కొత్త ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి

ABN , First Publish Date - 2021-10-01T06:52:23+05:30 IST

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) 27వ అధిపతిగా వివేక్‌ రామ్‌

కొత్త ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి

  •  హైదరాబాద్‌తో అనుబంధం.. 
  • ఉత్తమ్‌తో కలిసి భెల్‌లో విద్యాభ్యాసం 


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 30: భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) 27వ అధిపతిగా వివేక్‌ రామ్‌ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా.. గురువారం పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టిన వీఆర్‌ చౌదరి.. వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడడమే తమ అంతిమ లక్ష్యమని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధాలతో అనుసంధానించడం ద్వారా వాయుసేనను బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు. తన హయాంలో ఎయిర్‌ఫోర్స్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లగలనన్న నమ్మకం తనకుందని చెప్పారు. భవిష్యత్తులో భద్రతా సవాళ్లను ఎదుర్కొనే దిశగా సరికొత్త శిక్షణా పద్ధతులను అవలంబించాలని సూచించారు.


వీఆర్‌ చౌదరి.. మన హైదరాబాద్‌ విద్యార్థే..!

నూతన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరికి హైదరాబాద్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర కాగా.. ఆయన కుటుంబం చాన్నాళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆయన తండ్రి ఆర్‌జీ చౌదరి.. రామచంద్రాపురంలోని భెల్‌ ట్రైనింగ్‌ స్కూల్లో సీనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేయగా.. తల్లి సుహాస్‌ చౌదరి అక్కడే హయ్యర్‌ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆ సమయంలో వీఆర్‌ చౌదరి అదే స్కూల్‌లో చదువుకున్నారు.


టీపీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా ఈ స్కూల్‌లోనే వీఆర్‌ చౌదరితో కలిసి చదువుకోవడం గమనార్హం. ఆయన స్నేహితులు కూడా ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నారు. 1979లో పాఠశాల విద్యను పూర్తి చేసిన చౌదరి.. 1982 డిసెంబరు 29న భారత వైమానిక దళంలో పైలట్‌గా చేరారు. అక్కడ కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. చౌదరితో కలిసి పనిచేశారు. తర్వాత ఉత్తమ్‌.. రాజకీయాల్లోకి వచ్చేయగా.. చౌదరి మాత్రం అక్కడే కొనసాగారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ డిప్యూటీ కమాండర్‌గానూ చౌదరి పనిచేశారు. ప్రస్తుతం చౌదరి తల్లిదండ్రులు సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. 


Updated Date - 2021-10-01T06:52:23+05:30 IST