నెల్లూరు బార్ల టెండర్లలో సిండికేట్‌

ABN , First Publish Date - 2022-08-01T02:31:26+05:30 IST

పాత వ్యాపారలు, అధికార పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి బార్ల వేలంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.

నెల్లూరు బార్ల టెండర్లలో సిండికేట్‌

నెల్లూరు: పాత వ్యాపారలు, అధికార పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి బార్ల వేలంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. కందుకూరు మున్సిపాలిటీలో రూ.1.15 కోట్ల రూపాయలు పలికిన బార్లు, నెల్లూరు సిటీలో ఒక్కో బార్‌ కేవలం రూ.54 లక్షలకే పరిమితం కావడం విశేషం. మొత్తం 35 బార్లకు 61 మంది టెండర్లు వేశారు. వీరిలో 35 మంది పాత బార్‌ యజమానులు కాగా 16 మంది కొత్త వారు. అధికార పార్టీ నాయకులు పాత వ్యాపారులను, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని ఒక చోటకు చేర్చి  టెండర్లలో పోటీ పెరగకుండా ఉండేలా ఒప్పందం చేశారు. ఆ మేరకే పాత వ్యాపారస్తులు రూ.58 లోల నుంచి 54 లక్షల రూపాయల వరకు కోడ్‌ చేయగా, కొత్తవారు రూ.52 లక్షలు మాత్రమే కోడ్‌ చేసేలా నిర్ణయించారు. ఆ మేరకే టెండర్లు కోడ్‌ చేయడంతో పాత వ్యాపారులందరికీ రూ. 54లక్షల ఫీజుతో తిరిగి బార్లు దక్కాయి. అయితే ఒప్పందం ప్రకారం తక్కువ కోడ్‌ చేసి బార్లు వదులుకున్న కొత్తవారికి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, మధ్యవర్తిత్వం నడిపిన అధికార పార్టీ నాయకులకు బార్‌కు రూ.15 లక్షలు చొప్పున సిండికేట్‌ సభ్యులు చెల్లించనున్నారు. సోమవారం ఈ మొత్తం పంపకాలు జరగనున్నాయి.


విశేషమేమంటే నెల్లూరు సిటీలో ఒక బార్‌ ద్వారా వ్యాపారి ప్రభుత్వానికి చెల్లించే మొత్తం రూ. 54లక్షలు కాగా,  పంపకాలతో కలుపుకుంటే వ్యాపారి ఒక బార్‌పై పెట్టిన వాస్తవ పెట్టుబడి రూ.కోటి నుంచి 1.20 కోట్ల వరకు లెక్కతేలుతోంది. అంటే నెల్లూరులో బార్ల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కన్నా మధ్యవర్తులు ఆరగించే ఆదాయమే ఎక్కువ కావడం గమనార్హం. మరోవైపు కావలిలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు వ్యాపారులను సిండికేట్‌ చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడంతోపాటు తను భారీగా ప్రయోజనం పొందినట్లు ప్రచారం జరుగుతోంది. పట్టణంలో మొత్తం బార్లు ఉండగా, కేవలం ఆరుగురు మాత్రమే టెండర్లు వేశారు. ఇందుకుగగాను ఒక్కో బార్‌ నుంచి సదరు నేతకు రూ.30 లక్షలు చొప్పున ముడుపులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2022-08-01T02:31:26+05:30 IST