రాజకీయ చికిత్స కావాలి

ABN , First Publish Date - 2021-10-19T05:54:58+05:30 IST

ఇటీవలి సంవత్సరాలలో కశ్మీర్‌లో అక్టోబర్ మాసం ఎప్పుడూ ఇంత రక్తసిక్తం కాలేదు. జీవనోపాధి కోసం వలస వచ్చిన కార్మికులను మిలిటెంట్లు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఉపాధ్యాయుల దగ్గర నుంచి....

రాజకీయ చికిత్స కావాలి

ఇటీవలి సంవత్సరాలలో కశ్మీర్‌లో అక్టోబర్ మాసం ఎప్పుడూ ఇంత రక్తసిక్తం కాలేదు. జీవనోపాధి కోసం వలస వచ్చిన కార్మికులను మిలిటెంట్లు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఉపాధ్యాయుల దగ్గర నుంచి, కాయకష్టం చేసుకునే దాకా వారి అందరూ మృతులలో ఉన్నారు. ఇప్పటి దాకా పదిమంది పౌరులు మిలిటెంట్ల దాడులకు బలి అయ్యారు. తాజాగా ఆదివారం నాడు ఇద్దరు వలసకార్మికుల హత్యతో కశ్మీర్ భద్రతాయంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చిన వారందరినీ పోలీసు శిబిరాలలోకి తరలించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ సందర్భంగా అనేకమంది ఉన్నత స్థాయి మిలిటెంట్ నాయకులు ఎన్‌కౌంటర్లలో మరణించారు.   గత వారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది సైనికులు మరణించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. పూంచ్, రాజౌరీల మధ్య ఉన్న అటవీప్రాంతంలో పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకుని ఉన్నారని, వారిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెడుతున్నామని సైనికాధికారులు చెబుతున్నారు. 


ఒకవైపు కశ్మీర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, దాని ఆధారంగా తక్కిన దేశంలో జరుగుతున్న చర్చలు, ముందుకు వస్తున్న ప్రతిపాదనలు మరింత కలవరం కలిగించేవిగా ఉన్నాయి. ప్రతిఘటనా వేదిక (రెసిస్టెన్స్ ఫోరమ్) పేరుతో జరుగుతున్న దాడులన్నీ స్థానిక మిలిటెంట్లు చేస్తున్నవేనని, వారు గత రెండు సంవత్సరాల కాలంలో తీవ్రవాద భావాలకు ఆకర్షితులైనవారేనని పత్రికలు, ప్రజాసంస్థలు సూచిస్తుండగా, కశ్మీర్‌లో జరుగుతున్నదానికీ అఫ్ఘానిస్థాన్ పరిణామాలకు ముడిపెట్టడం, పాకిస్థాన్ ప్రేరేపిత చర్యలేనని ఆరోపించడం వింటున్నాము. ఇటువంటి చర్యలకు పాకిస్థాన్ దూరంగా ఉంటుందని ఎవరూ అనుకోనక్కరలేదు కానీ, సమస్య ఒకచోట ఉంటే, పరిష్కారాన్ని మరొకచోట వెదకడం వల్ల, ప్రజలు పడుతున్న కష్టాలు మరింతగా పెరుగుతాయి. పాకిస్థాన్ మీద మరోసారి సర్జికల్ దాడులు చేస్తామని హోంశాఖ మంత్రి హెచ్చరించడం, విదేశాంగ రాజకీయాల రీత్యా అవసరం కావచ్చును కానీ, సమస్య మూలకారణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కాగూడదు. స్థానికేతర కార్మికులందరినీ పోలీసు శిబిరాలకు తరలిస్తున్నారంటే, ఉగ్రవాదుల గురి ఎటు ఉన్నదో భద్రతాదళాలకు, ప్రభుత్వానికి స్పష్టత ఉన్నదన్న మాటే. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయడం ద్వారా, తదనంతర పాలనాచర్యల ద్వారా, జమ్మూకశ్మీర్‌లో స్థానికుల ప్రత్యేక హక్కులకు కాలం చెల్లుతున్న మాట తెలిసిందే. రెండేళ్ల కిందట కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయం, అనేక నిర్బంధ చర్యలతో పాటు అమలులోకి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రతిపత్తి మారిన జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ నేతలందరినీ అరెస్టు చేశారు. వేలాది మందిని వివిధ జైళ్లలో నిర్బంధంలో ఉంచారు. ఎన్‌కౌంటర్ల మరణాలు సరేసరి. ఇంతలో, కరోనా ఉపద్రవం ముంచుకురావడంతో, కశ్మీర్‌లో ప్రధానంగా మౌనరాగమే వినిపించింది. ఇప్పుడు జరుగుతున్న వరుసదాడులు 370 ఆర్టికల్ రద్దుకు, తమ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించినందుకు కశ్మీర్ నుంచి వ్యక్తమవుతున్న నిరసనగానే చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు. 


ఈ పరిస్థితిని కేవలం శాంతిభద్రతల పరిస్థితిగానే చూస్తే, కశ్మీర్‌లో సాధారణ జనజీవనం అతలాకుతలం కావడం తప్ప ప్రయోజనం ఉండదు. మరిన్ని కేంద్రబలగాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ దర్యాప్తు సంస్థ, గూఢచారి విభాగం అధికారులు కశ్మీర్‌లో మోహరించారు. సైనిక, పోలీసు యంత్రాంగాల ద్వారా పరిస్థితిని చక్కబరచగలిగితే, కశ్మీర్ ఎప్పుడో ప్రశాంతతకు చేరుకునేదేమో? మూడు దశాబ్దాల తరువాత కూడా కశ్మీర్ భద్రతావ్యవస్థలకు సవాల్‌గా ఉన్నదంటే, మన దృష్టిలో ఏదో పొరపాటు ఉన్నదని గ్రహించాలి. రెండేళ్ల తరువాత మొదటిసారి కశ్మీర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించి వెళ్లిన వెంటనే, ఈ సంఘటనలు మొదలయ్యాయంటే, నిరసనకారులు ఇస్తున్న సందేశం ఏమిటో గ్రహించాలి. పంతంతో తీసుకునే చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. అయినా, పంతానికి పోవడానికి అదేమీ శత్రుప్రాంతం కాదు. కేంద్రప్రభుత్వం చేసిన అతి పెద్ద పొరపాటు ఏమిటంటే, కశ్మీర్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేవారెవరూ లేకుండా చేయడం. ప్రధాన రాజకీయ పక్షాలన్నిటినీ నిర్బంధంలోకి నెట్టి, అనంతర శ్రేణుల కార్యకర్తలను కూడా ఎడతెగకుండా నిర్బంధించిన తరువాత, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు అంటూ ఎవరూ లేకుండా పోయారు. ఈ రెండేళ్ల కాలంలో రాజకీయపార్టీలపై కూడా కశ్మీర్ ప్రజల విశ్వాసం సడలిపోయి ఉంటుంది. స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించి, అట్టడుగు నుంచి నాయకత్వాన్ని నిర్మిస్తున్నామని కేంద్రప్రభుత్వం చెబుతున్నది కానీ, ఇటువంటి పరిస్థితులలో కల్పించుకోగలిగినది రాజకీయ నాయకత్వమే. 


కొవిడ్ మహమ్మారితో ఇంకా పోరు పూర్తి కాలేదు. చైనాతో సమస్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అఫ్ఘానిస్థాన్ పర్యవసానాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. దేశంలో అనేక అంతర్గత సమస్యలు రాజుకుంటున్నాయి. ఈ సమయంలో, సమస్యాత్మక ప్రాంతాలలో సాధ్యమైనంత మేరకు శాంతిని ఏర్పరచి, సుస్థిరత కోసం రాజకీయ సంప్రదింపులు మొదలుపెట్టడం మంచిది. సకల రాజకీయ పక్షాల ప్రతినిధులతో చర్చించి కశ్మీర్ విషయంలో వేయవలసిన అడుగులను నిర్ణయించడం మంచిది. ప్రయత్నిస్తే మార్గం దొరకకపోదు. 

Updated Date - 2021-10-19T05:54:58+05:30 IST