భారత్‌తో సరిహద్దు వివాదంపై నేపాల్ మంత్రి వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-16T20:39:43+05:30 IST

భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం సత్వరమే పరిష్కారమవాలని నేపాల్ విదేశాంగ

భారత్‌తో సరిహద్దు వివాదంపై నేపాల్ మంత్రి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం సత్వరమే పరిష్కారమవాలని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గియావలి అన్నారు. భారత దేశంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో సమావేశమయ్యారు, శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. 


శనివారం ప్రదీప్ కుమార్‌తో చర్చల సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్, నేపాల్ మధ్య సంబంధాలకు విస్తృత పరిధి ఉందని, ఇరు దేశాల ప్రజలు ఈ సంబంధాలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ఈ సమావేశం అద్భుతంగా సాగిందన్నారు. నేపాల్‌తో భారత దేశ సంబంధాలు కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాదని, ఇరు దేశాల ప్రజలు ఈ సంబంధాలను నడిపిస్తున్నారని అన్నారు. 


ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం సత్వరమే పరిష్కారమవాలన్నారు. ఇరు దేశాలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నాయన్నారు. దేశ సరిహద్దులను స్పష్టంగా గుర్తించడం చాలా ముఖ్యమైన విషయమని చెప్పారు. కాలాపానీ ప్రాంతంపై ఏర్పడిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఈ విషయంలో నేపాల్ వైఖరిని పునరుద్ఘాటించవలసిన అవసరం లేదన్నారు. దీని గురించి చారిత్రక పత్రాలు వివరంగా చెబుతాయన్నారు. 


భారత్-నేపాల్ సరిహద్దుల మ్యాపింగ్ 1981లో ప్రారంభమైందని,  అయితే, రెండు ప్రాంతాలను మ్యాప్ చేయలేదని అన్నారు. వీటిలో కాలాపానీ ప్రాంతం ఒకటి అని తెలిపారు. భారత్, నేపాల్ దేశాల సర్వేయర్ జనరల్స్ నేతృత్వంలో బౌండరీ వర్కింగ్ గ్రూప్ ఉందన్నారు. దీని గురించి ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులు పరిశీలించాలని చెప్పారు. దీనికి పరిష్కారం దొరికితే, గత కాలపు సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. 


ప్రదీప్ కుమార్ గియావలి మూడు రోజుల భారత దేశ పర్యటన శనివారంతో ముగుస్తుంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో శుక్రవారం జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. రాజకీయ, భద్రత సంబంధిత అంశాలపై చర్చ జరిగింది. సరిహద్దుల నిర్వహణపై కూడా చర్చించారు. క్రాస్ బోర్డర్ రైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులపై కూడా పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. 


Updated Date - 2021-01-16T20:39:43+05:30 IST