కన్నీటి వ్యధ తప్పదా!?

ABN , First Publish Date - 2022-06-07T05:27:44+05:30 IST

2020, 2021 సంవత్సరాల్లో వరుసగా పెన్నా నదికి వరదలు పోటెత్తడంతో పెన్నా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

కన్నీటి వ్యధ తప్పదా!?
నెల్లూరు : గతేడాది నవంబరు 20వ తేదీన పెన్నా నది ఉధృతికి నీట మునిగిన భగత్‌సింగ్‌ కాలనీ

రెండేళ్లుగా నెల్లూరును వణికించిన పెన్నమ్మ

పోటెత్తిన వరదతో నగర ప్రజానీకం బెంబేలు

పొర్లుకట్టల నిర్మాణం ఎప్పటికి ప్రారంభమయ్యేనో!?

ముఖ్యమంత్రి హామీకే దిక్కులేదు!

టెండర్లతోనే సరిపెడుతున్న అధికారులు


వర్షాకాలం సీజన్‌ వస్తోందంటే నెల్లూరు నగర వాసుల్లో వణుకు మొదలవుతోంది. గడిచిన రెండేళ్లుగా పెన్నమ్మ ఉప్పొంగడంతో నగరంలో పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఈ ఏడాది కూడా వరద ముంపు తప్పదా అన్న భయం వారిలో నెలకొంది. గతేడాది వరదల సమయంలో స్వయంగా సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వచ్చి ముంపు ప్రాంతాల్లో పర్యటించి మరోమారు వరద బారిన పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఇరిగేషన్‌ అధికారులు టెండర్ల మీద టెండర్లు పిలుస్తున్నారే తప్ప పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. 


నెల్లూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : 2020, 2021 సంవత్సరాల్లో వరుసగా పెన్నా నదికి వరదలు పోటెత్తడంతో పెన్నా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 2020, నవంబరులో సంభవించిన వరదలకు అనేక చోట్ల పెన్నా పొర్లుకట్టలు ధ్వంసమయ్యాయి. నెల్లూరులోని భగత్‌సింగ్‌ కాలనీ, జనార్ధన్‌రెడ్డి  కాలనీ, ఇస్లాంపేట, వెంకటేశ్వరపురం ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. కొన్ని రోజుల పాటు ఆ ప్రాంత వాసులు కట్టుబట్టలతో ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇళ్లల్లోని సామగ్రి అంతా దెబ్బతినడంతో పేద కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. అప్పటి మంత్రులు పోలుబోయిన అనీల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డిలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి పొర్లుకట్టల నిర్మాణానికి హామీ ఇచ్చారు. అయితే అది జరగలేదు. ఆ తర్వాత 2021లోనూ వరదలు పోటెత్తడంతో అవే ప్రాంతలు మళ్లీ ముంపునకు గురయ్యాయి. ఈ వరద ముంపు ప్రాంతాల్లో డిసెంబరు 3వ తేదీన సీఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటించారు. భగత్‌సింగ్‌ కాలనీలో పర్యటించిన సందర్భంగా సీఎం పలు హామీలు ఇచ్చారు. పండుగ పోయాక మళ్లీ వచ్చి పెన్నా పొర్లుకట్టల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. మరోసారి వరద ముంపు బారిన పడకుండా నెల్లూరు నగరాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. అయితే పండుగ  (సంక్రాంతి) పోయి సుమారు 5 నెలలు దాటింది. కానీ ఇంత వరకు పెన్నా పొర్లుకట్టల పనులు మొదలు కాలేదు. 


వివాదాల టెండర్లు

గతేడాది వరదల సమయంలో రూ.80.56 కోట్ల అంచనాతో పొర్లుకట్టల నిర్మాణాలకు తెలుగు గంగ ప్రాజెక్టు అధికారులు టెండర్లు పిలిచారు. డిసెంబరులో టెండర్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఈ వర్కును దక్కించుకునేందుకు అధికార పార్టీలోని ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో అందరి  దృష్టి ఇటు మళ్లింది. నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా ఇద్దరు డిస్‌క్వాలిఫై అయ్యారు. మిగిలిన ఇద్దరు రివర్స్‌ టెండరింగ్‌లో నువ్వా.. నేనా.. అన్నట్లు పోటీ పడటంతో చివరకు 13.38 శాతం లెస్‌కు (రూ.69.78 కోట్లు) శ్రీసాయి కృష్ణ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ పనులు దక్కించుకుంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధికి వర్కు దక్కకపోవడంతో ఈ వర్కును రద్దు చేస్తారంటూ అప్పటి నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగానే అగ్రిమెంటు జరగాల్సిన సమయంలో మట్టికట్టల స్థానంలో కాంక్రీటు గోడలు నిర్మించాలన్న కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. మట్టికట్ట నిర్మిస్తే ఎక్కువ ఇళ్లు తొలగించాల్సి ఉంటుందని, అదే కాంక్రీటు గోడ అయితే తక్కువ ఇళ్లను తొలగిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక ఎస్టిమేషన్లు తయారు చేసిన అధికారులకు ఈ విషయం ముందుగా తెలియదా.. అన్నదే అసలు ప్రశ్న. ఇక ఎట్టకేలకు రూ.81.85 కోట్లకు అంచనాలు సవరించి మరోమారు టెండర్లు పిలిచారు. ఈ దఫా కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్లో పాల్గొన్నాయి. మొదటిసారి మాదిరిగా ఇక్కడ పోటీ జరగలేదు. దీంతో 3.55 శాతం ఎక్సె్‌సతో రూ.84.76 కోట్లకు బెకెమ్‌-సిరి జాయింట్‌ వెంచర్‌ సంస్థ పనులు దక్కించుకుంది. ఇదంతా ఏప్రిల్‌లో జరగ్గా అప్పటి నుంచి కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీవోటీ) అనుమతి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ అనుమతి కూడా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్‌తో అగ్రిమెంటు చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాతనే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతారు. అయితే ఇదంతా జరగడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి. సాధారణంగా అక్టోబరు నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తాయి. వచ్చే నెలలో పనులు మొదలు పెట్టినప్పటికీ మూడు నెలల్లో పొర్లుకట్టల నిర్మాణం పూర్తి చేయడం సాధ్యపడుతుందా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పనులపై తెలుగు గంగ సీఈ హరినారాయణరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ సీవోటీ అనుమతి సీఈ కార్యాలయానికి అందిందని చెప్పారు.  ఎస్‌ఈ కార్యాలయానికి పంపి కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు మొదలుపెడతామని చెప్పారు.  

Updated Date - 2022-06-07T05:27:44+05:30 IST