ఈయేడూ.. మూత‘బడి’!

ABN , First Publish Date - 2022-01-19T06:24:50+05:30 IST

కరోనా వైరస్‌ ఈ యేడు కూడా విద్యారంగాన్ని వదిలి పెట్టేలా లేదు. అసలే ఆలస్యంగా ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ మూత బడ్డాయి. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించి నాలుగు నెలలు గడిచేలోపే సెలవులతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు.

ఈయేడూ.. మూత‘బడి’!
విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు (ఫైల్‌)

జిల్లాలో తడబడుతూ సాగుతున్న చదువులు

కొన్నిరోజులే ప్రత్యక్ష బోధన.. పూర్తికాని సిలబస్‌

సెలవుల పొడగింపుపై అయోమయం

వ్యవసాయ పనుల్లో గ్రామీణ విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా మొత్తం 702 ప్రభుత్వ పాఠశాలలు కాగా,149 ప్రైవేట్‌ పాఠశాలలు

వీటి పరిధిలో 70వేలకు పైగా విద్యార్థులు

ఆదిలాబాద్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ఈ యేడు కూడా విద్యారంగాన్ని వదిలి పెట్టేలా లేదు. అసలే ఆలస్యంగా ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ మూత బడ్డాయి. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించి నాలుగు నెలలు గడిచేలోపే సెలవులతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. గతంలోనూ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులను నిర్వహించి సిలబస్‌ పూర్తికాలేదన్న ఉద్దేశంతో అందరినీ పై తరగతులకు పంపించారు. ఇం టర్‌ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించి పలితాలను ప్రకటించినా.. ఆశించిన స్థాయిలో ఫలితా లు రాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం అందరినీ పాస్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా తడబడుతూనే చదువులు ముందుకు సాగుతున్నాయి. జిల్లా లో 702 ప్రభుత్వ పాఠశాలలు, 149 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. అంతేకాకుండా వీటి పరిధిలో 70వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల పని దినాలు పూర్తికాకుండానే విద్యా సంవత్సరం ముగిసి పోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. 

సగం రోజులు సెలవులే..

దశల వారీగా పదో తరగతి వరకు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించి నా.. పాఠశాలలు నడిచింది కొన్నిరోజులు మాత్రమే. సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు వరకు నెల రోజుల పాటు బాగానే కొనసాగినా.. అక్టోబరు 6నుంచి 17 వరకు దసరా సెలవులను ప్రకటించారు. ఆ తర్వాత క్రిస్మస్‌ సెలవులు, డిసెంబరు 6నుంచి ఉపాధ్యాయుల బదిలీల గందరగోళం.. దీంతో చదువులు నామమాత్రంగానే సాగాయి. ఇది ముగిసింది అనుకుంటున్న సమయంలోనే జనవరి 8నుంచి 16వరకు ముందస్తు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. పండుగ తర్వాతనైనా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారనుకుంటే.. మళ్లీ జనవరి 30వరకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. నాలుగు నెలలో, సగం సెలవులే కావడంతో సుమారుగా 50 శాతం సిలబస్‌ కూడా పూర్తి కాలేదని ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు. దీంతో పదో తరగతి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వార్షిక పరీక్షలు దగ్గర పడడంతో ప్రభుత్వ నిర్ణయం మళ్లీ ఎలా ఉంటుందోనన్న అయోమయానికి గురవుతున్నారు. 

ఇప్పట్లో కష్టమే..

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇప్పట్లో ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 16 నుంచి 30 వరకు సెలవులను పొడగించిన తర్వాత ఎప్పుడు ప్రారంభిస్తారో?నన్న దానిపై స్పష్టత లేదు. పరిస్థితి ఇలానే ఉంటే పాఠశాలల ప్రారంభం అనుమానంగానే కనిపిస్తోంది. ఆరు నెలల తర్వాత జిల్లాలో భారీగా కేసులు పెరిగిపోవడంతో అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఆన్‌లైన్‌ తరగతులపై కూడా ఇంకా స్పష్టమైన ఆదేశాలు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సంక్రాంతి సెలవుల్లోనే ఉన్నారు. ఇప్పట్లో ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించినా.. అంత గా ప్రయోజనం ఉండదంటున్నారు. జిల్లాలో ఎక్కువగా గ్రామీణ విద్యా ర్థులే కావడంతో కనీసం సగం మంది విద్యార్థులకైనా స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులో లేవని తెలుస్తుంది. వరుసగా సెలవులు రావడం తో కొందరు గ్రామీణ విద్యార్థులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. తల్లిదండ్రులకు తమవంతు సహకారం అందిస్తూ సాగు పనులకు పరిమితమవుతున్నారు. సెలవులను పొడగించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగడంతో ఈ యేడు కూడా విద్యా సంవత్స రం అస్తవ్యస్తంగానే మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి

: కొమ్ము కృష్ణకుమార్‌, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు

కరోనా తీవ్రత నేపథ్యంలోనే సెలవులను పొడగిస్తే బాగుండేది. ప్రస్తుతం జిల్లాలో అలాంటి పరిస్థితులు లేవు. అయినా విద్యార్థులకు నష్టం జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పాఠశాలలకు సెలవులు ప్రకటించి ఇతర వ్యాపారాలను కొనసాగిస్తే ఫలితమే ఉండదు. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో? స్పష్టత లేదు. టీనేజర్స్‌కు వ్యాక్సినేషన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. పాఠశాలలను కొనసాగిస్తేనే విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉంటుంది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తరగతుల నిర్వహణ

: ప్రణీత, జిల్లా విద్యాశాఖాధికారి, ఆదిలాబాద్‌

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తాం. ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు రాక విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సెలవుల్లోనే ఉన్నారు. సంక్రాంతి సెలవులను పొడగించినా.. ఎప్పుడు ప్రారంభిస్తారో? చెప్పలేని పరిస్థితి ఉంది. గడిచిన నాలుగు నెల ల్లో ఆశించిన స్థాయిలోనే సిలబస్‌ను పూర్తి చేశాం. పాఠశాలలు ప్రారంభమైతే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించి సిలబస్‌ను పూర్తి చేస్తాం. 

Updated Date - 2022-01-19T06:24:50+05:30 IST