కొత్త సారథులు

ABN , First Publish Date - 2022-01-27T05:25:04+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ బుధవారం జిల్లాలకు సారథులను ప్రకటించారు.

కొత్త సారథులు

జిల్లాలకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుల నియామకం

సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి 

మెదక్‌కు పద్మాదేవేందర్‌రెడ్డి,  సంగారెడ్డికి చింతా ప్రభాకర్‌ నియామకం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట/మెదక్‌/సంగారెడ్డి, జనవరి 26 : టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ బుధవారం జిల్లాలకు సారథులను ప్రకటించారు. జిల్లాలు ఆవిర్భవించి ఐదేళ్లు దాటిన అనంతరం అధ్యక్షులు వచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరును ఖరారు చేయగా, మెదక్‌ జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను నియమించారు. అధ్యక్షుల నియామకంపై అధిష్ఠానం రెండు నెలలుగా పార్టీ నాయకుల్లో ఆశలు రేకెత్తించింది. ఆశావహుల నుంచి అభ్యర్థనలు స్వీకరించి, ఇంటెలిజెన్స్‌ నివేదికను సైతం తెప్పించుకున్నది. చివరకు జిల్లా అధ్యక్ష పదవులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితర ముఖ్యులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 


ఇక ముగ్గురు బాస్‌లు

ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లాకు మంత్రి హరీశ్‌రావు పార్టీకి అన్నీ తానై వ్యవహరించగా ఇక ముగ్గురు కొత్త బాస్‌ల సారథ్యంలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా తొలి అధ్యక్షుడిగా మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలను అప్పగించారు. జిల్లా అంతటా పరిచయాలు, కార్యకర్తలతో సంబంధాలను పరిగణనలోకి తీసుకొని ప్రభాకర్‌రెడ్డినే ఫైనల్‌ చేసినట్లుగా అర్థమవుతోంది. అంతేగాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సొంత జిల్లా కావడంతో.. ఎలాంటి విమర్శలు రాకుండా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తారనే విశ్వాసాన్ని ఎంపీపై ఉంచారు. అందుకే ఆచితూచి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2011లో టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని 2014లో మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో బరిలోకి దించగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019 పార్లమెంట్‌ సాధారణ ఎన్నికల్లోనూ మరోసారి ఎంపీగా భారీ మెజార్టీతోనే గెలుపొందారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న లోకసభ స్థానం పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాలు సిద్దిపేట జిల్లాలోనే ఉన్నాయి. దుబ్బాక మండలం పోతారం ఆయన స్వగ్రామం. అంతేకాకుండా ఆయన లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష ఉపనేతగానూ కొనసాగుతున్నారు. 

 మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డిని సీఎం కేసీఆర్‌ నియమించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పని చేస్తున్న ఆమె గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలుగానూ, కన్వీనర్‌గానూ వ్యవహరించారు. మూడోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తానని తెలిపారు. పార్టీ  జిల్లా బాధ్యతలను అప్పగించిన సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. 

సంగారెడ్డి జిల్లా పార్టీ అద్యక్ష పదవిని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు దక్కింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో సంగారెడ్డి నుంచి సిట్టింగ్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా నియోజకవర్గంలో పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గతంలో ఒకసారి ఆయనకు చేనేత కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తామని, మరోసారి ఎమ్మెల్సీగా నియమిస్తామని చెప్పిన అధినేత అకస్మాత్తుగా జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని తనకు ఇవ్వడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. అంకితభావంతో పని చేసి, పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. 


టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు

అధ్యక్షుల నియమాకంతో ఆయా జిల్లాల్లోని టీఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులు సంబురాలు నిర్వహించారు.  సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను నియమించడంతో సదాశివపేటలోని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ నివాసం వద్ద, గాంధీ చౌక్‌, బస్టాండ్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్దఎత్తన బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచి పెట్టి సంబురాలు నిర్వహించారు. నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని నియమించడంతో మెదక్‌లోని రాందాస్‌ చౌరస్తాలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్‌ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చిన్నశంకరంపేట, నిజాంపేట, పాపన్నపేట మండల కేంద్రాల్లో టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచారు. శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-01-27T05:25:04+05:30 IST