సర్కారు ఆస్తులపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-17T05:34:11+05:30 IST

సర్కార్‌ స్థలాలు నిర్లక్ష్యానికి గురవుతు న్నాయి. కోట్ల రూపాయల

సర్కారు ఆస్తులపై నిర్లక్ష్యం
ఆమనగల్లు బస్టాండ్‌ వెనుక ఉన్న పట్టణ ప్రగతిలో కూల్చివేసిన భవనాలు

  • ఆమనగల్లులో కోట్ల విలువైన స్థలాలకు రక్షణ కరువు
  • ఫెన్సింగ్‌ లేకుండా బస్టాండ్‌ వెనుక ఉన్న స్థలం
  • స్థలాలను వినియోగంలోకి తేవాలంటున్న స్థానికులు  


ఆమనగల్లు : సర్కార్‌ స్థలాలు నిర్లక్ష్యానికి గురవుతు న్నాయి. కోట్ల రూపాయల విలువైన స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. ఆయా స్థ్థలాలను వినియోగంలోకి తెస్తే ప్రజావసరాలకు, కార్యాలయాలకు, విద్యాసంస్థలకు భవనాల సమస్య తొలగిపోతుంది. ఆమనగల్లు బస్టాండ్‌ వెనుక భాగంలో మండల పరిషత్‌ ఆధీనంలో ఉన్న పాత ఆసుపత్రి సిబ్బంది క్వార్టర్స్‌లో కొన్నింటిలో దశాబ్దం క్రితం వరకు నివాసం ఉన్నారు. మరో రెండు క్వార్టర్స్‌లో కొంత కాలం పీఏసీఎస్‌ కార్యాలయం నిర్వహించి ఆ తర్వాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఏడాది క్రితం మండల పరిషత్‌ ఆవరణలోని ఐకేపీ భవనంలోకి మార్చారు. సుమా రు 1500 గజాల స్థలంలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరడంతో 2020 జూన్‌ 7న పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీ అధికారులు వాటి కూల్చివేతను ప్రారంభించారు. 90శాతం పని పూర్తయ్యాక జడ్పీటీసీ అనురాధపత్యానాయక్‌, ఎంపీటీసీ దోనాదుల కుమార్‌, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు మండల పరిషత్‌కు సమాచారం లేకుండా భవనాల కూల్చివేతపై అభ్యంతరం తెలిపి నిరసనకు దిగారు. దీంతో కూల్చి వేసిన భవనాల మట్టిని తొలగించకపోగా, పాత పీఏసీఎస్‌ భవనం ఒకవైపు గోడతో మిగిలిపోయింది. బస్టాండ్‌ వెనుక భాగంలోని స్థలాన్ని కాపాడాలని, చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని పలువురు ఎంపీటీసీలు మండల సభలో అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో అధికారులు ఫెన్సింగ్‌కు రూ.94వేలతో ప్రతిపాదనలు రూపొందించి మున్సిపల్‌ శాఖ అనుమతికి నివేదించారు. కాగా నిధులు లేకపోవడం స్థలం ప్రైవేట్‌ వాహనాల పార్కింగ్‌కు, మూగజీవాలకు, మల మూత్ర విసర్జనకు అడ్డాగా మారింది. ముందు భాగంలో ఉన్న ఉన్నత పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరింది. ఇదే స్థలాన్ని పండ్ల మార్కెట్‌కు కూడా మున్సిపాలిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. స్థలం ఇలాగే వదిలేస్తే అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీసుస్టేషన్‌ వెనుకభాగంలో బీసీ హాస్టల్‌కు చెందిన కోట్ల విలువైన స్థలం కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది. నాలుగేళ్ల క్రితం బీసీ హాస్టల్‌ను ఎత్తివేయడంతో భవనం శిథిలావస్థకు చేరింది. ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు సమాచారం. శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిని అనుసరించి ఉన్న ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన స్థలం, భవనం కూడా వినియోగించక నిరూపయోగంగా ఉంది. కూరగాయల మార్కెట్‌లో మాంసం మార్కెట్‌ షెడ్డు కూడా వృథాగా ఉంది. 


ఎవరూ పట్టించుకోవడం లేదు

బస్టాండ్‌ వెనుక ఉన్న స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాం. పలుమార్లు మండల సమావేశాల్లో ఈ విషయాన్ని ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తెచ్చినా స్పందన లేదు. ప్రభుత్వ స్థలాలను కాపాడి ప్రజావసరాలకు వినియోగించాలి.

- దోనాదులకు కుమార్‌, ఎంపీటీసీ, పోలేపల్లి 


ప్రతిపాదనలు రూపొందించాం

బస్టాండ్‌ ఉన్నత పాఠశాల వెనుక భాగంలోని స్థల రక్షణకు చర్యలు చేపట్టాం. ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం. మున్సిపల్‌ శాఖ నుంచి అనుమతి రాగానే నిధుల మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.

- వెంకట్రాములు, ఎంపీడీవో, ఆమనగల్లు 



Updated Date - 2021-06-17T05:34:11+05:30 IST