సిమ్‌కార్డుతో మాయచేసి లక్షలు కాజేశారు..!

ABN , First Publish Date - 2021-06-20T16:06:39+05:30 IST

గత గురువారం మధ్యాహ్నం తర్వాత తన ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డు బ్లాక్‌ అయినట్లు సూచించింది....

సిమ్‌కార్డుతో మాయచేసి లక్షలు కాజేశారు..!

హైదరాబాద్ సిటీ : సిమ్‌ కార్డు కొత్తది తీస్కుని విజయా ఎలక్ర్టికల్స్‌ మేనేజర్‌కు చెందిన క్రెడిట్‌ కార్డ్సు నుంచి లక్షలు కాజేశారు సైబర్‌ కేటుగాళ్లు. కుకట్‌పల్లి నిజాంపేట్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టికల్‌ తులసిబాబు సోమాజిగూడలోని విజయా ఎలక్ర్టికల్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గత గురువారం మధ్యాహ్నం తర్వాత తన ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డు బ్లాక్‌ అయినట్లు సూచించింది. దీంతో అతను శుక్రవారం టెలీకామ్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి కొత్త సిమ్‌ తీసుకున్నాడు. అదే రోజు సాయంత్రం బ్యాంకు నుంచిఅతనికి ఫోన్‌ వచ్చింది. మీ క్రెడిట్‌ కార్డులో ఉన్న రూ.లక్షన్నర బ్యాలన్స్‌ డెబిట్‌ అయ్యింది అని.


దీంతో ఆందోళనకు గురైన తులసిబాబు తన ఇతర రెండు బ్యాంకుల క్రెడిట్‌ కార్డుల బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోగా మొత్తం మూడు కార్డుల నుంచి రూ.5.60లక్షలు డెబిట్‌ అయినట్లు స్పష్టమైంది. దీంతో అతను సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. టెలీకామ్‌ సంస్థను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు తులసిబాబు నెంబర్‌పై కొత్త సిమ్‌ తీసుకున్నారని, దీంతో తులసిబాబు ఫోన్‌లో ఉన్న పాత సిమ్‌ ఆటోమేటిక్‌గా బ్లాక్‌ అయ్యిందని, కొత్త సిమ్‌ తీసుకున్న కేటుగాళ్లు ఓటీపీల ద్వారా డబ్బులు కాజేసినట్లు భావిస్తున్నామని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. టెలీకామ్‌ సంస్థ కష్టమర్‌కు కాకుండా ఇతరులకు ఎలా కొత్త సిమ్‌ ఇచ్చారో.. క్రెడిట్‌ కార్డులు, సీవీవీల నెంబర్లు కేటుగాళ్లు ఎలా తెలుసుకున్నారో అనే అంశాలపై పూర్తి దర్యాప్తు చేసి తేలుస్తామని ఆయన చెప్పారు.

Updated Date - 2021-06-20T16:06:39+05:30 IST