Abn logo
Jun 30 2021 @ 01:20AM

కొత్త ఉద్దీపన

కరోనా రెండోదశ కాస్తంత ఉపశమించి, మూడోదశ భయాలు ముప్పిరిగొంటున్న తరుణంలో కేంద్రప్రభుత్వం కొత్త ఉద్దీపన మూటతో ముందుకొచ్చింది. ఈ మారు ఉద్దీపన కనీసం మూడునాలుగులక్షల కోట్లయినా ఉండాలని మార్కెట్‌ నిపుణులు అంటున్న నేపథ్యంలో, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజీ నిజానికి వారు ఊహించినకంటే ఎక్కువే. గతంలో కంటే ఈ కొత్త ప్యాకేజీ మీద విమర్శలు తక్కువగానే వినిపిస్తున్నాయి. దాని క్షేత్రస్థాయి ప్రభావం మీద నమ్మకం కావచ్చు, లేదా మొత్తంగా ఉద్దీపనలే మీదే నిర్లిప్తత కావచ్చు.


ఉత్పత్తిని, ఎగుమతులనూ, ఉపాధి అవకాశాలనూ పెంచేట్టుగా, ఆరోగ్య, సామాజిక, ఆర్థికరంగాలకు ఊతం ఇచ్చేట్టుగా, ఈ ఆరులక్షల ముప్పైవేల కోట్ల ప్యాకేజీ పదిహేను విభాగాలకు ఉద్దీపనం కలిగిస్తుందని కేంద్రం చెబుతోంది. బడ్జెట్‌ నుంచి నికరంగా ఖర్చుపెట్టేదెంతో, కొత్త కేటాయింపులు ఎంతో స్పష్టత లేకపోయినప్పటికీ, ప్రధానంగా ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నమైతే ఈ ప్యాకేజీలో కనిపిస్తున్నది. కొవిడ్‌ మూడవ దశ పిల్లలపై విస్తృత ప్రభావం చూపగలదన్న భయాందోళనల మధ్య దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో పిల్లలకు ప్రత్యేకించిన వైద్యసేవల బలోపేతానికి దాదాపు పాతికవేలకోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడింది. నిధులు సిద్ధం, రాష్ట్రాలు ఎంత వేగంగా వాడుకోగలవో చూస్తానని కూడా అంటున్నది. రేప్పొద్దున్న ఏమైనా జరగరానిది జరిగితే పాపాన్ని రాష్ట్రాల మీదకు నెట్టేయడానికి తప్ప, ముప్పు వేగంగా ముంచుకొస్తున్న తరుణంలో ఈ చివరిక్షణం కేటాయింపులూ పరీక్షల వల్ల ఏ అదనపు ప్రయోజనమూ నెరవేరదు. ప్యాకేజీలో చేర్చి చూపేవరకూ ఇలా ఆగేబదులు ముందుగానే అదేదో ఇచ్చివుంటే బాగుండేదేమో. మెట్రోపాలిటిన్‌ నగరాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఆరోగ్యరంగం బలోపేతానికి ఉద్దేశించిన యాభైవేలకోట్ల వితరణ వడ్డీతో ముడిపడినదే అయినా, వైద్యసదుపాయాలు ఇంతవరకూ విస్తరించని ప్రాంతాలకు కొంత మేలు చేకూరుతుంది. ప్యాకేజీలో కొత్త పథకాలూ లేకపోలేదు కానీ, ఎరువుల రాయితీ పెంపు, పేదలకు ఉచిత తిండిగింజల సరఫరా ఇత్యాదివి పాతపథకాల పొడిగింపులే. కరోనా ప్రభావిత వైద్యేతర రంగాలకు మరి కాస్తంత ఎక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తాలు దక్కబోతున్నాయి. విద్యుత్‌రంగంలో తాను కోరుకున్న సంస్కరణలను వేగంగా ముందుకు తీసుకుపోవడానికి కరోనాను కేంద్రం మాబాగా వాడుకుంటున్నది. పీపీపీ ప్రాజెక్టుల విషయంలోనూ, ఆస్తుల అమ్మకాల్లోనూ మరింత సరళమైన విధానాలు అమలుచేయాలని కూడా కేంద్రం సంకల్పం చెప్పుకుంది. అత్యవసర రుణ సదుపాయ హామీ పథకం కింద మరో లక్షన్నర కోట్లు సిద్ధం చేసినందున నిధుల కొరతతో తీసుకుంటున్న లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు కాస్తంత ఉపశమనం దక్కుతుంది.


ఈ ప్యాకేజీని ఉద్దీపన అనేకంటే ఉపశమనం అనడం సబబుగా ఉంటుందని కొందరి వాదన. ఈ పదిహేనునెలల మహమ్మారి కాలంలో కేంద్రం నాలుగైదు ప్యాకేజీలు ప్రకటించింది. ఈ తరహా ప్యాకేజీలు రుణగ్రహీతలను దివాలాలూ మూసివేతలనుంచి రక్షించేందుకు ఉపకరిస్తాయేమో కానీ, కరోనాకాటుపడ్డ ఆర్థికరంగాన్ని ఉత్తేజితం చేసి ఉరుకులు పెట్టించేందుకు మాత్రం పనికిరావడం లేదని నిపుణుల వాదన. ఆరులక్షలకోట్లలో దాదాపు సగం మొత్తం రుణగ్యారంటీలు, బ్యాంకులు రిస్కుతో కూడిన మరిన్ని రుణాలమంజూరుకు ఉద్దేశించినదే. గ్రామీణ బ్రాడ్‌బ్యాండు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థలకు ఎగుమతితో ముడిపడిన ప్రోత్సాహకాలు అందివ్వడం వంటివి దీర్ఘకాలికమైనవే తప్ప, తక్షణ ప్రభావం చూపగలిగే చర్యలు కావు. ప్రత్యక్షంగా భారీ నగదు గుప్పించని కారణంగా నిర్మల ప్యాకేజీ డిమాండ్‌ పెంచి ఆర్థికరంగానికి కొత్త ఉత్తేజాన్ని ఏమాత్రం అందివ్వలేదనీ, కరోనా దెబ్బకు ఒరిగిన వ్యవస్థను సరిదిద్దేందుకు మాత్రం కాస్త ఉపకరించవచ్చునని నిపుణుల వాదన. వినియోగదారుడి జేబులోకి నగదు నేరుగా చేరేట్టు, కాస్త మిగిలేట్టు చేయడం మీద ప్రభుత్వానికి ఇప్పటికీ దృష్టిరాకపోవడం విచిత్రం.