సంస్కరణలపై ప్రధాన దృష్టి : ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

ABN , First Publish Date - 2022-05-01T18:07:32+05:30 IST

భారత సైన్యం విధి నిర్వహణ, కార్యకలాపాల్లో సమర్థతను

సంస్కరణలపై ప్రధాన దృష్టి : ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

న్యూఢిల్లీ : భారత సైన్యం విధి నిర్వహణ, కార్యకలాపాల్లో సమర్థతను పెంచేందుకు ప్రస్తుత సంస్కరణలు, పునర్నిర్మాణం, పరివర్తనలపై ప్రధానంగా దృష్టి పెడతానని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం చెప్పారు. సైన్యానికి దేశ నిర్మాణంలో గొప్ప కీర్తిప్రతిష్ఠలు ఉన్నాయని, దేశ రక్షణ కోసం కృషిని కొనసాగిస్తామని చెప్పారు.  గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 


భౌగోళిక రాజకీయ పరిస్థితి వేగంగా మారుతోందన్నారు. మనకు అనేక సవాళ్ళు ఉన్నాయని చెప్పారు. అన్ని విభాగాలతో కలిసి ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండటం భారత సైన్యం కర్తవ్యమని తెలిపారు. గతంలో సేవలందించిన ఆర్మీ చీఫ్‌లు చేసిన కృషిని  కొనసాగిస్తానని చెప్పారు. ప్రస్తుత, సమకాలిక, భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కొనడానికి కార్యకలాపాల సన్నద్ధత అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఉండేవిధంగా చూడటానికే తాను ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, దళాల ఆధునికీకరణ విషయంలో దేశీయ, స్వయం సమృద్ధత ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైన్యానికి అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తానని తెలిపారు. 


భారత వాయు సేన, భారత నావికా దళాల చీఫ్‌లతో తనకు పరిచయం ఉందన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం, సహకారం, ఉమ్మడితత్వాలకు ఇది నాంది అని చెప్పారు. త్రివిధ దళాలు కలిసికట్టుగా పని చేస్తామని, దేశ భధ్రత, రక్షణ కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నానన్నారు. 


భారత సైన్యానికి నాయకత్వం వహించే బాధ్యతను తనకు అప్పగించడం గర్వకారణమని తెలిపారు. దేశ భద్రత, సమగ్రతలను కాపాడటంలో భారత సైన్యానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. అదే విధంగా దేశ నిర్మాణం కోసం కూడా సైన్యం కృషి చేసిందన్నారు. 


జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే స్థానంలో జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్ పదవీ కాలం మూడేళ్ళు లేదా వయసు 62 సంవత్సరాలు, ఈ రెండిటిలో ఏది ముందు అయితే, అప్పుడు పదవీ విరమణ చేయవలసి ఉంటుంది. 


Updated Date - 2022-05-01T18:07:32+05:30 IST