సీడబ్ల్యూసీలో వాగ్యుద్ధం

ABN , First Publish Date - 2021-01-23T06:38:53+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నియామకం మరో ఆరునెలల పాటు వాయిదాపడింది. శుక్రవారం జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఈ విషయమై వాగ్యుద్ధం కూడా చోటుచేసుకున్నట్లు

సీడబ్ల్యూసీలో వాగ్యుద్ధం

తక్షణమే ఎన్నికలు జరపాలని రెబెల్స్‌ పట్టు

వాయిదాకు గాంధీల విధేయుల డిమాండ్‌

అసెంబ్లీ ఎన్నికల తర్వాతే: రాహుల్‌ స్పష్టీకరణ

మే 29న కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌!.. జూన్‌లో ప్లీనరీ


న్యూఢిల్లీ, జనవరి 22: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నియామకం మరో ఆరునెలల పాటు వాయిదాపడింది. శుక్రవారం జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఈ విషయమై వాగ్యుద్ధం కూడా చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంస్థాగత ఎన్నికలను వెంటనే జరపాలని గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ మొదలైనవారితో కూడిన అసమ్మతి బృందం పట్టుబట్టింది. కానీ గాంధీల విధేయ నేతలు మాత్రం ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపాక దీన్ని చేపట్టవచ్చని వాదించారు. కార్యకర్తలు, దిగువ స్థాయి నేతలకు దిశానిర్దేశం కోసం వెంటనే ఎన్నికలు జరపడం మంచిదన్న వాదనను చిదంబరం, ముకుల్‌ వాస్నిక్‌, ఆజాద్‌ గట్టిగా సమర్థించారు. ‘అంతర్గత ఎన్నికలు కాదు, నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించే విషయమై దృష్టిపెట్టాలి’ అని గాంధీల విధేయుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. ‘‘అంతర్గత ఎన్నికల గురించి మన పార్టీలో జరుగుతున్నట్లు బీజేపీలో ఎన్నడైనా చర్చ జరిగిందా?’ అని మరో నేత ప్రశ్నించినట్లు తెలిసింది. అతడితో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ఏకే ఆంటోనీ, ఊమెన్‌ చాందీ, తారిక్‌ అన్వర్‌ మొదలైన విధేయవర్గం సమర్థించింది.


వాదన ఎంతకీ తెగకపోవడంతో రాహుల్‌ గాంధీ కల్పించుకుని అసెంబ్లీ ఎన్నికల తర్వాతే అధ్యక్ష ఎన్నిక అని అన్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి ఇది తేలిపోతుందని రాహులే స్వయంగా అన్నట్లు తెలిసింది. మూడున్నర గంటలపాటు వర్చువల్‌గా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఎక్కువ సేపు సంస్థాగత అంశాలపైనే చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూన్‌ నాటికి పార్టీకి అధ్యక్షుడిని  ఎన్నుకుంటాం’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్‌ వర్గాల సమాచారం ప్రకారం మే 29వ తేదీన అఽధ్యక్ష ఎన్నిక జరపాలని సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ(సీఈఏ) చీఫ్‌ మధుసూదన్‌ మిస్త్రీ ప్రతిపాదించారు. ‘‘అధ్యక్షుడి ఎన్నిక తరువాత సీడబ్ల్యూసీ, ఇతర సంస్థాగత ఎన్నికలు జరపాలా లేక ముందే నిర్వహించాల్సి ఉంటుందా..? అన్నది స్పష్టత రావాలి. ఈ విషయంలో పార్టీ నియమావళిలో ఏముందన్నది పరిశీలిస్తాం. ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయం... తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించాం’’ అని వేణుగోపాల్‌ వివరించారు. ‘‘మే నెలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఉంటుంది. దానిని బట్టి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ను అవసరమైతే స్పల్పంగా మారుస్తాం. జూన్‌ నెలాఖరు నాటికి ఏఐసీసీ ప్లీనరీని నిర్వహించాలని సోనియాను కోరాం’’ అని తెలిపారు. కాగా.. సమావేశంలో ఎవరూ ఎలాంటి అసమ్మతీ ప్రకటించలేదని పార్టీ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా చెప్పారు.


సమావేశం మరో మూడు తీర్మానాలను కూడా ఆమోదించింది. ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్‌లను ఒప్పుకుని తెచ్చిన మూడు సాగుచట్టాలను కేంద్రం రద్దు చేయాలని, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను అధికార రహస్యాల చట్ట నిబంధనలను ఉల్లంఘించి రిపబ్లిక్‌ చానెల్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామికి లీకైన విషయమై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత విచారణ జరపాలని, పేద, నిమ్న వర్గాలకు నిర్దిష్ట కాలావధిలోగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ తీర్మానాలను ఆమోదించారు.

Updated Date - 2021-01-23T06:38:53+05:30 IST