చిన్నారుల కోసం కొత్త యాప్‌లు వచ్చేశాయోచ్!

ABN , First Publish Date - 2021-06-05T19:11:48+05:30 IST

కరోనాతో విద్యార్థులకు సంవత్సరకాలంగా ఆటలు లేవు. బయటకు షికార్లు కూడా

చిన్నారుల కోసం కొత్త యాప్‌లు వచ్చేశాయోచ్!

  • యా..ప్‌ హూ!
  • చిన్నారులకు పాఠ్యేతర అంశాల పట్ల ఆసక్తి కలిగిస్తున్న యాప్‌లు
  • కరోనా కాలంలో ఉపయోగపడతాయంటున్న రూపకర్తలు

హైదరాబాద్‌ సిటీ : కరోనాతో విద్యార్థులకు సంవత్సరకాలంగా ఆటలు లేవు. బయటకు షికార్లు కూడా లేవు. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ అన్నీ చాలామందికి అటకెక్కాయి. ఆన్‌లైన్‌ క్లాస్‌లు లేదంటే టీవీలు చూడడం, వీడియో గేమ్స్‌ ఆడడం తప్ప అంతకు మించి ఏమీ ఉండటం లేదు. అలాంటి వారికి ఈ - లెర్నింగ్‌ అపార అవకాశాలు కల్పిస్తోంది. ఇందు కోసం ఎన్నో యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో చిన్నారులకు అధికంగా తోడ్పడే యాప్‌లను ఓ సారి పరిశీలిస్తే...


క్రీజో ఫన్‌ 

వినూత్నమైన ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇది. తమ అభిరుచులు, ఆసక్తులను చిన్నారులు గుర్తించడంలో సహాయపడుతుంది. చిన్నారుల సామాజిక, భౌతిక, మేధో, సృజనాత్మక, భావోద్వేగ ఎదుగుదలను పరిగణనలోకి తీసుకుని సృజనాత్మక నిపుణుల బృందం దీన్ని తయారుచేసింది. నైపుణ్యాభివృద్ధి సదస్సులను సైతం వారు నిర్వహిస్తారు. బహుముఖ అభ్యాసం ద్వారా చిన్నారులు నిష్ణాతులయ్యేందుకు ఈ యాప్‌ తోడ్పడుతుందని చెబుతున్నారు.


ఫింటో బాక్స్‌ 

విద్యానిపుణుల సహకారంతో తీర్చిదిద్దిన అభ్యాస కార్యక్రమాలను ఇది అందిస్తోంది. వీటితో పాటుగా స్టెమ్‌ యాక్టివిటీస్‌ కూడా భాగంగా ఉంటాయి. దీనిలో సృజనాత్మక ఆర్ట్‌, శాస్త్ర ప్రయోగాలు ఉంటాయి. ఎర్లీ చైల్డ్‌హుడ్‌ డెవల్‌పమెంట్‌ కోసం ఇవి ఉపయోగపడతాయి. ఈ యాప్‌ ఉచితంగా కాకుండా చందా రూపంలో లభిస్తుంది. టోడ్లర్లకు 3-4 యాక్టివిటీలను వీరు అందిస్తారు. స్టోరీ రీడింగ్‌, స్టోరీ టెల్లింగ్‌ను వినోదాత్మకంగా అందించడం వల్ల చిన్నారులు మరింత ఆసక్తిని కనబరుస్తారు. 


కిడ్స్‌ పాస్‌ 

అభ్యాస, వినోద వేదికగా కిడ్స్‌ పాస్‌ నిలుస్తుంది. దీని ద్వారా టీచర్లతో వారు కనెక్ట్‌ కావడంతో పాటుగా చిన్నారులు మరింతగా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఈ యాప్‌ సహాయంతో తల్లిదండ్రులు విద్యా కార్యక్రమాలు, ఆన్‌లైన్‌ తరగతులు, క్యాంప్స్‌ లాంటివి బుక్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా చిన్నారులు తమ జ్ఞానం మెరుగుపరుచుకోవడంతో పాటుగా శారీరక అభివృద్ధిని పొందగలరు. 


ఐ ఛాంప్‌..

భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్‌ సృజనాత్మక వేదిక. ఆంగ్లం, గణితంను వినోదాత్మక మార్గంలో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ యాప్‌ సహజమైన క్విజ్‌ ఆధారిత అభ్యాసాన్ని అందించడం ద్వారా 5-13 సంవత్సరాల చిన్నారులకు తోడ్పడుతుంది. గేమింగ్‌ ద్వారా చిన్నారులు నేర్చుకునే అవకాశం ఈ యాప్‌ కల్పిస్తుంది.


కుటుకి... 

చిన్నారుల అభ్యాసానికి తోడ్పాటునందించే అనుకూలీకరణ యాప్‌ ఇది. పాఠశాల విద్య ఆరంభమయ్యే నాటికి చిన్నారులు నేర్చుకునేందుకు ఇది తోడ్పడుతుంది. అంతేకాదు చిన్నారుల తెలివితేటలు వృద్ధి కావడానికి దోహదపడుతుంది.

Updated Date - 2021-06-05T19:11:48+05:30 IST