తగ్గేదే లేదు...

ABN , First Publish Date - 2022-02-06T16:17:23+05:30 IST

‘నీట్‌ మినహాయింపు’ వ్యవహారంలో తగ్గేదేలేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై గతంలో అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిప్పి పంపిన నేపథ్యంలో.. మళ్లీ దానిని అసెంబ్లీలో ఆమోదించి

తగ్గేదే లేదు...

- మళ్లీ ‘నీట్‌ మినహాయింపు బిల్లు’

- 8న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

- అఖిలపక్షం తీర్మానం 

- అన్నాడీఎంకే, బీజేపీ గైర్హాజరు

- ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తామని ఓపీఎస్‌ లేఖ

- బాధ్యత విస్మరించిన గవర్నర్‌

- సమావేశంలో స్టాలిన్‌ ఆగ్రహం


చెన్నై: ‘నీట్‌ మినహాయింపు’ వ్యవహారంలో తగ్గేదేలేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై గతంలో అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిప్పి పంపిన నేపథ్యంలో.. మళ్లీ దానిని అసెంబ్లీలో ఆమోదించి ఆయనకు పంపాలని తేల్చేసింది. ఇందుకు అఖిలపక్షం కూడా ముక్తకంఠంతో జై కొట్టింది. ఆ మేరకు శనివారం సచివాలయంలో జరిగిన అఖలపక్ష సమావేశం ఏకగ్రీవం గా ఆమోదించింది. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, దాని మిత్రపక్షమైన బీజేపీ గైర్హాజరయ్యాయి. అయితే నీట్‌ రద్దు కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ మద్దతు వుంటుందని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రికి లేఖ రాయడం గమనార్హం. 


నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును గవర్నర్‌ ఇటీవల తిప్పి పంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశ మైంది. ఇందులో నేతలు కూలంకషంగా చర్చించిన అనంతరం బిల్లును మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపించాలని నిర్ణయించారు. అంతేగాక ఈ బిల్లును ఆమోదించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని కూడా తేల్చారు. పలువురు న్యాయనిపుణులతో సంప్రదింపులు అనంతరం.. నీట్‌ మినహాయింపు ముసాయిదా బిల్లును  ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నీట్‌ మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు సంపూర్ణ మద్దతునిస్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. అనంతరం.. గవర్నర్‌ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేలా మరిన్ని కొత్త అంశాలను చేర్చి నీట్‌ ముసాయిదా బిల్లును రూపొందించాలని అఖిలపక్షం తీర్మానించింది. ‘‘నీట్‌ కారణంగా రాష్ట్రంలో నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వైద్య కోర్సుల్లో ప్రవేశం పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారు. నీట్‌ విధానం రాష్ట్రంలో పాఠశాల విద్యకే ప్రాధా న్యత లేకుండా చేస్తోంది. నీట్‌ శిక్షణ పొందిన విద్యార్థులకు సానుకూలంగా .. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రతికూలంగా ఉంది. గతంలా ప్లస్‌-2 మార్కులు ప్రాతిపదికగానే వైద్య కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్‌ ఆమోదించి రాష్ట్రపతి పరిశీలనకు పంపించకుండా ఐదునెలల తర్వాత తిప్పిపంపటం గర్హనీయం. ఆ బిల్లును ఆమోదించాలంటూ ముఖ్యమంత్రి పలుమార్లు గవర్నర్‌ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు కూడా ఈ విషయమై రాష్ట్రపతిని, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకపోయింది. నీట్‌   మినహాయింపు బిల్లు జస్టిస్‌ ఏకే రాజన్‌ కమిటీ సిఫారసుల మేరకే రూపొం దించారనే విషయాన్ని కూడా గవర్నర్‌ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో మరిన్ని కొత్త అంశాలతో నీట్‌ మినహాయింపు బిల్లును రూపొందించి ఆమోదించి గవర్నర్‌కు పంపటానికి వీలయినంత త్వరగా శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టి, సమగ్రంగా చర్చించి గవర్నర్‌ పరిశీలనకు పంపాలి’’ అని అఖిలపక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది. 


బాధ్యత విస్మరించిన గవర్నర్‌: స్టాలిన్‌ ఆగ్రహం

రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన నీట్‌ బిల్లుపై నిర్ణయం తీసు కోవడంలో రాష్ట్ర గవర్నర్‌ రాజ్యాంగ ధర్మాసనం మేరకు తన బాధ్యత నిర్వర్తించ లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిల్లును తిప్పిపంపుతూ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమైనదంటూ గవర్నర్‌ పేర్కొనటం గర్హనీయ మన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు వేరు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసే బిల్లు వేరు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యకోర్సుల ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ 2006లో శాసనసభలో చేసిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 2006లో డాక్టర్‌ అనంతకృష్ణన్‌ కమిటీ సిఫారసుల ప్రాతిపదికగా ప్రవేశ పరీక్షల రద్దు కోసం అదే యేడాది డిసెంబర్‌ 6న అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్‌ పరిశీలనకు పంపి 86 రోజుల్లోగా రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. ఆ బిల్లు ఆమోదంతో పదేళ్లపాటు రాష్ట్రంలో వైద్య, ఇంజనీరింగ్‌ కోర్సులకు ప్రవేశ పరీక్షలతో నిమిత్తం లేకుండా మార్కుల ఆధారంగా విద్యార్థులు లబ్ధి పొందారు. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించ డానికి ముందు కేంద్ర విద్యాశాఖ, మానవవనరుల శాఖ ఆ బిల్లును ఆమో దించవచ్చని అభిప్రాయం వెలిబుచ్చాయి. ప్రస్తుతం నీట్‌ నిర్వహించే బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర ఆరోగ్యశాఖే ప్రవేశపరీక్షల రద్దు బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ అప్పట్లో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత ఆ బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపరీక్షల రద్దు చట్టం సామాజిక సంక్షేమానికి సంబంధించిన చట్టమే నంటూ హైకోర్టు కితాబునిచ్చింది. ప్రస్తుతం అప్పటి అసాధారణ పరిస్థితులే నెలకొనటంతో మేం అధికారంలోకి వచ్చిన వెంటనే నీట్‌ రద్దు కోసం జస్టిస్‌ ఏకే రాజన్‌ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని నీట్‌ మినహాయింపు బిల్లును రూపొందించి అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపాం. ఆ బిల్లును గవర్నర్‌ వెంటనే రాష్ట్రపతి పరిశీలన కు పంపించి ఉంటే బాగుండేది. అయితే గవర్నర్‌ తన బాధ్యత నిర్వర్తిం చలేదు. గత నవంబర్‌ 27న గవర్నర్‌ను స్వయంగా కలిసి ఆ బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని కోరాను. సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌ కూడా మరోమారు గవర్నర్‌ను కలిసి ఒత్తిడి చేశారు. ఇదే విషయమై ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయాలకు వెళ్ళి వినతి పత్రాలు కూడా సమర్పించారు. ఇటీవల ప్రధాని మోదీ రాష్ట్రంలో 11 వైద్యకళాశాలలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించినప్పుడు కూడా నీట్‌ మినహాయింపు బిల్లును ఆమోదించాలని కోరాను. శాసనసభలో ఆమోదించిన బిల్లును గవర్నర్‌ 142 రోజులపాటు పెండింగ్‌లో ఉంచి, ఈ యేడాది నీట్‌ ముగిసి,  అడ్మిషన్లు జరుగుతున్న సమయంలో ఆ బిల్లును పునఃపరిశీలించాలంటూ తిప్పి పంపారు. నీట్‌ సబబేనంటూ సుప్రీంకోర్టు తీర్పును గవర్నర్‌ ఉటం కించడం సమంజసం కాదు. 8 కోట్ల ప్రజల ఏకాభిప్రాయం మేరకు శాసనసభ ఆమోదించిన బిల్లుకు చట్టరూపం కల్పించే హక్కు రాష్ట్ర అధి కారానికి సంబంధించినది. ఇది శాసనసభ సార్వభౌమత్వానికి సంబంధిం చినది. నీట్‌పై సుప్రీం కోర్టు తీర్పు, రాష్ట్ర శాసనసభకు చట్టాన్ని రూపొందిం చేందుకు గల అధికారం వేర్వేన్నారు. ఈ కారణంగానే మేం నీట్‌ మినహా యింపు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోరుతున్నాం. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోక ముందే గవర్నర్‌ బిల్లును తిప్పిపంపిన అసాధారణ పరిస్థితుల్లో మా ప్రభుత్వం మరో బిల్లును రూపొందించటానికి సిద్ధమవుతోంది’’ అని స్టాలిన్‌ ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్‌, ఎం.సుబ్రమణ్యం, డీఎంకే తరఫున మంత్రి పొన్ముడి, కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కె. సెల్వపెరుందగై, పీఎంకే తరఫున ఎస్పీ వెంకటేశ్వరన్‌, సీపీఐ నుంచి డి.రామచంద్రన్‌, సీసీఎం నుంచి వీపీ నాగైమాలి, ఎండీఎంకే నుంచి ఏఆర్‌ రెహ్మాన్‌, డీపీఐ తరఫున ఎం. సెల్వన్‌, కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి తరఫున ఈఆర్‌ ఈశ్వరన్‌, తమిళగ వాళ్వురిమై కట్చి తరఫున వేల్‌మురుగన్‌, మనిదనేయ మక్కల్‌ కట్చి తరఫున ఎంహెచ్‌ జవాహిరుల్లా పాల్గొన్నారు.


నీట్‌ రద్దుకు మద్ధతిస్తాం: ఓపీఎస్‌ లేఖ

నీట్‌ రద్దుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న చర్యలకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశానికి రావాలని తమకు ఆహ్వానం అందిందని, అయితే ఈ వ్యవహారంపై తమ పార్టీ ఇదివరకే పలుమార్లు స్పష్టమైన అభిప్రాయాలను ప్రకటించిం దన్నారు. జనవరి 8న జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ తమ పార్టీ నీట్‌ రద్దుకే కట్టుబడి ఉందని స్పష్టం చేశామని గుర్తు చేశారు. అందుకే తాము ఈ సమావేశానికి రాలేదని వివరించారు. 


8న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

నీట్‌ మినహాయింపు కోరుతూ మరోమారు బిల్లు ఆమోదించేందుకు ఈ నెల 8వ తేదీ ఉదయం 10గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ సమావేశాలను బీజేపీ బహిష్కరించే సూచనలు కనిపిస్తున్నాయి. మిగిలిన పార్టీలన్నీ సమావేశాలకు హాజరై తమ అభిప్రాయం తెలుపనున్నాయి. కాగా ఈ ఈసారి కూడా నీట్‌ మినహాయింపు బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


Updated Date - 2022-02-06T16:17:23+05:30 IST