కరోనా వచ్చింది.. పోయింది.. అయినా కబళిస్తోంది..!

ABN , First Publish Date - 2020-10-19T19:53:50+05:30 IST

అతనో ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకుడు. కరోనా రావటం, తగ్గిపోవటం, ఆ వెంటనే రాజకీయాలపై దృష్టి పెట్టడం జరిగిపోయింది. అంతలోనే బ్రెయిన్‌ స్ర్టోక్‌తో ఆయన ప్రాణాలు విడిచారు.

కరోనా వచ్చింది.. పోయింది.. అయినా కబళిస్తోంది..!

పెరిగిపోతున్న కొవిడ్‌ అనంతర మరణాలు 

వైరస్‌ బారిన పడి కోలుకున్న వారికి ఇతర అనారోగ్యాలు 

కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్న కొందరు

వారిలో గుండెపోట్లు, శ్వాస సంబంధ సమస్యలే అధికం

అవగాహన లోపమే ప్రధాన కారణం.. నిర్లక్ష్యంగా ఉంటే ముప్పే

మూడు మాసాలు తస్మాత్‌ జాగ్రత్త అంటున్న వైద్యులు


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు):


అతనో ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకుడు. కరోనా రావటం, తగ్గిపోవటం, ఆ వెంటనే రాజకీయాలపై దృష్టి పెట్టడం జరిగిపోయింది. అంతలోనే బ్రెయిన్‌ స్ర్టోక్‌తో ఆయన ప్రాణాలు విడిచారు. 


ఒక బంగారం వ్యాపారికి కొవిడ్‌ ఉన్నట్లు బయటపడిన వెంటనే పిల్లలు హైదరాబాద్‌లో చికిత్స చేయించారు. తగ్గి ఇంటి కొచ్చిన పది రోజులకే ఆయన గుండెపోటుతో మృత్యువాత పడ్డారు.


న్యాయవాది ఒకరు వైరస్‌ సోకి వైద్యం చేయించుకున్నారు. నెగెటివ్‌ ఫలితం అనంతరం తర్వాత ఆయన ఇంటికి వచ్చారు. కొద్ది రోజులకే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో మృతి చెందారు.


 ఓ విశ్రాంత ఉద్యోగి కరోనా తగ్గిందంటూ కాస్తంత బయటకు రావటం ప్రారంభించారు. అంతలోనే రక్త విరేచనాలు అయ్యాయి. రెండు రోజులకే మరణించారు. ఇక కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చిందంటూ ఇంటికి చేరిన తర్వాత పక్షం  నుంచి రెండు నెలల లోపు గుండెపోటుతో మృతి చెందుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. 


ప్రకాశం జిల్లాలో కొవిడ్‌ మరణాలు, కేసుల సంఖ్య తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలను కొవిడ్‌ అనంతర మరణాలు, అనారోగ్య సమస్యలు  హైరానాకు గురి చేస్తున్నాయి.


ప్రకాశం జిల్లాలో ఇటీవల కొవిడ్‌ ప్రభావం తగ్గినట్లు కనిపిస్తోంది. మరణాల రేటు కూడా పడిపోయింది. రోజువారీ ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. వాస్తవ పరిస్థితులను గమనిస్తే కొవిడ్‌ అనంతర అనారోగ్య సమస్యలతో బాధితులు తల్లడిల్లిపోతున్నారు. అలాంటివారిలో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఆంధ్రజ్యోతి బృందం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఓ పరిశీలనలో ఈ విషయం తేటతెల్లమైంది. ఈ పరిస్థితి ప్రస్తుతం వైద్యులకు కూడా సవాల్‌గా మారింది. నిజానికి కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారికి మరో మూడు మాసాలు వైరస్‌ రాదన్న సమాచారం ప్రచారంలో ఉంది. కానీ ఇటీవల  కొవిడ్‌ బారిన పడిన చికిత్స అనంతరం నెగెటివ్‌ ఫలితం వచ్చిన కొద్ది రోజులకే తిరిగి పాజిటివ్‌ వస్తోంది. ఇలాంటి వారి సంఖ్య అతి తక్కువగానే ఉంటున్నప్పటికీ అలా రావటానికి పరీక్షల లోపమా? ఇతరత్రా కారణాలా? అన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ అలాంటి బాధితులు జిల్లావ్యాప్తంగా అనేకమంది ఉన్నట్లు ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడైంది.


ప్రకాశం జిల్లా అంతా కనిపిస్తున్న పరిస్థితి 

కరోనా అనంతరం వస్తున్న వ్యాధులతో మృతి చెందిన వారు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా వారిని వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే కొన్ని ఊహించని ఆరోగ్య సమస్యలకు కూడా వారు గురవుతున్నారు. ఒంగోలులో ఓ విశ్రాంత ఉద్యోగి కరోనా చికిత్స పొంది, నెగెటివ్‌ వచ్చిన కొద్ది రోజులకు రక్త విరేచనాల సమస్యకు గురై మృత్యువాతపడ్డారు. పర్చూరులో ఓ న్యాయవాది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి గురై మృతి చెందారు. అద్దంకి నియోజకవర్గం రామకూరులో ఓ బాధితుడు కరోనా అనంతరం కిడ్నీ సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. ఇక హృద్రోగ సమస్యలతో మృతిచెందుతున్న వారైతే గణనీయంగా ఉన్నారు. 70 సంవత్సరాలు, ఆపైబడిన వయసులో వారు అలా ఎక్కువగా మరణిస్తున్నారు.  50 సంవత్సరాల వయసులో వారు కూడా అక్కడక్కడా కరోనా నుంచి కోలుకున్న తర్వాత గుండెపోటుతో మృతి చెందుతున్న దాఖలాలున్నాయి. 

 

ఆ వైపు దృష్టి సారించిన వైద్యులు 

కరోనా అనంతర పరిస్థితిని గురించి వైద్యప్రముఖులను సంప్రదించగా ప్రస్తుతం తాము కూడా ఆ పరిస్థితి నివారణ కు వైద్యపరంగా ఏమి చేయాలన్న విషయంపైనే దృష్టిసారించినట్లు చెప్తున్నారు. నిజానికి కరోనా బాధితులు కోలుకున్న తర్వాత వస్తున్న ఆరోగ్యసమస్యలకు వెంటనే చికిత్స అందితే ప్రాణ హాని ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే కొందరి విషయంలో కనిపిస్తున్న పరిస్థితి భయానకంగా ఉందని వైద్యులూ ఒప్పుకుంటున్నారు. కరోనా సోకిన ప్రారంభదశలోనూ అనంతరం కూడా ఆ వైరస్‌ శరీరంలో ఎలాంటి మలుపు తిరుగుతుంది, ఏ అవయవంపై ప్రభావం చూపుతుందనేది అంచనా వేయటం కష్టంగానే ఉందని చెప్తున్నారు.


ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నందున ఆ రంగాలకు చెందిన వైద్యుల ద్వారా చికిత్స పొందటం ఉత్తమమని సూచిస్తున్నారు. అన్నిటికీ మించి నెగెటివ్‌ వచ్చిన తర్వాత 3 నెలలపాటు తాము సూచించే మందులు వాడటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటే ఈ సమస్యలను అధిగమించవచ్చని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కరోనా అనంతర మరణాలు పెరగటంతో రానున్న పక్షం లేక నెలరోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆందోళన కలిగిస్తోంది.


నెగెటివ్‌ వచ్చిన కొద్దిరోజులకు మరణాలు

కొవిడ్‌ బాధితులు చికిత్స అనంతరం నెగెటివ్‌ వచ్చి కూడా పలు రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.  అలాంటి వారిలో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా ఆందోళనకరంగానే ఉంది. వాస్తవానికి కరోనాతో చికిత్స పొందుతున్న బాధితుల్లో మృతి చెందేవారి కన్నా కరోనా అనంతర ం బయటపడుతున్న ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్యే జిల్లాలో అధికంగా కనిపిస్తోంది. ఇలాంటి వారిని అధికారికంగా పరిగణనలోకి తీసుకోవటం లేదు. అందువలన కరోనా అనంతర సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు  వెలుగులోకి రావటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, బాధితులు ఆ వైపు దృష్టిపెట్టకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


నిర్లక్ష్యం.. అవగాహన లోపం 

 కరోనా అనంతర మరణాలు పెరిగిపోవడానికి బాధితుల్లో ఉన్న నిర్లక్ష్యం, అవగాహనా లోపం, అన్నింటికీ మించి అవసరాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. నాకు కరోనా నెగెటివ్‌ వచ్చింది, ఇక ఇబ్బందేముందంటూ మరుసటి రోజే విందు చేసుకున్న ఓ నలభై ఏళ్ల యువకుడు ఒక్కరోజు వ్యవధిలోనే మృతి చెందడం ఇక్కడ పరిశీలనాంశం. అలాంటి వారి శాతం అతితక్కువ అయినప్పటికీ నెగెటివ్‌ వచ్చిన వెంటనే వైద్య చికిత్సను పక్కనబెట్టటం, కనీస విశ్రాంతి, జాగ్రత్తలు కూడా లేకుండా తిరుగుతుండటం కూడా మరణాలకు కారణంగా కనిపిస్తోంది. వీటిన్నింటికీ తోడు వృత్తి, కుటుంబపరమైన అవసరాల కోసం కరోనా నెగెటివ్‌ అని వచ్చిన మరుక్షణమే పనుల్లో బిజీ అవుతున్న వారూ ఉన్నారు. అయితే కరోనా అనంతరం డాక్టర్ల సూచనలు కనీసం కూడా పాటించకపోవటం, మందులు వాడకపోవటం కూడా బాధితులకు శాపంగా మారుతోంది. అన్ని జాగ్రత్తలున్నా కొందరిని ఏదో ఒక వ్యాధి పట్టిపీడించి మృత్యువులోకి నెడుతోంది.

Updated Date - 2020-10-19T19:53:50+05:30 IST