సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-12T05:49:59+05:30 IST

ఏళ్లు గడు స్తున్నా జలవనరుల శాఖలో సాగునీటి ప్రాజెక్ట్‌లు ముందు కు కదలడం లేదు. ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంతో అధికారులు ప్రతిపాదనలతోనే సరిపెట్టేస్తున్నా రు.

సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం
తగరకుంట వద్ద హంద్రీనీవా కాలువ1బి- తగరకుంట వద్ద హంద్రీనీవా కాలువ

 - పట్టించుకోని ప్రజాప్రతినిధులు

- ప్రతిపాదనలతో సరిపెడుతున్న అధికారులు

- జలవనరుల శాఖపై ప్రభుత్వం సవతిప్రేమ

- నిధుల కేటాయింపులలోనూ వివక్ష

- ఏళ్లు గడిచిన మోక్షం కలగని పరిస్థితి

- కాలువల పటిష్టతకు కానరాని చర్యలు 

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 11: ఏళ్లు గడు స్తున్నా జలవనరుల శాఖలో సాగునీటి ప్రాజెక్ట్‌లు ముందు కు కదలడం లేదు. ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంతో అధికారులు ప్రతిపాదనలతోనే సరిపెట్టేస్తున్నా రు. గత మూడేళ్లుగా ఉమ్మడి జిల్లాకు ఒక్కపైసా కూడా ప్రభుత్వం విదల్చక పోగా, పలు పనులను రద్దు చేసింది. బకాయిలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. అసం పూర్తిగా ఉన్న నిర్మాణపనులు, మరమ్మతులు, నీటి ఎత్తిపోతకు వాడుకున్న కరెంటుకు కూడా బిల్లుల చెల్లింపు పూర్తిగా నిలిపివేశారు. నీళ్లేమో అన్ని నియోజకవర్గాలకు కావాలని ఆయా ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఆ నీటిని తీసుకెళ్లేందుకు అవసరమైన కాలువ మార్గాన్ని భద్రం చేసి, సామర్థ్యం పెంచుకోవాలనే కనీస బాధ్యతను విస్మరిస్తున్నారు. కాలువ పటిష్టత, ప్రత్యామ్నా య కాలువలైన సమాంతర కాలువల నిర్మాణంపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో జరిగే నీటిపారుదల సలహాల మండలి (ఐఏబీ) సమావేశంలో ప్రస్తావించడం వరకే ప్రజాప్రతినిధులు తమ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఆ తరువాత ఐఏబీ సమావేశంలో చర్చించిన అంశాల  పురోగతిపై అడిగే నాథుడే లేడు. 


పట్టించుకోని  ప్రజాప్రతినిధులు

తమకేమీ సంబంధం లేదు అన్నట్లుగా జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు నీటి ప్రాజెక్టుల పట్ల వ్యవహరిస్తున్నారు. గత మే 20న నిర్వహించిన ఐఏబీ సమావేశంలో జిల్లా ఇనచార్జి మంత్రితో పాటు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లాకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిఽధులు ప్రగల్భాలు పలికారు. అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే సీఎంతో మాట్లాడి నిధులు రాబట్టుకుంటామని పెద్దపెద్ద మాటలు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలపై ఏ ప్రజాప్రతినిధి మాట్లాడిన దాఖలాలు కనిపించడం లేదు. కాగా నిధుల కేటాయింపులోనూ నిర్లక్ష్యం కళ్లకు కట్టిన ట్లుగా కనిపిస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని  జలవనరుల శాఖకు సుమారు రూ.1500కోట్లు నిధులు అవసరం కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.210కోట్లు మాత్రమే కేటాయించారు. హంద్రీనీవాకు రూ.1100కోట్లు అవసరం కాగా ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.148కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.  ఇందులో కూడా రూ.8 కోట్లకు కోత పెడుతూ రూ.140 కోట్లు కేటాయించారు. హెచ్చెల్సీకి రూ.400కోట్లు నిధులు అవసరం కాగా బడ్జెట్‌లో రూ.150కోట్లు చూపించగా ప్రస్తుతం రూ.70కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్నిబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌ల పట్ల పాలకులు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. 


  హంద్రీనీవా ప్రాజెక్టుకు కటకటే!

జిల్లాకు కీలకమైన హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సైతం నిధులు మంజూరు చేయడం లేదు. ప్రధానంగా జీడిపల్లి రిజర్వా యర్‌ నుంచి 61కిలోమీటర్ల మేర రూ.450కోట్లతో చేపడుతు న్న భైరవానతిప్ప ప్రాజెక్ట్ట్‌కు కృష్ణా జలాలు తరలించేం దుకు గత ప్రభుత్వంలో నిధులు కేటాయిస్తూ అనుమతు లు మంజూరు చేశారు. గత మూడేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన రూ.50కోట్లు మినహా ఇప్పటి వరకు ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కపైసా కూడా చెల్లించలేదు. ఇదిలా ఉంటే అదే జీడిపల్లి నుంచి పేరూరు ప్రాజెక్ట్‌కు కృష్ణాజలాలు తరలించేందుకు గాను రూ. 813 కోట్లతో 54కిలోమీటర్లలో రెండు రిజర్వా యర్లు, నాలుగు పంప్‌హౌస్‌లు.. నిర్మించాలని నిర్ణయించా రు. దీనికి అనుమతులు మంజూరు చేస్తూ, నిధులు కేటాయించారు. అప్పట్లో ప్రభుత్వం రూ.50కోట్లు మంజూ రు చేసింది. ఇక అంతే అప్పటి నుంచి నిధులు లేవు. ఇక ముచ్చుమర్రి నుంచి హంద్రీనీవా సమాంతర కాలవ చేపట్టాలని, డిసి్ట్రబ్యూటరీలు నిర్మించాలని చేపట్టిన ప్రాజెక్టులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియని పరిస్థితి. 


హెచ్చెల్సీ పరిధిలోని పనుల పురోగతి ప్రశ్నార్థకం... 

హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం మారిన ప్రతిసారి పనులు నిలిపి, తిరిగి ప్రారంభించి కాంట్రాక్టర్లను మార్చడం పరిపాటిగా మారింది. గడిచిన 13ఏళ్లలో సగం వరకే పూర్తి చేశారు. అయితే 2009లో ప్రాజెక్ట్‌కు కేటాయించిన రూ.450కోట్లలో రూ.300కోట్ల వరకు నిధులు ఖర్చు చేశారు. మిగిలిన రూ.150కోట్ల పనులు చేయాల్సి ఉంది. అయితే గత మూడేళ్లుగా ఒక్క పని కూడా ముందు కు సాగకపోగా, నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో కాలువలకు ఇరువైపులా, మధ్యలో కంప చెట్లు, మట్టి పేరుకుపోయింది. తుంగభద్ర ఎగువ కాలవ (హెచ్చెల్సీ) మోడరైజేషన (ఆధునీకరణ) పనులలో తీవ్రజాప్యం, నిర్లక్ష్యం నెలకొంది. దీంతో రూ.350కోట్లు అదనపు ఆర్థికభారం పడుతోంది. మూడేళ్ల కాలంలో ఆధునికీకరణ పూర్తి చేయాల్సి ఉన్నా 13ఏళ్లుగా పనులు నత్త నడకన సాగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం హెచ్చెల్సీ పరిధిలో చేపడుతున్న పనులన్నీ దాదాపు రద్దు చేసింది.  హెచ్చెల్సీ మరమ్మతులకు గాను ఇటీవల రూ.18కోట్లకు టెండర్లు వేయగా ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాలేదు. ఇందుకు నిధుల లేమే కారణమని తెలుస్తోంది. హెచ్చెల్సీ కింద ఉన్న వంతెనలు ప్రమాదపుటంచున ఉన్నాయి. ప్రధాన కాలువను దాటేందు కు ఏర్పాటు చేసిన వంతెనలు చాలా ప్రాంతాల్లో బాగా దెబ్బతిన్నాయి. ఆంధ్రా సరిహద్దుల్లోని బొమ్మనహాళ్‌ మండలంలోని ఉద్దేహాళ్‌, దర్గాహొన్నూరుతో పాటు కణేకల్లు, కూడేరు మండలాల పరిధిలో సుమారు 50వరకు వంతెనలు బాగా దెబ్బతిన్నాయి. కొద్దిపాటి వర్షం వచ్చిన,  ప్రవాహ స్థాయి పెరిగినా కాలువలు తెగిపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆయా కాలువగట్లు, వంతెనలు, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కావడం లేదు. ప్రస్తుతం టీబీ డ్యాం నుంచి నీరు వస్తోంది. దీంతో ఎక్కడ కాలువ గండిపడి తెగిపోతుందోనని హెచ్చెల్సీ అధికారులు, ఇంజనీర్లు ఆందో ళన చెందుతున్నారు. ఒక వేళ గండిపడినా మరమ్మతు చేయడానికి కూడా ప్రభుత్వం నిధులు చెల్లించే పరిస్థితి కనుచూపుమేరలో కనబడడం లేదు. 


ప్రభుత్వానికి నివేదించాం: దేశేనాయక్‌, రాజశేఖర్‌. హంద్రీనీవా, హెచ్చెల్సీ ఎస్‌ఈలు

హంద్రీనీవా, హెచ్చెల్సీ కింద పెండింగ్‌ పనులు చేపట్టేందుకు వివరాలతో నివేదించాం. ప్రస్తుతం అటు టీబీ డ్యాం నుంచి ఇటు శ్రీశైలం డ్యాం నుంచి నీటి పంపిణీ జరుగుతోంది. ఈలోపు కాలువ ఎక్కడా దెబ్బతినకుండా, గండి పడకుండా క్షేత్రస్థాయిలో మా ఇంజనీర్లు, సిబ్బంది గస్తీ కాస్తున్నారు. చేపట్టాల్సిన పనులకు సంబంధించి అనుమతులు, నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతాం. హెచ్చెల్సీ, హంద్రీనీవా సమాంతర కాలవ నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. బీటీపీ, పేరూరు ప్రాజెక్ట్‌లపై చర్చించాం. ఇక బకాయిల కోసం అటు కాంట్రాక్టర్లు, ఇటు విద్యుత్తు అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు మంజూరు చేస్తే తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఇదే విషయాలను జిల్లా ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తున్నారు. నిధులు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. 

Updated Date - 2022-08-12T05:49:59+05:30 IST