Abn logo
Jan 7 2021 @ 04:29AM

కొత్త ఉపద్రవం

కరోనాదెబ్బతో వందలకోట్ల రూపాయల ఆర్థిక నష్టం చవిచూసి, క్రమంగా కుదుటపడుతున్న పౌల్ట్రీ రంగాన్ని ఇప్పుడు కొత్త విపత్తు చుట్టుముడుతోంది. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వ్యాప్తిని నిరోధించడానికి కేరళ రాష్ట్రం దానిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించి కోళ్ళు, బాతుల వధతో వైరస్‌మీద యుద్ధం చేస్తున్నది. ప్రస్తుతానికి ఐదు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం విస్పష్టంగా ఉండటంతో కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు అక్కడకు తరలివెడుతున్నాయి. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలనీ, కోళ్లు ఇతరత్రా జీవులను పూర్తిస్థాయి జాగ్రత్తలతో భద్రంగా పెంచడంతో పాటు, వాటిలో వస్తున్న మార్పులపై కన్నేసి ఉంచాలని కేంద్రం కోరుతున్నది. జంతు సంరక్షణ కేంద్రాలు, అటవీ ప్రాంతాల్లో అసహజ మరణాలను నమోదు చేసి, పరీక్షలతో వ్యాధి నిర్థారణ చేయమని కూడా సూచిస్తోంది. 


హిమాచల్‌ ప్రదేశ్‌లో వలసపక్షుల అసహజమరణంతో పాటు ఆయా రాష్ట్రాల్లో కాకులు, బాతులు ఇత్యాది జీవులు కన్నుమూస్తుండటంతో దేశం యావత్తూ అప్రమత్తమైంది. హర్యాణాలో పదిరోజుల్లో వేలాది కోళ్ళు చనిపోయిన వార్తలూ వచ్చాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో విదేశీ వలసపక్షులు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో కాకులు, పలు ఇతర పక్షులు, ఇలా వేర్వేరు రాష్ట్రాల్లో సంభవిస్తున్న పరిణామాలు ఈ వైరస్‌ వ్యాప్తి వేగాన్ని నిర్థారిస్తున్నాయి. వైరస్‌ ప్రభావం పౌల్ట్రీని ఇంకా చుట్టుముట్టని రాష్ట్రాలు ఉత్పాతాన్ని నిరోధించడానికి తమ వంతు ప్రయత్నాలు ఏవో చేస్తున్నాయి. ఇక, కేరళ ప్రభుత్వం ప్రత్యేక బృందాల ఏర్పాటుతో పక్షుల సామూహిక వధకు ఉపక్రమించింది. వైరస్‌ ప్రభావం సోకిన ప్రాంతాలకు కిలోమీటర్‌ దూరంలో ఉన్న జీవులను సైతం ముందుజాగ్రత్త చర్యగా సంహరిస్తున్నది. సహజంగానే ఇరుగు పొరుగు రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యల పేరిట పౌల్ట్రీ ఉత్పత్తులను నిరోధిస్తాయి కనుక కేరళకు ఈ సెగ ముందుగా సోకింది. మధ్యప్రదేశ్‌ సైతం కొన్ని దక్షిణాది రాష్ట్రాలనుంచి చికెన్‌ దిగుమతులను కొంతకాలం నిషేధించింది. వైరస్‌ గురించి ఆందోళన చెందనక్కరలేదనీ, గుడ్లు, చికెన్‌ బాగా ఉడికించి తింటే చాలునని అధికారులు హామీ ఇస్తున్నారు. అలాగే, వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో ఈ ఉత్పత్తుల వినియోగం విషయంలో ఏ భయం అక్కరలేదనీ అంటున్నారు. కానీ, ఇటువంటి సందర్భాల్లో ప్రజల్లో నెలకొనే అనుమానాలు సహజంగానే పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బకొడతాయి. కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు గుడ్లు, చికెన్‌ షాపులను ముందుజాగ్రత్త చర్యగా మూసివేయించారు. బర్డ్‌ ఫ్లూ ప్రభావం మనుషులమీద ఉండదని గట్టిగా చెప్పలేం. జలుబు నుంచి తీవ్ర శ్వాసకోశ సమస్యల వరకూ ఇది సృష్టించవచ్చు. ప్రాణాలు పోవడమూ సంభవమే. వైరస్‌ సోకిన పౌల్ట్రీ పక్షులను తాకడం వల్లా, వాటి వ్యర్థాలను శుభ్రపరచడంలో భాగంగానూ వ్యాధి మనుషులకు వ్యాపించవచ్చును కనుక కోళ్ళపెంపకం దారులు, పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు జాగ్రత్త పడటం అవసరం. అరుదుగానే అయినప్పటికీ, కుక్కలు పిల్లులు సహా ఇతర పెంపుడు జంతువులకు కూడా ఈ వైరస్‌ వ్యాపించవచ్చును. 


భారత్‌లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని పదిహేనేళ్ళక్రితమే గుర్తించినా, ఐదేళ్ళుగా క్రమం తప్పకుండా ఎంతోకొంత స్థాయిలో మనదేశం దీనిని ఎదుర్కొంటున్నది. శీతాకాలంలో విదేశీ వలసపక్షుల రాకతో తప్పని బాధ ఇది. చాలా చలి దేశాలు ఈ వ్యాధి విషయంలో ఇప్పటికే అప్రమత్తమైనాయి. ఫ్రాన్స్‌ సహా పలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు లక్షలాది బాతులను, ఇతర పెంపుడు పక్షులను సంహరించాయి. ఈ వ్యాధి కారణంగా ఆసియా దేశాల్లో ఏటా లక్షలాది పక్షుల సామూహిక హననం జరుగుతూనే ఉంది. బర్డ్‌ఫ్లూ కారణంగా ప్రపంచం ఏటా కొన్ని వందల బిలియన్‌ డాలర్లు నష్టపోతున్నది. ఖర్చుదారీ వ్యవహారం కావడంతో వాక్సిన్‌ రూపకల్పన మీద ఇప్పటివరకూ శ్రద్ధపెట్టలేదు. వ్యాధి నివారణ మందులు కూడా ఇప్పటివరకూ లేకపోవడం వల్ల బర్డ్‌ఫ్లూ వ్యాపించినప్పుడు జీవులను పెద్ద సంఖ్యలో వధించడం, పౌల్ట్రీపరిశ్రమ తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూడటం తప్పడం లేదు.

Advertisement
Advertisement
Advertisement