గూడుకట్టిన నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-01T05:09:56+05:30 IST

పట్టణ పేదలకు గృహ యోగం ఇప్పట్లో కలిగేలా కన్పించడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా.. అప్పటికే కట్టిన టిడ్కో ఇళ్లు శిథిలమవుతున్నా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. పేదలను ఉసూరుమనిపిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో నిలువనీడలేక అల్లాడుతున్న నిరుపేదల కోసం గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల (జి+3) నిర్మాణాలను తలపెట్టింది.

గూడుకట్టిన నిర్లక్ష్యం
చింతల సమీపంలో నీటిలో ఉన్న టిడ్కో ఇళ్లు ( ఇన్‌సెట్లో) గదుల్లో మొలిచిన పిచ్చిమొక్కలు

ప్రవేశాలకు నోచుకోని టిడ్కో లబ్ధిదారులు

టీడీపీ హయాంలో నిర్మాణాలు 

పలుచోట్ల 90శాతానికి పైగా పూర్తి 

వైసీపీ అధికారంలోకి వచ్చాక 

అర్ధంతరంగా పనుల నిలిపివేత

మూడేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు

చాలా గృహాలు పాడైపోయిన వైనం

నీళ్లలో సముదాయాలు 

పిచ్చిమొక్కలు, విరిగిన తలుపులు దర్శనం

అతీగతీలేని అసంపూర్తి నిర్మాణాలకు కొత్త టెండర్లు

ఒంగోలు (కార్పొరేషన్‌) జూలై 31 : 


పట్టణ పేదలకు సొంత గూడు కల్పించేందుకు గత టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అద్దె జీవితాలను సొంతింటికి చేర్చే కలల సౌధాల సాకారం విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఆ భవనాలు మోక్షం లభించ లేదు. గత ఎన్నికలకు ముందు అనేక చోట్ల 90శాతం పనులు పూర్తయి గృహ ప్రవేశాలకు ఆహ్వానం పలికిన పరిస్థితులు ఉండగా, ఇప్పుడు అంతా నీళ్లు, పిచ్చిమొక్కలు, ఊడిపోయిన తలుపులు, పగిలిపోయిన ఫ్లోరింగ్‌తో దర్శనమిస్తున్నాయి. అప్పు తెచ్చి డిపాజిట్లు చెల్లించిన వారు ఒకవైపు వాటికి వడ్డీలు చెల్లించలేక, మరోవైపు అద్దెలు చెల్లించలేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం గృహ ప్రవేశాలకు ఎప్పుడు ఆహ్వానిస్తుందోనని ఆశతో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. 


పట్టణ పేదలకు  గృహ యోగం ఇప్పట్లో కలిగేలా కన్పించడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా.. అప్పటికే కట్టిన టిడ్కో ఇళ్లు శిథిలమవుతున్నా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. పేదలను ఉసూరుమనిపిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో నిలువనీడలేక అల్లాడుతున్న నిరుపేదల కోసం గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో  ఇళ్ల (జి+3) నిర్మాణాలను తలపెట్టింది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పలుచోట్ల పనులను ప్రారంభించింది. వాటిలో చాలాచోట్ల 90శాతం పైన పనులను పూర్తి చేసింది. ఇక గృహప్రవేశాలే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఎన్నికలు వచ్చాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ గృహ సముదాయాలపై తీవ్ర నిర్లక్ష్యం చూపింది. పనులను అర్ధంతరంగా నిలిపివేసింది. 

రివర్స్‌ టెండర్ల పేరుతో హడావుడి

ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, మూడు మున్సిపాలిటీలు, నాలుగు నగర పాలకసంస్థల్లో నిర్మాణంలో ఉన్న జి+3 గృహాల పనుల కోసం రివర్స్‌ టెండర్లు పిలవాలని రెండున్నరేళ్ల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికే పూర్తయిన గృహాలు, అసంపూర్తిగా ఉన్నవి, కనీసం బేస్‌మెంట్‌ లెవల్‌లో లేని వాటిని ఏపీ టిడ్కో అధికారులు సిద్ధం చేసినట్లు హడావుడి చేశారు. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. గత ఎన్నికల ముందు లాటరీ ప్రక్రియ నిర్వహించి కొందరికి ఫ్లాట్లు కేటాయించడంతో ఎన్నికల అనంతరం  గృహ ప్రవేశాలు జరుగుతాయని లబ్ధిదారులు భావించారు. కానీ మూడేళ్లుగా మోక్షం లభించలేదు. 


ఉమ్మడి జిల్లాలో 9,568 మందికి టీడీపీ హయాంలోనే అర్హత పత్రాలు

ఉమ్మడి జిల్లాలో టిడ్కో ఇళ్లకు అర్హత సాధించిన వారు 9,568 మంది ఉండగా వారందరికీ అర్హత పత్రాలు గత టీడీపీ ప్రభుత్వంలోనే అందజేశారు. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలో 4,128ని ఎంపిక చేసి నివాసాలు కేటాయించారు. మార్కాపురంలో 912, అద్దంకిలో 960, కందుకూరులో 1,408, కనిగిరిలో 912, గిద్దలూరులో 1,248 మందిని ఎంపిక చేశారు. కందుకూరు మునిసిపాలిటీ మొదటి దశలో టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా దాదాపు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే 60 నుంచి 70 శాతం పనులు పూర్తిగా కాగా ఆ తర్వాత మూడేళ్ల నుంచి పురోగతి కరువైంది. మొత్తంగా జిల్లాలో 9,568 మంది లబ్ధిదారులు అప్పులు చేసి మరీ లక్షలు రూపాయలు చెల్లించినా నేటికీ ఇంటిలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. 

 

అయోమయంలో లబ్ధిదారులు

ఒంగోలు సమీపంలోని చింతల, కొప్పోలు వద్ద మొదటి, రెండో దశల్లో ప్రారంభించి దాదాపు పూర్తయిన 4,128 ఇళ్లకు సంబంధించి గత ఎన్నికలకు ముందే లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ, రిజిస్ట్రేషన్‌లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకూ ఒక్కరు కూడా గృహ ప్రవేశం చేయలేదు. కొప్పోలు వద్ద నిర్మిస్తున్న రెండో దశ ఇళ్ల నిర్మాణం గందరగోళంగా మారింది. వీటిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. 


మూడేళ్లుగా నిలిచిన పనులు 

ఒంగోలు నగరంలో 18వేల మందికి సొంతిల్లు నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో చింతల వద్ద రూ.80కోట్ల వ్యయంతో 1,392 గృహాలను చేపట్టింది. 2019 ఎన్నికలకు ముందు పనులు దాదాపు పూర్తయ్యాయి. అంతర్గత రహదారులు, గృహాల లోపల కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అనంతరం ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పనులు ఆగిపోయాయి. ఇక ఒంగోలు సమీపంలోని కొప్పోలు వద్ద రూ.450కోట్లతో 4,656 గృహ నిర్మాణ పనులను టీడీపీ హయాంలోనే చేపట్టారు. వాటిలో 2,736 ఫ్లాట్లు పూర్తయ్యాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టింది.

 

అడవిని తలపిస్తున్న టిడ్కో ప్రాంగణాలు 

టిడ్కో ఇళ్లపై కోటి ఆశలతో ఉన్న లబ్ధిదారులు వాస్తవ పరిస్థితిని చూసి తమకు సొంత ఇల్లు సాధ్యమేనా? అని అనుమానిస్తున్నారు. గృహ సముదాయాల గురించి ప్రభుత్వం మూడేళ్లుగా పట్టించుకోకపోవడంతో అనేక చోట్ల ఫ్లోరింగ్‌, మెట్లు పగిలిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో అడవిని తలపించే విధంగా చెట్లు పెరిగిపోయి పాములు, విషపురుగులు సంచరిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసిన పనులను పునఃప్రారంభించకపోవడంతో  ఎండకు, వానకు ఇనుము తడిసి తుప్పు పట్టింది. కొప్పోలులో కనీస రహదారులు కల్పించకపోగా, చింతల వద్ద వాన నీరు చేరి ప్రాంగణంలో కాలు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది.  



Updated Date - 2022-08-01T05:09:56+05:30 IST