లక్షాధికారులుగా మహిళలు!

ABN , First Publish Date - 2022-02-03T07:11:46+05:30 IST

పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వడం ద్వారా మహిళలను లక్షాధికారులను చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. కట్టిన ఇళ్లలో చాలామటుకు వారి పేర్లతోనే రిజిస్టర్‌ అవుతున్నాయని, వారు యజమానులుగా...

లక్షాధికారులుగా మహిళలు!

పక్కా ఇళ్లతో ఓనర్లను చేస్తున్నాం: మోదీ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వడం ద్వారా మహిళలను లక్షాధికారులను చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. కట్టిన ఇళ్లలో చాలామటుకు వారి పేర్లతోనే రిజిస్టర్‌ అవుతున్నాయని, వారు యజమానులుగా మారుతున్నారని తెలిపారు. గత ఏడేళ్లలో 3 కోట్ల మంది పేదలకు సొంతింటి కల నెరవేర్చామన్నారు. దేశ స్వావలంబన దిశగా కొత్త బడ్జెట్‌ ఉందన్నారు. బుధవారం బీజేపీ నిర్వహించిన ‘ఆత్మనిర్భర్‌ అర్థవ్యవస్థ’ అనే సదస్సులో ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. కేంద్ర మంత్రులు, దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు వీక్షించారు. కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచం పరిణామ క్రమంలో ఉందని.. స్వావలంబన దేశంగా ఆవిర్భవించేందుకు భారత్‌ శరవేగంగా మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక్క జన్‌ధన్‌ యోజన ఖాతాయే పేదల జీవితాలను మార్చుతున్నప్పుడు.. నిలువ నీడ కల్పిస్తే వారి జీవితాలు ఇంకెంత మారతాయని ప్రశ్నించారు.  వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామన్న ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. కనీస మద్దతు ధరపై అపోహలు ప్రచారం చేస్తున్నాయని.. ఈ ఒక్క సీజన్లోనే మద్దతు ధర కింద రైతులకు రూ.లక్షన్నర కోట్లు అందనున్నాయని తెలిపారు.


ప్రభుత్వ పెట్టుబడి అప్పుడెంత.. ఇప్పుడెంత? 

యూపీఏ పాలనతో పోల్చితే ప్రభుత్వ పెట్టుబడి వ్యయం నాలుగింతలు పెరిగిందని ప్రధాని తెలిపారు. 2013-14లో రూ.1.87 లక్షల కోట్లుగా ఉంటే.. కొత్త బడ్జెట్‌లో 7.5 లక్షల కోట్లుగా ప్రతిపాదించాం. మా ప్రభుత్వ సమర్థ విధానాల కారణంగా ఎగుమతులు రూ.2.50 లక్షల కోట్ల నుంచి రూ.4.70 లక్షల కోట్లకు పెరిగాయి. 2013-14లో విదేశీ మారక నిల్వలు 275 బిలియన్‌ డాలర్లు ఉండేవి. ఇప్పుడు 630 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. బడ్జెట్‌లో ప్రధాన అంశం ఏమిటంటే... పేదలు, మధ్య తరగతి, యువతకు మౌలిక వసతుల కల్పన. ఈ విషయంలో సంతృప్తస్థాయి సాధించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. 


సరిహద్దు గ్రామాల్లో యువతకు ఎన్‌సీసీ శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నాం. యూపీ, మధ్యప్రదేశ్‌లలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడానికి రూ.44 వేల కోట్లతో కెన్‌-బెత్వా నదుల అనుసంధానం తలపెట్టాం. దీనితో ఈ ప్రాంత ముఖచిత్రమే మారిపోతుంది’ అని వివరించారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఇలాంటి కీలకాంశాలన్నిటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, వారిలో చైతన్యం తేవాలని పిలుపిచ్చారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన డిజిటల్‌ రూపాయిని నగదుగా మార్చుకోవచ్చని ప్రధాని తెలిపారు. ఇది ఫిన్‌టెక్‌ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందన్నారు. కాగా, తాజా కేంద్ర బడ్జెట్‌ అభివృద్ధి దిశగా ఉందని.. అయితే ఉపాధి పెంచే అవకాశాలు అందులో లేవని ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ వ్యాఖ్యానించింది. 

 

అనైతిక ‘వైద్య’ యాప్‌లపై ఉక్కుపాదం మోపండి: సర్జన్ల సంఘం

పేషెంట్లను ఏ మాత్రం పరిశీలించకుండా.. నేరుగా సర్జన్లకు, డాక్టర్లకు రిఫర్‌ చేసే మొబైల్‌ యాప్‌లపై ‘ద అసోసియేషన్‌ ఆఫ్‌ మినిమల్‌ యాక్సెస్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా (అమాసి)’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అనైతిక విధానాన్ని కట్టడి చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేసింది. 

Updated Date - 2022-02-03T07:11:46+05:30 IST