్తి చేయించడానికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇవన్నీ పూర్తయ్యాక సెప్టెంబరు 5న పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2020-08-06T10:52:07+05:30 IST